జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

● మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి ● గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తా.. ● క్రీడా శిక్షకుల నియామకానికి చర్యలు ● నూతన డీవైఎస్‌వో దయానంద్‌రెడ్డి

ఆదిలాబాద్‌: జిల్లాలో క్రీడా అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీవైఎస్‌వో అల్లూరి దయానంద్‌రెడ్డి తెలిపారు. బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన అధునాతన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని, క్రీడల్లో జిల్లాను అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

సాక్షి: స్టేడియంలో కోచ్‌లు లేకపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందిగా ఉంది. నియామకాలపై ఎలా ముందుకు వెళతారు?

డీవైఎస్‌వో: కోచ్‌ల నియామకాలపై ముందుగా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్తాం.

సాక్షి: గ్రామీణ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడానికి మీ ప్రణాళిక ఏమిటి?

డీవైఎస్‌వో: మనం నిర్వహించే క్యాంపుల్లో వారిని చేర్చుకుని తగిన శిక్షణ ఇస్తాం. స్కూల్‌ హెడ్‌మాస్టర్లు, తహసీల్దార్‌, ఎంపీడీవోల సహకారంతో మోటివేషన్‌ ఇప్పిస్తాం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తాం.

సాక్షి: పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.. ఎలాంటి చర్యలు చేపడుతారు?

డీవైఎస్‌వో: ముందుగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. రెండో ప్రాధాన్యతగా లైటింగ్స్‌ ఏర్పాటు, తర్వాత మైదానం అభివృద్ధి చేస్తాం. వాకర్స్‌కు ఇబ్బంది కలగకుండా కలెక్టర్‌ ఆదేశాలతో ఇప్పటికే కొన్ని పనులు శాంక్షన్‌ అయ్యాయి. ట్రాక్‌, ఇతర సౌకర్యాలు వందశాతం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

సాక్షి: ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులు నిలిచిపో యి చాలా కాలమైంది.. వాటి పరిస్థితి ఏంటి?

డీవైఎస్‌వో: ఆ నిర్మాణ పనులు మున్సిపల్‌ నిధులతో మొదలయ్యాయి. అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రయత్నిస్తా.

సాక్షి: ఒక సీనియర్‌ పీడీగా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?

డీవైఎస్‌వో: గ్రామీణ క్రీడాకారులు మరుగున పడిపోతున్నారు. ముందుగా ఆయా ప్రాంతాల నుంచి పీడీల ద్వారా వారిని వెలుగులోకి తీసుకువస్తాం. తొలుత జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్లేలా శిక్షణ ఇస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపుతాం. జిల్లాను క్రీడల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా శ్రమిస్తా.

సాక్షి: స్టేడియంలో ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఫీజులు వసూలు చేసుకుంటూ ప్రభుత్వ మైదానాన్ని ఉపయోగిస్తున్నారు? ఈ అంశంపై ఎలా దృష్టి సారిస్తారు?

డీవైఎస్‌వో: ముందుగా క్రీడా పాఠశాల విద్యార్థుల సాధనకు ఇబ్బందులు లేకుండా ట్రాక్‌ చుట్టూ ఫెన్సింగ్‌ వేయిస్తాం. మిగతా దాంట్లో నడక సాధకులు వెళ్లేలా పెద్ద ట్రాక్‌ అభివృద్ధి చేస్తాం. ఉద్యోగాల కోసం సాధన చేసే నిరుద్యోగులకు ప్రత్యేక స్థలం కేటాయిస్తాం.

సాక్షి: స్పోర్ట్స్‌ స్కూల్‌ అప్‌గ్రేడేషన్‌ కోసం ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? ఇంటర్‌ వరకు ఉన్నతీకరించే అవకాశాలు ఉన్నాయా?

డీవైఎస్‌వో: జూనియర్‌ కాలేజీ వరకూ ఉన్నతీకరించవచ్చు. కానీ, మనకు సదుపాయాలు అందుబాటులో లేవు. భవనం లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. అప్‌గ్రేడ్‌ అయితే

బాగుంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement