● కొన్ని మండలాలకే పరిమితమయ్యేనా? ● మార్గదర్శకాలు, భౌగోళిక పరిస్థితులు ప్రేరేపించేనా.. ● ఆరు అంశాలు, పదుల సంఖ్యలో సూచికలతో అంచనాలు ● నివేదిక తయారీలో యంత్రాంగం ● వర్షాకాలం సీజన్‌లో నమోదైన వర్షపాతంలో గణనీయమైన లోపం ఉండటాన్ని పరిశీలిస్తారు. జిల్లాలో 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు పడకుండా మధ్యలో ఎక్కువ రోజు లు సుదీర్ఘ విరామం (డ్రైస్పెల్) రావడాన్ని గమనిస్తారు. భారత వాతావరణ శాఖ వానాకాలం సీజన్ మొదలు నుంచి చివరి వరకు 18 వారాలు ప్రతీవారం వర్షపాతాన్ని అంచనా వేస్తుంది. అందులో 8 వారాలు అతి తీవ్ర వర్షాభావం, మూడు వారాలు వర్షాభావం నమోదైంది. ఈ లెక్కన 11 వారాలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. కేవలం ఒకే ఒక వారం జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ ఆగస్టు చివరి వరకు వచ్చేసరికి ఏకంగా 74 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
● వానాకాలం సీజన్‌లో జిల్లాలో సాధారణ విస్తీర్ణానికి అనుగుణంగా 5లక్షల 94 వేల 891 ఎకరాల్లో పత్తి, సోయాబీన్, కందులు, ఇతరత్రా పంటలు సాగయ్యాయి. జిల్లాలో వర్షాధారంగానే అత్యధికంగా పంటలు పండిస్తారు. వర్షాభావం ఉన్నప్పటికీ సాధారణంగానే విత్తనాలు విత్తుతారు. దీనిపరంగా జిల్లా సాధారణ విస్తీర్ణానికి చేరుకుంది. వర్షాభావం కారణంగా పంటల దిగుబడిపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోంది. 50 శాతం కంటే తక్కువ సాగు ఉంటే పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
● పంటలకు అవసరమైన తేమ నేలలో ఏస్థాయిలో ఉందన్న అంశంపై వ్యవసాయ యూనివర్సిటీ నివేదిక తయారు చేయనుంది. సుదీర్ఘ విరామ వర్షాలతో జిల్లాలోని వ్యవసాయ భూముల్లో తేమ లోపించడంతో మొక్కలు ఆశించిన స్థాయిలో ఎదగకపోవడం, పూత, కాయ ఆశించిన స్థాయిలో లేక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో శాటిలైట్ డేటాను ఉపయోగించి పంటల ఆరోగ్యాన్ని పరిశీలించనున్నారు. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి మట్టాలు ఏవిధంగా ఉన్నాయో పరిశీలన చేయనున్నారు. జిల్లాలో 290కి పైగా చెరువులు ఉండగా, ప్రస్తుతం 30 శాతం నీళ్లు కూడా లేవు.
● తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం లభ్యత, ఉపాధి, వలసలను కూడా బేరీజు వేస్తారు. వీటన్నింటిని క్రోఢీకరించి రెవన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భజల శాఖల సంయుక్త నివేదిక ఆధారంగా యంత్రాంగం నివేదిక తయారు చేస్తుంది.
సాక్షి,ఆదిలాబాద్: కరువు జిల్లాల్లో జిల్లాను పూర్తిస్థాయిలో చేరుస్తారా?..లేనిపక్షంలో కొన్ని మండలాలనే పరిగణలోకి తీసుకుంటారా.. అనే అంశంలో జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో 18 జిల్లాలు, 320 మండలాల్లో కరువు ప్రభావితం ఉందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో ఆదిలాబాద్ ఉందా.. లేదా.. మండలాల్లో కొన్ని మండలాలు మాత్రమే ఉంటాయా.. అనేదానిపై స్పష్టత లేదు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ పార్టీలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక అంచనాలు, నివేదికల ప్రకారం.. కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రాథమిక అంచనా వేశారు. లోటు వర్షపాతం, కరువు పరిస్థితులు ఉన్నట్టు గుర్తించి ముందుకెళ్తున్నారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం జిల్లా స్థాయిలో నివేదిక తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా భౌగోళిక పరిస్థితులు ప్రేరేపిస్తాయా? లేదా అనేది అందరూ గమనిస్తున్నారు.
ఆరు అంశాల్లో ఇలా..
కరువు అంచనాకు పారామీటర్స్
1. వర్షపాతం
2. పంట సాగు విస్తీర్ణం
3. మట్టి తేమ
4. భూగర్భ జలాల పరిస్థితి
5. రిమోట్ సెన్సింగ్
6. రిజర్వాయర్ స్టోరేజ్
ఇలా సాగుతుంది..
కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు కరువు నివేదిక తయారీలో వివిధ శాఖలు నిమగ్నమయ్యాయి. ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) సమన్వయంతో వివిధ శాఖలు తమ నివేదికలను తయారు చేస్తున్నాయి. త్వరలో ఇది పూర్తి చేసి జిల్లా యంత్రాంగానికి అందజేయనున్నారు. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక చేరుతుంది. ఆ తర్వాత ప్రత్యేక బృందాలు ఆ నివేదిక ఆధారంగా సర్వే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.