ఆదిలాబాద్‌టౌన్: బాలల సంరక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ జిల్లాలో విజయవంతంగా ముగిసిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు నెలరోజులపాటు వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 141 మంది బాల బాలికలను రక్షించి, వారిని చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపర్చడంతో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలను రక్షించడం, వారిని కుటుంబాలకు చేర్చడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ ఏడాది ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా పలు శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, దుకాణా లు, పరిశ్రమలు, వర్క్‌షాప్‌లు, ఇతర సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. 18 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయిస్తున్న యజమానులపై 53 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాలల హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని అన్నారు. వీధుల్లో సంచరిస్తున్న చిన్నారులు, బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అభినందించారు.


