ఆదిలాబాద్‌రూరల్: పరిహారం నిర్ణయించాకే సర్వే చేపట్టాలని, అప్పటి వరకు సహకరించే ప్రసక్తే లేదని మండలంలోని అనుకుంట గ్రామ రైతులు స్పష్టం చేశారు. గ్రామంలో మంగళవా రం చేపట్టిన సోషల్ ఎకనమికల్ సర్వేను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వ్యవసాయమే తమకు జీవనాధారమ ని, విమనాశ్రయ ఏర్పాటులో భాగంగా గ్రామానికి చెందిన 870 ఎకరాల వరకు భూములు పోతున్నాయని తెలిపారు. దీంతో జీవనోపాధి కోల్పోతామన్నారు. పరిహారం నిర్ణయించిన తర్వాతే సర్వే చేపట్టాలని ఇప్పటికే కలెక్టర్‌తో పాటు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎకరా కు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిని నిర్మించి ఇవ్వాలన్నారు. అప్పటివరకు ఎలాంటి సర్వే చేపట్టవద్దన్నారు. చేసేది లేక అధికారులు సర్వేను వాయిదావేశారు. రైతుల డిమాండ్లను ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్తామనిపేర్కొన్నారు.


