ఆయిల్‌పామ్‌కు ‘సహకారం’
లక్ష్మణచాంద: రైతులకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటల సాగును కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్‌పామ్ సాగవుతోంది. ఒకసారి నాటితే 30 ఏళ్లు ఆదాయం వచ్చే ఈ పంట పై రైతుల్లో సరైన అవగాహన లేకపోవడంతో ఇంకా సాగు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.వ్యవసా య, ఉద్యాన, సహకారశాఖలు ఈ సమస్యను పరి ష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీ ఎస్) భాగస్వామ్యంతో సాగువిస్తీర్ణం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల పీఏసీఎస్ సీఈవోలతో సమీక్ష నిర్వహించారు.
ఒక్కో సొసైటీకి 100 ఎకరాలు..
ఒక్కో పీఏసీఎస్ పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల్ జిల్లా సహకార అధికారి నర్సయ్య తెలిపారు. సొసైటీలో సభ్యులైన రైతులతో సమావేశాలు నిర్వహించి పంట లాభాలపై అవగాహన క ల్పిస్తామని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 17 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 40 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సంఘం తమ పరిధిలో లక్ష్యాన్ని చేరుకునేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 8,786 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 3,092 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 2,505 ఎకరాలు, ఆసిఫాబాద్ జిల్లాలో 1,187 ఎకరాలు కలిపి మొత్తంగా 15,570 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. ఈ రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ఒక మొక్క ధర రూ.193 ఉండగా, సబ్సిడీపై కేవలం రూ.20కే అందిస్తుంది. ఎకరంలో సగటున 50–55 మొక్కలు నాటేందుకు అవసరం అవుతాయి. ఈ మేరకు రూ.10,615 విలువైన మొక్కలను కేవలం రూ. 1,100లకే రైతులకు అందిస్తోంది. అలాగే బిందు సేద్యం పరికరాలను రాయితీతో అందిస్తూ, ఎకరా నికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు నగదు ప్రోత్సాహకం ఇస్తోంది. అదనంగా పవర్ టిల్లర్లు, బ్రష్ కట్టర్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, బీసీ రైతులకు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు.
లక్ష్యం పూర్తికి చర్యలు
ప్రభుత్వం ఆదేశాలు, ఉన్నతాధికారుల సూ చన మేరకు ఒక్కో పీఏసీఎస్‌కు 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం నిర్ణయించారు. ఈమేరకు త్వరలోనే రైతులతో సమావేశాలు నిర్వహిస్తాం. సాగుపై అవగాహన కల్పించి, లక్ష్యం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం.
– నర్సయ్య, జిల్లా సహకార అధికారి, నిర్మల్
సాగు విస్తీర్ణం పెంపునకు కృషి
ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రాథమిక సహకార సంఘాల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. ఈ మేరకు రైతులను అన్ని విధాలా ప్రోత్సహిస్తాం.
– బీవీ రమణ,
జిల్లా హార్టికల్చర్ అధికారి, నిర్మల్


