స్వచ్ఛత, నీటి సంరక్షణపై విస్తృత కార్యక్రమాలు
కైలాస్‌నగర్: జిల్లాలో స్వచ్ఛత, నీటి సంరక్షణ, ఆరో గ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందు కోసం ఈ నెల 13, 14 తేదీల్లో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 13న మండలాల పరిధిలో ఎంపిక చేసిన పంచాయతీల్లో ‘మన ఊరు–మన నీరు’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు, యువత, గ్రామస్తులతో అవగాహన ర్యాలీలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో నీటి ప్రాముఖ్యత, పొదుపు చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. 14న అన్ని పాఠశాల కాంప్లెక్సుల్లో ‘ఆరోగ్య జాతర’ నిర్వహించాలన్నారు. న్యూట్రిగార్డెన్స్ (పోషక తోటలు)ను ఈజీఎస్ కింద ప్రారంభించాలని ఆదేశించారు. స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా ప్రతి పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డీఆర్డీఏ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.


