ట్ర(డ)బుల్‌ ప్రయాణం..! | - | Sakshi
Sakshi News home page

ట్ర(డ)బుల్‌ ప్రయాణం..!

Nov 7 2025 7:10 AM | Updated on Nov 7 2025 7:10 AM

ట్ర(డ)బుల్‌ ప్రయాణం..!

ట్ర(డ)బుల్‌ ప్రయాణం..!

● బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ● ఆర్టీసీ ఉద్యోగులకు డబుల్‌ డ్యూటీలు

మంచిర్యాలఅర్బన్‌: ఇటీవలి కాలంలో తరచూ చో టు చేసుకుంటున్న రహదారి ప్రమాదాలు కలవర పరుస్తున్నాయి. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. నిల్చునేందుకు వీల్లేకుండా.. అత్యవసర పరిస్థితుల్లోనూ కదల్లేకుండా కిక్కిరిసిపోతున్నారు. ఏళ్ల తరబడి ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, సిబ్బంది కొరత, వరుస డ్యూటీలు, నిద్రలేమి, పని ఒత్తిడితో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సెలవుల్లో ఉన్నవారితోపాటు అనారోగ్యం నుంచి కోలుకోని వారికీ డ్యూటీలు, డ్యూటీ దిగిన వారికి డబుల్‌ డ్యూటీలు వేస్తున్నారు. విశ్రాంతి లేకపోవడంతోపా టు ప్రమాదాలకు ఇలా అనేక కారణాలున్నాయి.

‘మహాలక్ష్మి’లే అధికం..

ఆర్టీసీ బస్సుల్లో మహిళల సంఖ్య రెట్టింపైంది. పండుగ వేళల్లో రద్దీ ఉంటోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దసరా, బతుకమ్మ పండుగల వేళ 17 రోజుల్లో 599 ప్రత్యేక బస్సులు నడిపించగా మహిళలే అధి కంగా ప్రయాణించారు. మొత్తం 49,31,476 మందిలో మహిళలు 32,60,025 మంది ఉన్నారంటే పరి స్థితి అర్థం చేసుకోవచ్చు. పల్లె వెలుగు బస్సులో 55 మంది, ఎక్స్‌ప్రెస్‌ల్లో 39, రాజధానిలో 39, లగ్జరీలో 36, లహరీలో 48మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం ఏ బస్సు చూసినా రద్దీతో కిట కిటలాడుతోంది. ‘మహాలక్ష్మి’ అమలు తర్వాత బస్సుల్లో నిల్చుని, సామర్థ్యానికి మించి ప్రయాణం సాగుతోంది. మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌, భైంసా డిపోల్లో ఆర్టీసీ, అద్దె బస్సులు 630 ఉన్నాయి. 2023–24లో ప్రమాదాల సంఖ్య తగ్గినా 2024–25లో భారీగా పెరిగాయి.

డ్రైవర్లకు విశ్రాంతి కరువు?

మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సు డ్రైవర్లకు గంట తర్వాత 15నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఇలా ఎన్ని గంటలు నడిపితే అన్ని 15 నిమిషాలు గమ్యం చేరాక విశ్రాంతి ఉండాలి. ఒక రోజు విధులు నిర్వర్తిస్తే మరుసటి రోజు సెలవు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆర్టీసీ అధికారులు ఇష్టానుసారంగా విధులకు పంపిస్తున్నారు. అద్దె బస్సు డ్రైవర్లకు రోజు విడిచి రోజు విధులకు రావాలని చెబుతూ సంస్థ డ్రైవర్లకు ఓటీ డ్యూటీ చేయాలని చెప్పడం గమనార్హం. రోజుకు ఎనిమిది గంటలకు మించి విధులు కేటాయించకూడదు. గంటల తరబడి స్టీరింగ్‌పై ఉండి వాహనం నడుపుతున్నారు. మరుసటి రోజు సెలవు ఇవ్వకుండా డ్యూటీలకు పంపించడంతో ఒత్తిడి, ఆరోగ్యంపై ప్రభావం తప్పడం లేదని కొందరు పేర్కొంటున్నారు. డ్రైవర్ల సీట్లు అనువుగా లేకపోవడంతో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. పరిమితికి మించి ప్రయాణం చేస్తుండడంతో స్టీరింగ్‌ అదుపు తప్పే వీలుంటుంది. రద్దీతో గాలి ఆడకపోవడం, బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో డ్రైవర్లు, కండక్టర్లకు విధులు కష్టతరంగా మారుతున్నాయి.

బీమా రాదు..

ఏదైనా వాహనం కొనుగోలు చేస్తే బీమా ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఆర్టీసీ బస్సులకు బీమా మినహాయింపు ఇవ్వగా.. అద్దె బస్సులకు ఆర్టీసీ బీమా చేయిస్తోంది. బాధిత కుటుంబాలు కోర్టుల్లో పోరాడి ఆర్టీసీ నుంచి పరిహారం పొందడం మినహా చేసేదేమీ లేదు. బస్సుకు బీమా ఉంటే కంపెనీ పరిహారం చెల్లించే వీలుంటుంది. అద్దె బస్సుల్లో పరిమితికి తగ్గట్టుగా 55మందికే బీమా వర్తిస్తుంది. 80 నుంచి వంద మంది వరకు బస్సుల్లో ప్రయాణిస్తుండడంతో ప్రమాదం జరిగితే బీమా కంపెనీ చేతులెత్తేసే అవకాశాలున్నాయి. అద్దె బస్సుల యజమానులు అధి కారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

జాగ్రత్తలు ఇలా..

బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలివ్వాలి. నిండిన తర్వాత మరో దాంట్లో ఎక్కేలా అవగాహన కల్పించాలి. గరిష్ట ప్రయాణికుల సంఖ్య సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలి. రద్దీ రూట్లలో సర్వీసులు పెంచడం, పాఠశాల సమయం, సాయంత్రం వేళల్లో బస్సులు ఎక్కువగా తిప్పాలి.

ప్రమాదాలు ఇలా..

సంవత్సరం ప్రమాదాలు మృతులు

2021–22 44 25

2022–23 43 16

2023–24 36 16

2024–25 45 25

ప్రథమ చికిత్స లేదు

బస్సు ప్రమాదాలతో ఆర్టీసీ అప్రమత్తమైంది. మంటలార్పే పరికరాలపై దృష్టి సారించింది. అద్దె బస్సుల్లో పరికరాల ఏర్పాటుకు కొంత సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్స్‌లు లేకపోగా.. మరికొన్నింటిలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌(పౌచ్‌) అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కండక్టర్‌ టిమ్‌ మిషన్‌తోపాటు పౌచ్‌ తీసుకెళ్లడం, అప్పగించేలా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

బస్సును చుట్టిముట్టిన ప్రయాణికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement