కై లాస్‌నగర్: తమ సమస్యలను ఆలకించి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కలెక్టర్ రాజర్షి షాకు మొర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అడిషనల్ కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్‌ఎస్.చిత్రూతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. సంబంధిత తహసీల్దార్లతో వీసీలో మాట్లాడి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న అధికారులకు దరఖాస్తులను అందజేస్తూ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్‌డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉపాధి హామీ పథకం, భూభారతి, తదితర సమస్యలపై 42 అర్జీలు అందాయి. ఇందులో కొందరి నివేదన..
రబ్బర్ ఫ్యాక్టరీ కార్యకలాపాలు
నిలిపివేయాలి
మా గ్రామానికి కిలోమీటరు దూరంలోని రబ్బర్ రీక్లెయిమ్ ఫ్యాక్టరీని త్వరలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే దుర్వాసనతో పొచ్చెర, రాంపూర్, పొన్నారి గ్రామస్తులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అప్పటి కలెక్టర్‌తో పాటు పొల్యూషన్ కంట్రోల్‌బోర్డుకు ఫిర్యాదు చేయగా 2023లో ఈ ఫ్యాక్టరీని మూసివేశారు. మళ్లీ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే మూడు గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. కనుక ప్యాక్టరీ కార్యకలాపాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలి.
– పొచ్చెర గ్రామస్తులు, ఆదిలాబాద్‌రూరల్
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
మేమంతా ఆదిలా బాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన నిరుపేదలం. కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నాం. వ్యవసాయ భూములు, పక్కా ఇళ్లు మాకు లేవు. పూరిగుడిసెల్లోనే నివసిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా గెజిటెడ్ అధికారుల విచారణ పూర్తికాలేదని చెబుతున్నారు. విచారణ త్వరగా పూర్తిచేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.
– కేఆర్‌కే కాలనీవాసులు, ఆదిలాబాద్
నష్టపరిహారం చెల్లించాలి
వానాకాలం సీజన్‌లో హైరిచ్ కంపెనీకి చెందిన ఎండీఎస్ 9001 రకం సోయా విత్తనాన్ని సాగు చేశాం. ప్రస్తుతం పంట దిగుబడి దశకు చేరుకుంది. విత్తనాలు జొన్నగింజల్లాగే వస్తున్నాయి. ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. నాసిరకం విత్తనాలను అందించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై విచారణ జరిపించి సదరు కంపెనీపై తగు చర్యలతో పాటు నష్టపరిహారం ఇప్పించాలి.
– సోయా రైతులు, యాపల్‌గూడ, ఆదిలాబాద్
న్యాయం చేయాలి
మేమంతా ఎస్టీ లంబాడీ కులానికి చెందిన విద్యార్థులం. గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాం. మాకు ప్రభుత్వమిచ్చే కాస్మొటిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అధికారులు కుల ధృవీకరణపత్రం అడుగుతున్నారు. తహసీల్దార్‌ను సంప్రదిస్తే 1950కి ముందు పూర్వీకుల భూరికార్డులు కావాలని చెబుతున్నారు. ఆ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో కుల ధృవీకరణపత్రాలు జారీ చేయడం లేదు. దీంతో మేము నష్టపోవాల్సి వస్తోంది. తమరు స్పందించి మాకు న్యాయం చేయాలి. – ఎస్టీ విద్యార్థులు,
చిచ్‌ధరి ఖానాపూర్, ఆదిలాబాద్ రూరల్


