
అన్నదాతకు అండగా..!
యాంత్రీకరణకు సమాయత్తం
2018 నుంచి నిలిచిపోయిన ప్రక్రియ
పునఃప్రారంభిస్తున్న ప్రభుత్వం
జిల్లాకు 5,193 యూనిట్లు..
రూ.3కోట్ల 80లక్షల నిధులు కేటాయింపు
ఆదిలాబాద్‌టౌన్: అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2018లో సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాలు అందించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రక్రియను నిలిపివేసింది. 2025 –26 సంవత్సరంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీంతో రైతులకు మేలు జరగనుంది. రాయితీపై పరికరాలు కావాల్సిన రైతులు ఆయా మండలాల వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మార్చి 31, 2026 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. యాంత్రీకరణ సాగు కోసం జిల్లాకు 5,193 యూనిట్లను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3 కోట్ల 80లక్షల 22వేల నిధులను కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులతో పాటు మహిళ రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈప్రక్రియ పూర్తి చేసేందుకు మండల, జిల్లా పరిధిలో కమిటీలను ఏర్పాటు చేశారు.
ఆరేళ్ల తర్వాత..
వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017 –18 సంవత్సరంలో యంత్రలక్ష్మి పేరుతో రైతులకు సబ్సిడీపై పరికరాలను అందజేసింది. ఆ తర్వాత పథకాన్ని పక్కనబెట్టారు. దీంతో అన్నదాతలు సబ్సిడీ పరికరాల కోసం ఎదురుచూసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు సైతం కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులు వివిధ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు, మహిళ రైతులకు 50 శాతం సబ్సిడీపై, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందించనున్నారు.
రైతులకు తగ్గనున్న భారం..
యాంత్రీకరణ సాగుతో రైతులకు సాగు భారం తగ్గనుంది. ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత వేధిస్తోంది. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి పనులు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. దీంతో రైతులకు అదనపు ఆర్థిక భారం పడుతుంది. అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు యాంత్రీకరణ సాగు ఎంతగానో దోహద పడుతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ పథకం ఉపయుక్తంగా మారనుంది.

అన్నదాతకు అండగా..!