పత్తి చేనులో గంజాయి సాగు! | - | Sakshi
Sakshi News home page

పత్తి చేనులో గంజాయి సాగు!

Nov 27 2026 12:02 AM | Updated on Nov 27 2026 12:02 AM

రెండున్నర ఎకరాల్లో అంతర పంటగా.. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఓ రైతు ఏకంగా పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు ప్రారంభించాడు. పక్కా సమాచారం అందుకున్న మామడ పోలీసులు పంటపై దాడి చేయడంతోపాటు సాగు చేసిన రైతును అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ జానకీ శర్మ ఈ వివరాలను వెల్లడించారు. మామడ మండలం తాండ్ర గ్రామ పరిధిలోని ధన్జీనాయక్‌ తండాకు చెందిన కున్సోత్‌ రవి తన వ్యవసాయ పొలంలో పత్తి పంటతోపాటు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు సంబంధిత వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు చేపట్టి 204 పచ్చి గంజాయి మొక్కలు, 54 ఎండిన మొక్కలు, ప్లాస్టిక్‌ సంచిలో నిల్వ ఉంచిన 5.320 కిలోల ఎండిన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 258 మొక్కలు, 5.320 కిలోల ఆకుల విలువ సుమారు రూ.28.46 లక్షలుగా అంచనా వేశారు. ప్రభుత్వ అధికారులు, సాక్షుల సమక్షంలో స్వాధీనం ప్రక్రియ పూర్తి చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

అధిక ఆదాయం ఆశతో..

ఈ నెల 25న అందిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే క్షేత్రానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పత్తి మొక్కల మధ్య గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అధిక డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితుడు ఈ అక్రమ సాగుకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అతడిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి గస్తీతో నియంత్రణ

జిల్లాలో గంజాయి అక్రమ సాగు, రవాణా, విక్రయాలను అడ్డుకోవడానికి ‘గంజాయి గస్తీ’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిఘా పెంచి అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తున్నామన్నారు. ఈ దాడులు నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో సోబార్‌ సీఐ బి.గోవర్ధన్‌ రెడ్డి, మామడ ఎస్సై మహేష్‌ ఆధ్వర్యంలో జరిగాయి. ఆర్‌ఎస్‌ఐలు విజయ్‌, రాకేష్‌, మహేందర్‌, ఏఆర్‌ సిబ్బంది, క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు సహకరించాయి. వీరిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement