
మద్యం షాపులకు బోణీ
● ఆదిలాబాద్‌లో ఒకటి, ఇచ్చోడలో రెండు షాపులకు టెండర్లు
ఆదిలాబాద్‌టౌన్: మద్యం షాపుల టెండర్లకు సోమవారం బోణీ అయ్యింది. ఈనెల 26న ప్రక్రియ ప్రారంభం కాగా ఆదివారం వరకు దరఖాస్తుదారులు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తూ టెండర్లు వేయలేదు. కాగా సోమవారం జిల్లాలో మూడు దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఒకటి, బోథ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధి ఇచ్చోడలో రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులకు అక్టోబర్ 18 వరకు గడువు ఉంది. 23న జిల్లా కేంద్రంలో లక్కీడ్రా తీయనున్నారు. జిల్లాలో 40 షాపులు ఉండగా, 15 షాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి. వీటిలో గౌడ్స్‌కు ఒక షాపు, ఎస్సీలకు 5, ఎస్టీలకు 9 షాపులు కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ నుంచి షాపుల నిర్వహణ చేపట్టేందుకు అవకాశం కల్పించారు. రెండేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. దరఖాస్తులను స్వీకరించిన వారిలో ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్, బోథ్, ఉట్నూర్ ఎకై ్సజ్ సీఐలు రూప్‌సింగ్, జుల్ఫేఖార్ అహ్మద్‌తో పాటు ఎకై ్సజ్ ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.