జూడోలో అబ్బురపరుస్తున్న.. సహస్ర
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న జి. సహస్ర జూడోలో అసాధారణ ప్రతిభతో అబ్బురపరుస్తోంది. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్న ఈ క్రీడా కెరటం 2024 నుంచి 2026 వరకు జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ టోర్నీల్లో వరుసగా స్వర్ణ పతకాలను కై వసం చేసుకుని విజయ పరంపర కొనసాగించింది. అలాగే 2023–24లో కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించిన ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ పోటీల్లో కాంస్యం, 2024–25లో స్వర్ణ పతకంతో మెరిసింది. 2024–25లో మహారాష్ట్రలోని పుణేలో నిర్వహించిన యూత్ నేషనల్స్, 2025–26లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్ మీట్‌లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరి 17నుంచి 19వరకు నిర్వహించిన సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో స్వర్ణం సాధించింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సీనియర్ స్టేట్ జూడో చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన సహస్ర, జుడోలో రాష్ట్రానికే ఆశాకిరణంగా నిలుస్తోంది.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. వేదికలేవైనా సత్తా చాటుతూ పతకాలు కై వసం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లోనూ సత్తా చాటి ఔరా అనిపించారు. జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేశారు. ఓవరాల్ చాంపియన్‌షిప్‌గా నిలిచారు. ఇటీవల బజార్‌హత్నూర్ మండలం పిప్రి వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ఈ క్రీడాకారులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా క్రీడా రత్నాలుగా నిలుస్తున్న వారిపై ఫోకస్.
– ఆదిలాబాద్


