అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు
బాలాజీచెరువు: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ కారణంగా ప్రైవేట్ బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాశాఖ అధికారి కె.శ్రీధర్ హెచ్చరించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ ఐదు రోజులుగా మానిటరింగ్ టీమ్ ద్వారా అన్ని ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫాంలను పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీ నిర్దేశించిన చార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని స్పష్టం చేస్తూ, దానికంటే ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే సంబంధిత బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్‌లైన్ నెంబర్ 92816 07001ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అధిక చార్జీలు వసూలు చేసిన ఐదు బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 50 వేల జరిమానా విధించామన్నారు. అలాగే పన్ను, పర్మిట్ వంటి ఇతర నిబంధనలను ఉల్లంఘించిన 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.లక్ష జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ ప్రక్రియ జనవరి 18 వరకు కొనసాగుతాయని, పండగ అనంతరం తిరుగు ప్రయాణాల సమయంలో కూడా ఇదే విధమైన కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.


