అనధికార ప్లాట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై ఆరోపణలు విచారణ చేపట్టలే.. చర్యలు తీసుకోలే.. డిప్యుటేషన్‌తో సరిపెట్టిన అధికారులు ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయంలో అధికారులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. అనేక ఆరోపణలున్నా ఇక్కడి ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌ను డిప్యుటేషన్‌పై భైంసాకు పంపించారు. అతడు ఆదిలాబాద్‌లో పని చేసింది తక్కువ కాలమే అయినా అనేక ఆరోపణలు మూట గట్టుకున్నారు. అలాంటి అధికారిపై చర్యలు తీసుకుంటారని అందరూ భావించినా డిప్యుటేషన్‌పై పంపించడంతోనే సరిపెట్టారు. విచారణ చేపట్టలేదు.. చర్యలు లేవు.. రిజిస్ట్రేషన్ శాఖలో ఇదంతా సాధారణమేనని.. పై అధికారుల అండదండలతోనే ఇవన్నీ జరుగుతుంటాయనే ఆరోపణలున్నాయి.
అక్రమంగా రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వం నుంచి నిషేధం ఉన్నప్పటికీ ఇటీవలి కా లంలో అనధికార లేఅవుట్లలో వందలాది ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఓ సబ్ రిజిస్ట్రార్‌పై ఇటీవల బాహాటంగానే ఆరోపణలు వ్యక్తమయ్యా యి. ఆదిలాబాద్ పట్టణంతో పాటు భుక్తాపూర్, కజ్జర్ల, బట్టిసావర్‌గాంవ్, ఖానాపూర్ శివార్లలోని అనధికారిక లేఅవుట్లలో వందలాది ప్లాట్లను ఈ రెండు నెలల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు ఓ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై వ్యక్తమయ్యాయి. దీనిపై ‘సాక్షి’లో ‘స్కెచ్ రెడీ!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో అప్పటికే అనధికారిక లేఅవుట్లలోని వందలాది ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని, ఈ ప్రక్రియ సక్సెస్ కావడంతో మరోసారి 280 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి డాక్యుమెంట్లు సిద్ధం చేశారని.. ఆ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడమే తరువాయి అన్నది వార్త సారాంశం. దీంతో ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. జిల్లా యంత్రాంగం నుంచి ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించి వివరాలను సంబంధిత తహసీల్దార్లు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ చర్యలతో ఉలిక్కిపడ్డ రిజిస్ట్రేషన్‌శాఖ పైఅధికారులు ఈ సబ్ రిజిస్ట్రార్‌ను ఆదిలాబాద్ నుంచి మరో చోటకు డిప్యుటేషన్‌పై పంపించి మమ అనిపించారు. ఆ అధికారి అక్రమాలపై విచారణ చేపట్టలేదు.. చర్యలు తీసుకో లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జీపీఏ ద్వారా లింక్ సృష్టించి..
ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు మొ దట జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చేసి దానికి లింక్ డాక్యుమెంట్ సృష్టించారు. ఆ తర్వాత వాటిని సేల్ డీడ్‌గా మార్చారనే ఆరోపణలున్నాయి. ఒక్కో ప్లాట్ విలువ కనీసం రూ.10లక్షలున్నా రూ.కోట్ల విలువైన లేఅవుట్లలోని ప్లాట్లను ఇలా అక్రమంగా క్రమబద్ధీకరించారు. ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్‌కు రూ.30వేల చొప్పున ముట్టజెప్పారనే ప్రచారం జరుగుతోంది.
రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకే..
రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. ఆదిలాబాద్‌లో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన ప్రవీణ్‌ను భైంసాకు డిప్యుటేషన్‌పై పంపించాం. అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలపై విచారణ చేపడతాం. త్వరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు కొత్త సబ్ రిజిస్ట్రార్లు బాధ్యతలు స్వీకరించనున్నారు.
– ప్రసన్న, జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్
అనధికారిక ప్లాట్లను సక్రమం చేసేలా..
ఈ రెండు నెలల్లోనే ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక అనధికార లేఅవుట్లలోని వందలాది ప్లాట్లు ఈ అధికారి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలున్నాయి. ఆ లేఅవుట్లలోని ప్లాట్లు ఒకసారి కూడా రిజిస్ట్రేషన్‌కు నోచుకోకపోవడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటి క్రయవిక్రయాలకు వీలులేదు. వీటిని ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే మరోసారి రీసేల్ సులువు. దానికి లింక్ డాక్యుమెంట్ దొరికిపోతుంది. ప్లాట్ల రేట్లను కూడా అమాంతం పెంచి అమ్మేసేందుకు వీలవుతుంది. లేఅవుట్ యజమానులు, డాక్యుమెంట్ రైటర్లు ఓ ప్రణాళిక రచించి సబ్ రిజిస్ట్రార్‌ను మచ్చిక చేసుకుని ఇలా రెండు నెలలుగా వందలాది ప్లాట్లను గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు. అలాగే మరోసారి స్కెచ్ రెడీ చేసినప్పుడు ‘సాక్షి’ ఈ చీకటి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత ఆ సబ్ రిజిస్ట్రార్ అసలు డ్యూటీకే రాకపోవడం, తాజాగా అతడిని డిప్యుటేషన్‌పై మరోచోటకు పంపించడం జరిగిపోయింది.
నిబంధనలా.. డోంట్ కేర్!


