మరోసారి సర్దుబాటు
అవసరమున్న బడులకు 42 మంది టీచర్లు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ చదువులకు ఆటంకం కలగకుండా చర్యలు రెండు, మూడు రోజుల్లో రానున్న ఉత్తర్వులు
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ చర్యలు చేపడుతుంది. ఈ మేరకు జిల్లా అధికారులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు అవసరానికి మించి టీచర్లు ఉన్న బడుల నుంచి సర్దుబాటు చేయనున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ ప్రక్రియ చేపట్టగా.. ముచ్చటగా మూడోసారి రంగం సిద్ధం చేశారు. గతంలో కొంత మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య లేనప్పటికీ ఉన్నట్లుగా చూపించి టీచర్లను ఇతర పాఠశాలలకు కేటాయించకుండా చూశారు. మరికొంత మంది ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయించి తమ పోస్టు కదలకుండా చూసుకున్నారు. అయితే డైస్ ప్రకారం అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఆయా మండలాల ఎంఈవో లు, విద్యా శాఖ అధికారులకు వివరాలు సమర్పించారు. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు మేలు చేకూరనుంది.
జిల్లాలో 42 మంది టీచర్ల సర్దుబాటు..
ఈ ఏడాది ఆగస్టులో మొదటి విడతగా 129 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. రెండో విడత సెప్టెంబర్‌లో మరో 39 మందిని సర్దుబాటు చేశారు. అయితే దాదాపు 15 మంది ఉపాధ్యాయులు వివిధ కారణాలు చెప్పి కేటాయించిన పాఠశాలలకు వెళ్లలేదు. అనారోగ్య కారణం, ఉద్యోగ విరమణకు దగ్గర ఉన్నామని, తమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందని తప్పించుకున్నారు. అయితే డైస్ ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. 1 నుంచి 20 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్, 21 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 ఉంటే నలుగురు, 121 నుంచి 150 వరకు ఉంటే ఐదుగురు.. ఇలా సర్దుబాటు చేస్తున్నారు. మొత్తం 32 మంది ఎస్జీటీలను, 10 మంది స్కూల్ అసిస్టెంట్లను తాజాగా సర్దుబాటు చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లలో ఇంగ్లీష్ 3, హిందీ 1, గణితం 1, ఫిజికల్ సైన్స్ 2, తెలుగు 3 ఉపాధ్యాయులు ఉన్నారు. ఎస్జీటీలను ఆయా మండల పరిధిలోని పాఠశాలలకు సర్దుబాటు చేయనుండగా, స్కూల్ అసిస్టెంట్లను జిల్లాలో అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా సిరికొండ, తాంసి, బజార్‌హత్నూర్, భోరజ్, బోథ్ మండలాల్లో సర్‌ప్లస్ లేని పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సిరికొండ మండలంలో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది.
జిల్లాలో..
డీఈవో పరిధిలో పాఠశాలలు 739
ఇందులో చదివే విద్యార్థులు 65వేలు
ఉపాధ్యాయ మంజూరు పోస్టులు 3,066
ప్రస్తుతం పనిచేస్తున్న వారు 2,634
ఉపాధ్యాయ ఖాళీలు 432
త్వరలో ఉత్తర్వులు జారీ..
ఆయా మండలాల నుంచి వివరాలు సేకరించిన విద్యాశాఖ అధికారులు సర్దుబాటు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఏయే పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నచోట ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నట్లు విద్యాశాఖ ఏఎస్‌వో గోవర్ధన్ తెలిపారు. తయారు చేసిన జాబితాను కలెక్టర్‌కు పంపిన తర్వాత డీఈవో ఆదేశాల మేరకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.


