పడకల సామర్థ్యానికి అనుగుణంగా సిబ్బంది నియామకం
మార్గదర్శకాలు రూపొందిస్తున్న వైద్యారోగ్య శాఖ
తీరనున్న రోగుల తిప్పలు
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు దవాఖానాల్లో సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ముక్కు మూసుకోనిదే ఆస్పత్రుల్లోనికి వెళ్లే పరిస్థితి లేదు. సరిపడా పేషెంట్‌కేర్ సిబ్బంది లేకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీన జడ్.చంగ్తో ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
పడకల సామర్థ్యానికి అనుగుణంగా..
ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యానికి అనుగుణంగా సిబ్బందిని నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీస్ (హెచ్‌ఎఫ్‌ఎంఎస్) కమిటీని నియమించనున్నారు. దీని ద్వారా ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, ఇతర సిబ్బందిని ఒకే ఏజెన్సీ కింద తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఏజెన్సీల్లో జవాబుదారీతనం ఉంటుంది. రెండు మూడు ఏజెన్సీలు ఉండడంతో సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించకపోవడంతో పాటు పర్యవేక్షణ సైతం లోపిస్తోంది. అయితే రిమ్స్‌లో 700 పడకల వరకు సామర్థ్యం ఉండగా, ఇందుకు సరిపడా సిబ్బంది లేరు. రిమ్స్‌తో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కళాశాల, బాలికల, బాలుర వసతికి సంబంధించి మొత్తం 426 మంది పనిచేస్తున్నారు. ఇందులో నుంచి సూపర్ స్పెషాలిటీకి సంబంధించి 110, మెడికల్ కాలేజీకి 71, రిమ్స్‌కు 245 మందిని కేటాయించారు.
రిమ్స్‌లో పరిస్థితి..
రిమ్స్ ఆస్పత్రిలో మొత్తం 426 మంది సిబ్బంది పనిచేస్తుండగా, 30 మంది అనధికారికంగా సూపర్‌వైజర్లుగా వ్యవహరిస్తున్నారు. మరో 70 మంది వరకు వారికి కేటాయించిన విధులు కాకుండా డాటాఎంట్రీ ఆపరేటర్లు, ఆయా హెచ్‌ఓడీల వద్ద, ఇతర పనుల్లో ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవలి సమావేశంలో కేటాయించిన విధులు మాత్రమే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఇతర విభాగాలకు కేటాయించిన వారు శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీలుగా పనిచేస్తున్నారు. మరో 40 మంది వరకు అక్కడే ఉంటున్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో రిమ్స్‌లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. సెక్యూరిటీ గార్డులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆస్పత్రిలో రోగుల బంధువులు, సందర్శకులు పెరిగిపోయి వారిని నియంత్రించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరోవైపు పార్కింగ్ సమస్య, చోరీ ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి.
సరిపడా సిబ్బందిని నియమిస్తేనే..
రిమ్స్‌తో పాటు ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. పేషెంట్ కేర్లు లేకపోవడంతో బంధువులే స్ట్రెచ్చర్, వీల్‌చైర్‌పై రోగులను తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇతర వార్డులకు తీసుకెళ్లాల్సిన సమయంలో అనేక అవస్థలు ఎదురవుతున్నాయి. వైద్యులు రోగులను పరీక్షించే సమయంలో సెక్యూరిటీ గార్డులు లేక సందర్శకులను నియంత్రించలేకపోతున్నారు. పలు సందర్భాల్లో వైద్యులు, సిబ్బందిపై రోగుల బంధువులు వాగ్వివాదాలకు దిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రిమ్స్ బోధనాస్పత్రితో పాటు రెండు ఏరియా ఆస్పత్రులు, ఉట్నూర్ జిల్లా ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని నియమిస్తేనే సమస్యలు దూరం కానున్నాయి.
ఉట్నూర్ జిల్లా ఆస్పత్రిలో పది మంది పారిశుద్ధ్య, ఏడుగురు సెక్యూరిటీ గార్డులు, ఆరుగురు పేషెంట్ కేర్‌లు ఉన్నారు. సిబ్బంది సరిపోకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి. బోథ్ ఏరియా ఆస్పత్రిలో 8 మంది శానిటేషన్, ఆరుగురు పేషెంట్ కేర్‌లు, నార్నూర్ ఏరియా ఆస్పత్రిలో ఆరుగురు శానిటేషన్, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఐదుగురు పేషెంట్‌కేర్‌లు ఉన్నారు.


