ఇంటర్‌ సిలబస్‌ మారింది | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సిలబస్‌ మారింది

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

పాఠ్యపుస్తకాల్లో మార్పులు

పూర్తిగా మారిన తెలుగు పుస్తకం

కొత్త సిలబస్‌, డిజిటల్‌ బోధన

ఏఐ, డిజిటల్‌ లెర్నింగ్‌ బోధనపై లెక్చరర్లకు శిక్షణ

మంచిర్యాలఅర్బన్‌: ఇంటర్‌ విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి నూతన కరికులమ్‌, సవరించిన పాఠ్యపుస్తకాలు, డిజిటల్‌ బోధన పద్ధతులు అమలు చేయనుంది. ఇంటర్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) ఆధారిత విద్యపై అధ్యాపకులకు జిల్లాస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఏఐ బోధన ద్వారా ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం కలుగనుంది. ఉన్నత విద్యతోపాటు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలకు పునాది పడనుంది.

పాఠ్యాంశాల్లో మార్పులు..

ఇంటర్మీడియెట్‌ తెలుగు పుస్తకాన్ని మొత్తం మార్చేశారు. సబ్జెక్టుల వారీగా అనేక మార్పులు చేశారు. జంతుశాస్త్రంలో ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి తొలగించగా.. ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు, భౌతికశాస్త్రంలో ఫిజిక్స్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ చేర్చడంతో పాటు ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు, వృక్షశాస్త్రంలో ఆర్థిక వృక్షశాస్త్రం చేర్చి ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు కేటాయించారు. గణితంలో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతం అధ్యాయాలు చేర్చారు. రసాయనశాస్త్రంలో పదార్థాల స్థితులు, పర్యావరణ రసాయన శాస్త్రం, స్టోయికియోమెట్రీ పాఠంలో మెలారిటీ భావన తొలగించారు. మొదటి సంవత్సరం ప్రాక్టీకల్‌ పరీక్షల కోసం క్వాలిటేటివ్‌ అనాలసిస్‌ నుంచి 15 లవణాలు కొత్తగా చేర్చారు. హిస్టరీలో యూనిట్‌–6లో దక్షిణ భారతదేశం, దక్కన్‌రాజ్యాలు, యూనిట్‌–8లో ప్రాంతీయ రాజ్యాలు కొత్తగా చేర్చగా మరాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుదల తొలగించారు. సుల్తానేట్‌ రాజవంశీయుల అంశం యూనిట్‌–7లో కలిపారు. యూరోపియన్ల రాక, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు, జాతీయోద్యమం (తొలిదశ, మలిదశ) యూనిట్లు విలీనం చేశారు. ఎకనామిక్స్‌లో పాజిటివ్‌ ఎకనామిక్స్‌, నార్రేటివ్‌, నార్మేటివ్‌ ఎకనామిక్స్‌ చేర్చారు. స్టాటిస్టిక్స్‌ సూచీ సంఖ్యలు కొత్తగా చేర్చారు. తెలుగులో పాఠ్యాంశాలు మార్పులు చేశారు.

రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇలా..

నూతన విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు హైదరాబాద్‌లో పలు వేదికలపై జూలై 31 నుంచి ఆగస్టు 5వరకు మూడు విడుతల్లో రాష్ట్రస్థాయి మాస్టర్‌ ట్రైనర్లు, డిస్ట్రిక్‌ రిసోర్స్‌ పర్సన్‌లకు (డీఆర్‌పీ) రెండు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 సబ్జెక్టుల్లో ఇంగ్లిష్‌ మినహాయిస్తే సబ్జెక్టుకు ఒక్కరి చొప్పున 10 మంది అంటే దాదాపు 40 మంది అధ్యాపకులను డీఆర్‌పీలుగా ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. డీఆర్‌పీలు జూనియర్‌ లెక్చరర్లకు ఇదే తరహాలో రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ప్రాథమికాంశాలైన ఏఐ నిర్వచనం, చరిత్ర, రోజువారీ జీవితంలో దాని అప్లికేషన్‌, ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, డిప్‌ లెర్నింగ్‌ మధ్య తేడాలు, గణిత శాస్త్రానికి ఏఐ, ప్రోగ్రామింగ్‌ పునాదులు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.

శిక్షణ అనంతరం..

రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్‌పీలు జిల్లాల వారీగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. మారిన సిలబస్‌లో కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల్లో తీసివేసిన, కొత్తగా చేర్చిన పాఠ్యాంశాలను సులభంగా ఎలా బోధించాలో అవగాహన కల్పించనున్నారు. క్లాస్‌రూమ్‌లలో టెక్నాలజీ, ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) సాధనాలు, డిజిటల్‌ పద్ధతులను ఉపయోగించి పాఠాలను ఆకర్షణీయంగా ఎలా చెప్పాలో శిక్షణ ఇస్తారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే నూతన అసెస్‌మెంట్‌, పరీక్షల ప్యాట్రన్‌పై స్పష్టతనిస్తారు. కేవలం సబ్జెక్టు బోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా గైడెన్స్‌ ఇచ్చేందుకు మాస్టర్‌ ట్రైనర్లను సిద్ధం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement