కరువుఛాయలు | - | Sakshi
Sakshi News home page

కరువుఛాయలు

Oct 6 2026 11:53 PM | Updated on Oct 6 2026 11:53 PM

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అడుగంటుతున్న బోర్లు, బావులు ఎండుతున్న పంటలు.. దిగుబడులపై ప్రభావం కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌

ఇక్కడ కనిపిస్తున్న రైతు బొజ్జ పెద గంగన్న. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామం. తనకున్న తొమ్మిదెకరాల్లో ఈ సీజన్‌లో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. ఆరెకరాల్లో మొక్కజొన్న వేయగా ఇప్పటికే రెండకరాలు ఎండిపోయింది. మిగతా పంట కూడా వాడిపోయిందని, దిగుబడి చేతికి వచ్చేది అనుమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైన ఈ మండలంలోనే పరిస్థితి ఇలా ఉండగా.. మిగతా అన్ని మండలాల్లో లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం.

కై లాస్‌నగర్‌: జిల్లాలో కరువుఛాయలు కమ్ముకుంటున్నాయి. ఈ వానాకాలంలో ఆశించినస్థాయిలో వర్షాలు కురువకపోవడంతో పంటల ఎదుగుదల లోపిస్తోంది. నైరుతి తిరోగమనంతో చినుకు జాడలేక జిల్లా వాతావరణం వేసవిని తలపిస్తోంది. వర్షాలపైనే ఆధారపడి సాగు చేసిన పత్తి, సోయా, కంది, మొక్కజొన్న వంటి పంటలు ఎండ తీవ్రతకు వాడిపోతున్నాయి. నీటి వసతి కలిగిన రైతులు పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తుండగా.. బోర్లు, బావుల్లోని నీరు క్రమంగా అడుగంటుతుంది. మరోవైపు విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోతుండగా పంటలకు సకాలంలో నీటి తడులు అందని పరిస్థితి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

సాధారణం కంటే తక్కువ..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 21 మండలాల్లో తలమడుగు మినహా అన్ని చోట్ల లోటువర్షపాతం నమోదవడం పరిస్థితికి అద్దం పడుతుంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 988.1మిల్లీమీటర్లు కాగా ఈ సారి కేవలం 679.7మీ.మీ మాత్రమే కురిసింది. 31శాతం లోటు నమోదైంది. జైనథ్‌, గుడిహత్నూర్‌, మావల, తలమడుగు, ఇచ్చోడ మండలాల్లో 25శాతం, బేల, ఇంద్రవెల్లి, తాంసి, బోథ్‌, నేరడిగొండ మండలాల్లో 30 శాతం లోటు ఉంది. భీంపూర్‌, నార్నూర్‌, ఆదిలా బాద్‌ అర్బన్‌, ఆదిలాబాద్‌ రూరల్‌, ఉట్నూర్‌, సిరి కొండ మండలాల్లో 40శాతం, ఇక భోరజ్‌, సా త్నాల, సొనాల, బజార్‌హత్నూర్‌, గాదిగూడ మండలాల్లో ఏకంగా 47శాతం లోటుగా నమోదైంది.

సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ..

మరోవైపు కరువు మండలాల ప్రకటన కోసం జిల్లాల వారీగా వర్షాభావం, పంటల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నివేదిక సిద్ధం చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇందులో జిల్లాను సైతం చేర్చాలనే డిమాండ్‌ రైతు సంఘాల ప్రతినిధులు, ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతుంది. ఇటీవల అఖిలపక్ష రైతుసంఘం, విపక్షాలు సైతం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని తీర్మానించారు.

ఎలాంటి ఆదేశాలు రాలేదు

కరువు మండలాల ప్రకటనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒ కవేళ ఆదేశిస్తే జిల్లా పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేస్తాం. తగు చర్యలు తీసుకుంటాం.

– బి.రవీందర్‌సింగ్‌, డీఏవో

పడిపోతున్న భూగర్భజలాలు

ఎండల తీవ్రత కారణంగా భూగర్భజలాలు సైతం వేగంగా పడిపోతున్నాయి. నీటి వినియోగం పెరుగడంతో గత నెలతో పోల్చితే ఈ నెలలో మరింత అడుగంటాయి. భోరజ్‌ మండలంలో అత్యధికంగా 10.6 మీటర్లు, ఇంద్రవెల్లిలో 9.52, సిరికొండలలో 8.2 మీటర్ల దిగువనకు చేరాయి. దీంతో రానున్న రోజుల్లో ఈ మండలాల్లో ప్రమాదఘంటికలు మోగనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మిగతా మండలాల్లో 1.50 మీటర్ల నుంచి 5 మీటర్ల లోతుకు పడిపోవడం ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతుంది.

దిగుబడులపై ప్రభావం ..

జిల్లాలో 80శాతం రైతులు వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని అధికారులు, శాస్త్రవేత్తలు సూచించినప్పటికి విధి లేని పరిస్థితుల్లో పత్తి, సొయా, కంది, మొక్కజొ న్న వంటి పంటలను సాగు చేశారు. పత్తి సాగు విస్తీర్ణం ఈసారి తగ్గుతుందని భావించినా మెజా ర్టీ రైతులు తెల్లబంగారంపైనే మొగ్గు చూపారు. 20 రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు మండిపోతుండడంతో కాత దశలో ఉన్న పత్తి వాడిపోతుంది. పలుచోట్ల మొక్కజొన్న ఎండిపోయింది. పత్తి తీత చేపట్టిన రైతుల్లోనూ నిరాశే కనిపిస్తోంది. దిగుబడి సగానికి పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఈ సీజన్‌లో లోటు వర్షపాతం వివరాలు

వర్షపాతం మండలాలు

9నుంచి 25శాతం 06

26 నుంచి 30శాతం 04

31నుంచి 40 శాతం 06

41నుంచి 47శాతం 05

భూగర్భజలాల పరిస్థితి

1నుంచి 5 మిల్లీమీటర్ల లోపు 12

6నుంచి 10మిల్లీమీటర్ల లోపు 09

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement