ఇచ్చోడ: ఆదివాసీ వృద్ధురాలికి అధికారులు అండగా నిలిచారు. ఆరు పదుల వయసున్న ఇంద్రమ్మ కుటుంబం ఇచ్చోడ మండల కేంద్రంలో కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగి కొనసాగిస్తుండగా విధి వారి కుటుంబాన్ని కాటేసింది. నాలుగేళ్లలో అనారోగ్యంతో వరుసగా భర్త, కుమారుడు, కోడలు మృత్యువాత పడ్డారు. ఇంద్రమ్మ కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు మనుమరాళ్లను చదివిస్తోంది. తన వయస్సు పైబడి పోవడంతో మనుమరాళ్లకు దారి చూపాలని ప్రజాఫిర్యాదుల విభాగంలో కలెక్టర్‌ను కలిసి గోడు వెల్లబోసుకుంది. చలించిన కలెక్టర్ రాజర్షిషా ప్రభుత్వం తరపున సాయం చేయాలని ఇచ్చోడ తహసీల్దార్ ఇమ్రాన్ పఠాన్‌ను ఆదేశించారు. మండలంలోని జున్ని శివారులో ఎకరం ప్రభుత్వ భూమిని ఇంద్రమ్మ పేరుపై పట్టా చేయించి గురువారం పత్రాలను ఆమెకు అందజేశారు.


