
మళ్లీ వరద భయం
కూనవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శబరి, గోదావరి నదులకు వరద పోటెత్తింది. కొండ్రాజుపేట కాజ్‌వేపైకి వరదనీరు చేరడంతో కూనవరం, టేకులబోరు నుంచి కొండ్రాజుపేటకు వెళ్లే రోడ్డు ముంపునకు గురైంది. కొండ్రాజుపేట, వాల్ఫ్‌ర్డ్ పేట, శబరి కొత్తగూడెం, వెంకన్నగూడెం, శ్రీరామ్‌పురం, పూసుగు గూడెం, కొత్తూరు, ఆంబోతుల గూడెం గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామస్తులు వివిధ పనులపై మండల కేంద్రానికి రావాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం సోమవారం సాయంత్రం 6.00 గంటలకు 39.5 అడుగులకు చేరింది. కూనవరంలో శబరి, గోదావరి సంగమం వద్ద సాయంత్రం 6.00 గంటలకు 33.56 అడుగులుగా నమోదైందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో ఎగువనున్న జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. సామర్థ్యాన్ని మించి వరద నీరు ప్రవహిస్తుండడంతో అదనపునీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటికి స్థానికంగా కురుస్తున్న వర్షం నీరు తోడవడంతో భద్రాచలానికి వరద పోటు మరింత పెరిగింది. ఉభయ నదుల మూలంగా విలీన మండలాలైన కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక ఇప్పటికే మూడు సార్లు వరద ముంపునకు గురయ్యాయి. నాల్గోసారి నీటి ప్రవాహం పెరుగుతుండడంతో ఆయా మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నాటికి కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో పలుచోట్ల రహదారులపైకి వరదనీరు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చింతూరు: భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతున్నందున డివిజన్‌లోని లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీ డీఏ పీవో శుభం నొఖ్వాల్ సోమవారం ఓ ప్రకటన లో తెలిపారు. గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి మొదటిప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలెవరూ చేపలవేటకు వెళ్లొద్దని,ప్రమాదకర వాగులు దాటొ ద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం డివిజన్‌లో కూనవరం మండలంలో కొండ్రాజుపేట–టేకులబోరు రహదారిపైకి వరదనీరు చేరడంతో రాకపో కలు నిలిచాయని పీవో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో చింతూరు సబ్‌కలెక్టర్ కార్యాలయంతో పా టు ఆయా మండలాల్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని ఆయన సూచించారు.

మళ్లీ వరద భయం