చలి షురూ
పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు జిల్లాలో 14.2 డిగ్రీలకు చేరువ అందుబాటులోకి వెచ్చని నేస్తాలు అప్రమత్తత అవసరమంటున్న వైద్యులు
ఆదిలాబాద్‌టౌన్: అడవుల జిల్లా ఆదిలాబాద్.. భిన్న వాతావరణానికి నెలవు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వర్షాకాలంలో జోరు వానలు ఇక్కడ ప్రత్యేకం. ఇక చలికాలంలో దక్షిణ కశ్మీర్‌గా అభివర్ణిస్తారు. మొన్నటివరకు తుపాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండడంతో చలి ప్రభావం అంతగా కనిపించలేదు. రెండు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గజగజ మొదలైంది. ఏటా అక్టోబర్‌లోనే శీతల ప్రభావం ఉంటుండగా ఈ సారి దీపావళి వరకూ ఆ ప్రభావం కనిపించలేదు. ప్రస్తుతం చలి మొదలు కావడంతో పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
అర్లి(టి) ప్రత్యేకం..
భీంపూర్ మండలం అర్లి(టి)లో రాష్ట్రంలోనే ఏటా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. దీంతో ఈ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడతారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో సహజంగానే చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు సైతం అధికంగా కురువడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లాలో రెండు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇదివరకు 22 డిగ్రీలకు పైగా నమోదు కాగా, ప్రస్తుతం 14.2 డిగ్రీలకు చేరువయ్యాయి. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
వెలిసిన స్వెట్టర్ల దుకాణాలు..
ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో ఇప్పటికే స్వెట్టర్ల దుకాణాలు వెలిశాయి. చలి మొదలు కావడంతో ప్రస్తుతం గిరాకీ పెరిగింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్, రాంలీలా మైదానం, పంజాబ్ చౌక్ తదితర ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేశారు.
ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లో)
తేదీ కనిష్ట గరిష్ట
4 22.7 33.8
5 22.2 35.5
6 18.2 31.8
7 15.7 31.3
8 14.2 31.0
జాగ్రత్తలు పాటించాలి
చలికాలంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలోజాగ్రత్తలు పాటించాలి. ఆరు నెలల్లోపు చిన్నారులకు రెండు మూడు రోజులకోసారి స్నానం చేయించాలి. స్వెటర్లు, చేతికి గ్లౌజులు, తలకు టోపి ధరించాలి. వృద్ధులు, గర్భిణులు ఉదయం వాకింగ్ చేయకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. జలుబు, దగ్గు ఉన్నవారు గోరువెచ్చని నీళ్లు తాగాలి. అస్తమా, శ్వాసకోశ వ్యా ఽధిగ్రస్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్ హేమలత,
అసోసియేట్ ప్రొఫెసర్, రిమ్స్


