● ‘మత్స్య’ పంపిణీకి సర్కారు నిర్ణయం ● టెండర్ల నిర్వహణకు అధికారుల కసరత్తు ● ఈ నెలాఖరులోగా సీడ్‌ వదిలేలా కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

● ‘మత్స్య’ పంపిణీకి సర్కారు నిర్ణయం ● టెండర్ల నిర్వహణకు అధికారుల కసరత్తు ● ఈ నెలాఖరులోగా సీడ్‌ వదిలేలా కార్యాచరణ

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

● ‘మత్స్య’ పంపిణీకి సర్కారు నిర్ణయం ● టెండర్ల నిర్వహణకు అధికారుల కసరత్తు ● ఈ నెలాఖరులోగా సీడ్‌ వదిలేలా కార్యాచరణ

కై లాస్‌నగర్‌: కులవృత్తిపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించింది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. సీడ్‌ వదిలేందుకు ఇదే అనువైన సమయమని సర్కారు భావించింది. ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. చేప పిల్లల సరఫరాకు సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సారి ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

కరుణించిన వరుణుడు ..

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ ఉంటుందో లేదోనని మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇటీవల అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లకు జలకళ వచ్చేసింది. దీంతో చేప సీడ్‌ పంపిణీకి మార్గం సుగమమైంది.

టెండర్ల నిర్వహణకు కసరత్తు

చేప సీడ్‌ పంపిణీ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్ల నిధులు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ చేపట్టాలని మత్స్యశాఖను ఆదేశించింది. గతేడాది మాదిరిగా ఈసారి కూడా 116.23 లక్షల చేప పిల్లలను 224 చెరువులు, రిజర్వాయర్లలో వదిలేలా మత్స్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 216 సీజనల్‌ చెరువుల్లో కట్ల, రహు, బంగారు తీగ చేపలను 35, 35, 30 శాతం నిష్పత్తిలో వదలనున్నారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులతో పాటు మరో ఆరు పెద్ద చెరువుల్లో కట్ల, రహు, మృగల చేపలను 40, 50, 10 శాతం నిష్పత్తిలో వదిలేలా కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 6న నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశముంది. సీడ్‌ సరఫరా సామర్థ్యంకు అనుగుణంగా కాంట్రాక్టర్లను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ నేతృత్వంలోని డీపీసీ ఎంపిక చేయనుంది. ఇలా ఎంపికై న వారు నిబంధనలకు అనుగుణంగా సీడ్‌ను జలాశయాల్లో వదలాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వచ్చేనెల మొదటివారంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

త్వరితగతిన చేపడితేనే ప్రయోజనం..

సాధారణంగా చేప సీడ్‌ను జూలై, ఆగస్టులో వదిలితేనే అవి మార్చి వరకు సమృద్ధిగా ఎదిగి పట్టుకుని విక్రయించేందుకు అవకాశముంటుంది. తద్వారా మత్స్యకారులకు ప్రయోజనం దక్కుతుంది. అయితే గతేడాది నుంచి సీడ్‌ పంపిణీలో తీవ్ర జాప్యమవుతోంది. డిసెంబర్‌ వరకు కూడా సీడ్‌ వదలడంతో చేపలు ఎదుగుదలపై ప్రభావం చూపింది. ఈ సారి కొంత ఆలస్యంగానైనా చెరువులు నిండినందున ప్రభుత్వం ప్రక్రియను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు.

జిల్లాలో..

మత్స్యపారిశ్రామిక సంఘాలు 107

మత్స్యకార సంఘాల్లోని సభ్యులు 5,040

జిల్లాలో మొత్తం చెరువులు 224

చేప పిల్లల పంపిణీ లక్ష్యం 1.16కోట్లు

35–40 ఎంఎం సైజ్‌ 83.53 లక్షలు

90–100ఎంఎం సైజ్‌ 32.70లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement