సర్కారు ఆదాయానికి గండి యథేచ్ఛగా ప్రయాణికుల రవాణా పట్టించుకోని అధికారులు నష్టపోతున్న ట్యాక్సీ ప్లేట్ వాహనదారులు వైట్‌ప్లేట్ వాహనాల్లో ప్రభుత్వ ఉద్యోగులవే అధికం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో వైట్‌ప్లేట్ వాహనదారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలను నడుపుతున్నారు. ట్యాక్సీ వాహనాల మాదిరిగా ప్రజలను తరలిస్తున్నారు. దీంతో వేలల్లో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న వారు నష్టపోతున్నారు. స్వయం ఉపాధి కోసం వాహనాలను కొనుగోలు చేసి, నెలవారీ ఈఎంఐలను చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమంగా ప్రయాణికులను తరలిస్తున్న వైట్ ప్లేట్ యజమానులపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో అధికారులు అద్దె ప్రతిపాదికన సైతం వైట్ ప్లేట్ వాహనాలను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతున్నారు.
నిబంధనలు గాలికి..
వైట్‌ప్లేట్ వాహనదారులు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. ఏడాదికోసారి ఇన్సూరెన్స్ తప్ప ఇతర పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. సొంత వినియోగం కోసం కొనుగోలు చేసిన వాహనా లను అద్దెకు పంపుతూ జేబులు నింపుకుంటున్నా రు. ఎల్లోప్లేట్ వాహనదారులు మూడు నెలలకో సారి ట్యాక్స్ రూపంలో రూ.8,850 చెల్లించాల్సి
ఉంటుంది. ఇన్సూరెన్స్‌గా ఏడాదికి మరో రూ.40వే
లకు పైగా చెల్లించాలి. గ్రీన్ ట్యాక్స్ పేరిట ఏడాదికి రెండు సార్లు రూ.6వేలు చెల్లించాల్సి ఉంటుంది. టో ల్‌చార్జీలు సైతం అదనం. ఇతర రాష్ట్రాలకు ప్రయాణికులను తరలిస్తే టెంపరరీ పర్మిట్ కోసం ఏడు రోజుల కోసం రూ.3500 చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు అదనంగా రూట్ పర్మిట్ చెల్లించాల్సి ఉంటుంది. అదే వైట్ ప్లేట్ వాహనదారులు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఇతర రాష్ట్రాలకు సైతం ప్రయాణికులను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు 200కు పైగా వైట్ ప్లేట్ వాహనాలు ఉంటే కేవలం 30 వరకు మాత్రమే ఎల్లోప్లేట్‌వి ఉండడం గమనార్హం.
జిల్లా కేంద్రంలోని అడ్డాపై నిలిపి ఉంచిన వైట్‌ప్లేట్ వాహనాలు
జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో వైట్‌ప్లేట్ వాహనదారుల అక్రమ దందా సాగుతుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు సొంత వినియోగం కోసం వాహనాలను కొనుగోలు చేస్తూ వాటిని అద్దెకు వినియోగిస్తున్నారు. ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తూ తక్కువ ధరకు అద్దెకు తిప్పుతూ నిరుద్యోగ యువత ఉపాధికి గండికొడుతున్నారు. ఈ విషయం రవాణా శాఖ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
వైట్ ప్లేట్ వాహనాలు అద్దె ప్రతిపాదికన నడుపుతున్నారనే సమాచారం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. అలాంటివి ఉంటే సమాచారం అందించాలి. విస్తృతంగా తనిఖీలు చేపడుతాం. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. వైట్‌ప్లేట్ వాహనాలు ట్యాక్సీలుగా వినియోగించొద్దు. ఎల్లోప్లేట్ వాహనాలను మాత్రమే ప్రజలను తరలించేందుకు వినియోగించాలి.
– రవీందర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్


