‘బయో’ందోళన!
బయోమెట్రిక్‌తో సోయా రైతుల గోస పంట దిగుబడి విక్రయాలకు ఇక్కట్లు పట్టా రైతు మార్కెట్‌కు వస్తేనే సరి లేని పక్షంలో కొనుగోలుకు నిరాకరణ కుటుంబీకులు వచ్చినా నో..
సాక్షి, ఆదిలాబాద్: సోయా పంట దిగుబడులను విక్రయించేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది కొత్తగా బయోమెట్రిక్ విధానం తీసుకురావడం, అందులో క్రాప్ బుకింగ్‌లో నమోదైన పట్టాదారు వచ్చి వేలిముద్ర వేస్తేనే పంట విక్రయించుకునే వీలుంది. లేదంటే వారికి తిప్పలు తప్పడం లేదు. గతంలో పట్టాదారు రైతు ఆధార్ కార్డును తీసుకురావడం, కుటుంబ సంబంధీకులెవరైనా వచ్చి పంట దిగుబడులను విక్రయించేవారు. ఈ సారి మార్క్‌ఫెడ్ బయోమెట్రిక్ తప్పనిసరి పట్టా ఎవరి పేరు మీద ఉందో ఆ రైతు మార్కెట్‌కు రావాల్సి వస్తుంది.
రైతుల ఆందోళన
పట్టాదారు మాత్రమే మార్కెట్‌కు వచ్చి సోయా విక్రయించాలంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇ టీవల బోథ్ పీఏసీఎస్‌లో ఆందోళన చేపట్టిన రైతులు కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించా లని కోరారు. వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్న రైతు మార్కెట్ వరకు రాని పరిస్థితి ఉంటే పంటను ఎలా విక్రయించుకోవాలే అని ప్రశ్నిస్తున్నారు.
దళారులకు చెక్ పెట్టేందుకే ..
సోయా కొనుగోళ్లలో బయోమెట్రిక్ విధానం అమలుతో మధ్యవర్తులు, దళారులకు చెక్ పడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిజమైన రైతులకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎక్కడైన సమస్య ఎదురైతే పరిష్కరిస్తామని పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఇలాంటి దళారులే ఆందోళనలు నిర్వహిస్తున్నారని అంటున్నారు.
పట్టా రైతు రావాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం ద్వారా సోయా కొనుగోళ్లకు ఆదేశాలు ఇచ్చింది. పట్టా కలిగిన రైతు తప్పనిసరి మార్కెట్‌కు రావాల్సిందే. ప్రత్యామ్నాయం లేదు. అక్కడక్కడ సమస్యలు ఎదురవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– ప్రవీణ్‌రెడ్డి, డీఎం మార్క్‌ఫెడ్, ఆదిలాబాద్
సోయా పంట వివరాలు
జిల్లాలో సాగు విస్తీర్ణం : 68వేల ఎకరాలు
దిగుబడి అంచనా : 5లక్షల 40వేల క్వింటాళ్లు
ఇప్పటి వరకు విక్రయించిన రైతులు : 345
అమ్మిన పంట దిగుబడులు : 7,366 క్వింటాళ్లు
కొనుగోలు కేంద్రాలు : 10
ప్రభుత్వ మద్దతు ధర : రూ.5,328


