‘ఎస్టీపీ’లకు మోక్షమెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

‘ఎస్టీపీ’లకు మోక్షమెప్పుడో?

Aug 2 2026 11:49 PM | Updated on Aug 2 2026 11:49 PM

మూడేళ్లుగా మూలుగుతున్న

అమృత్‌–2 నిధులు

భూసేకరణకు పడని ముందడుగు

శాఖల మధ్య లోపించిన సమన్వయం

బల్దియా పరిధిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ తీరిది

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్‌ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేసింది. ప్రధాన పైపులైన్లతో పాటు నాలుగు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎస్టీపీ)లను నిర్మించాల్సి ఉంది. మూడేళ్లు గడుస్తున్నా ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. నిర్మాణాలకు అవసరమైన స్థలాల సేకరణకు సంబంధించిన నిధులను రెవెన్యూ శాఖకు జమచేసి రెండు నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. దీంతో పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి.

ఇదీ పరిస్థితి..

ఆదిలాబాద్‌ పట్టణానికి అమృత్‌ 2.0 కింద కేంద్రం అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి గాను 2023 మే నెలలో రూ.225.46 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులు చేపట్టేందుకు వీలుగా బల్దియా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పించారు. 24 కిలోమీటర్ల మేర ప్రధా న పైపులైన్‌తో పాటు నాలుగు మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీల)ను నిర్మించేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి 2023లోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్‌తో పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ అధికారులు అగ్రిమెంట్‌ సైతం చేసుకున్నారు. ఈ ప్రక్రియ జరిగి మూడేళ్లవుతున్నా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పు డు మొదలవుతాయో కూడా తెలియని పరిస్థితి.

భూ సేకరణలో తీవ్ర జాప్యం ...

రూ.160 కోట్ల వ్యయంతో నాలుగు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 80శాతం పట్టణానికి సంబంధించిన మురుగునీటిని శుద్ధి చేసేలా చిల్కూరి లక్ష్మీనగర్‌లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎస్టీపీని నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఆలాగే ఆయా కా లనీలకు సంబంధించిన మురుగునీటిని శుద్ధి చేసే లా కేఆర్‌కే, బంగారుగూడ, ఇందిరమ్మ కాలనీల్లో ఒకటిన్నర ఎకరం చొప్పున మరో మూడు ప్లాంట్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించారు. అయితే ఇప్ప టి దాకా భూసేకరణ దిశగా అడుగు ముందుకు పడలేదు. పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడం లేదని తెలుస్తోంది.

రూ.8.9 కోట్ల నిధుల జమ

ఎస్టీపీల నిర్మాణాలకు అవసరమైన స్థలాల సేకరణ కోసం రూ.8.9 కోట్లు అవసరమం కానుండగా ఆ మొత్తం నిధులను ఈ ఏడాది మే 7న రెవెన్యూశాఖ ఖాతాలో జమ చేశారు. వాటితో భూములను సేకరించాల్సి ఉంది. నిధులు జమ చేసి రెండు నెలలు గడిచినా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో భూ సేకరణలో తీవ్ర జాప్యం అవుతోంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు భూసేకరణ చేపడుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ కాలనీలో ప్రతిపాదించిన ఎస్టీపీని మరో చోటకు తరలించే అవకాశముంది. మిగతా మూడింటికి స్థలాలను సేకరిస్తే పనులు ప్రారంభించే అవకాశముంది. రెవెన్యూ, పబ్లిక్‌ హెల్త్‌ అధికారుల మధ్వ సమన్వయం లేకపోవడంతోనే స్థల సేకరణలో జాప్యం అవుతుందనే విమర్శలున్నాయి.

రెవెన్యూ అధికారులదే బాధ్యత

ఎస్టీపీల నిర్మాణాలకు సంబంధించిన స్థలాల సేకరణకు అవసరమైన నిధులను రెవెన్యూశాఖకు జమ చేశాం. వారు రైతుల నుంచి భూములు సేకరించి మాకు అప్పగించాల్సి ఉంది. ఆర్డీవో ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. భూములను మాకు అప్పగించిన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

– అరుణ్‌కుమార్‌, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ

ఎస్‌టీపీల నిర్మాణాల వివరాలు

నిర్మించే ప్రాంతం సామర్థ్యం

(ఎంఎల్‌డీలలో)

చిల్కూరిలక్ష్మినగర్‌ 28

కేఆర్‌కే కాలనీ 1.5

బంగారుగూడ 1

ఇందిరమ్మకాలనీ 1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement