
యూరియా కోసం అగచాట్లు
ఎటపాక/రాజవొమ్మంగి: యూరియా కోసం రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. పంటను కాపాడుకునేందుకు ఒక్క బస్తా యూరియా కోసం రోడ్లపై గంటలకొద్దీ బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. మండల కేంద్రం రాజవొమ్మంగి పీఏసీఎస్‌కు, ఎటపాక మండలం ఎటపాక, తోటపల్లి రైతు భరోసా కేంద్రాలకు యూరియా వచ్చింది. రైతులకు యూరియా ఇచ్చేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. తెల్లవారు జామునుంచే ఆర్బీకేల ముందు భారీ సంఖ్యలో రైతులు బారులు తీరారు. తోటపల్లి ఆర్బీకే వద్ద అన్నదాతలు తమ చెప్పులను క్యూలైన్లో ఉంచి యూరియా కోసం ఎదురు చూశారు. మండుటెండలో క్యూలైన్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. సాయంత్రం వర్షం పడటంతో తోటపల్లిలో వర్షంలోనే తడుస్తూ నిలబడ్డారు. ఎటపాక, తోటపల్లి కేంద్రాల్లో సోమవారం 620 మందికి యూరియా ఇచ్చినట్లు ఏవో దుర్గాప్రసాద్ తెలిపారు. రాజవొమ్మంగి పీఏసీఎస్ వద్ద ఉదయం నుంచే రైతులు బారులు తీరారు. స్టాక్ అయిపోవడంతో అంతసేపు నిలుచున్నా చాలా మందికి యూరియా అందలేదు. దీంతో పలువురు ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి చక్రధర్‌ను వివరణ కోరగా సోమవారం సొసైటీ వద్ద 5.5 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశామన్నారు. మంగళవారం మరో 20 టన్నుల యూరియాను అందజేస్తామని చెప్పారు.

యూరియా కోసం అగచాట్లు