వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యమని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్ పేర్కొన్నారు. గతేడాది కంటే ఈసారి మంచి ఫలితాలు సాధించేలా ప్రణాళిక తయారు చేస్తామని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. విధులను నిర్లక్ష్యం చేసే ఉపాధ్యాయులు, సిబ్బందిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని వివరాలు వెల్లడించారు.
సాక్షి: విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడతారు?
డీఈవో: ఇటీవలే బాధ్యతలు స్వీకరించాను. వి ద్యాశాఖ పనితీరుపై ఆరా తీస్తున్నాను. ఉ ద్యోగులు, సిబ్బంది పనితీరు, ఉపాధ్యా యుల సమయపాలన, బోధన తీరుపై ప్రత్యేక దృష్టి సారించాను.
సాక్షి: ‘పది’లో మెరుగైన ఫలితాల సాధనకు మీ ప్రణాళిక ఏమిటి?
డీఈవో: ఎస్సెస్సీలో గతేడాది 97శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలల్లో సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.
సాక్షి: జిల్లాలో ‘ప్రాథమిక’ విద్యార్థుల్లో చాలా మందికి చదవడం, రాయడం రావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
డీఈవో: సర్కారు బడుల్లో చదివే ప్రతీ విద్యార్థికి బేసిక్‌తో పాటు గణితం, ఇంగ్లిష్‌లో రాణించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటాం.
సాక్షి: పాఠశాలల్లో మెనూ పాటించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. దీనిపై తీసుకునే చర్యలేమిటి?
డీఈవో: ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ఎండీఎం ఏజెన్సీలు, వంట సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు వంట చేసే సమయంలో విధిగా పర్యవేక్షించాలి. ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తనిఖీలు చేపట్టాలి. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు పర్యవేక్షించేలా చర్యలు చేపడతాం.
సాక్షి: పార్ట్–2 పాఠ్యపుస్తకాలు ఇంకా జిల్లాలోని చాలా పాఠశాలలకు చేరలేదు. ఎప్పటి వరకు అందిస్తారు?
డీఈవో: జిల్లాలోని గోదాం నుంచి సంబంధిత ఎంఆర్‌సీ పాయింట్లకు పాఠ్యపుస్తకాలు వెళ్లాయి. అక్కడి నుంచి స్కూళ్లకు సరఫరా జరిగింది. ఇంకా ఎక్కడైనా అందకుంటే ఎంఈవోలు సంబంధిత పాఠశాలలకు పుస్తకాలు పంపేలా చర్యలు చేపడతాం.
సాక్షి: పీఎంశ్రీ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. బా ధ్యులపై ఏం చర్యలు తీసుకుంటారు?
డీఈవో: నిధులు దుర్వినియోగమైనట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
సాక్షి: బడుల బాగు కోసం మీ కార్యాచరణ ఏమిటి?
డీఈవో: ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా పని చేస్తాం. జిల్లాలో శిథిలావస్థలోని పాఠశాలలను గుర్తిస్తున్నాం. క్లీన్ అండ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా బడుల రూపురేఖ లు మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరమ్మతులు చేపట్టి రంగులు వేయించడం లాంటి పనులు చేయిస్తున్నాం. తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ తదితర మౌలికవసతులు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం


