
ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే పోలీసులపై నమ్మకం మరింతగా పెరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎస్పీకు విన్నవించారు. సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. సు దూర ప్రాంతాల ప్రజలు తమ ఫిర్యాదులను 87126 59973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 56 మంది అర్జీదారులు భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, భార్యభర్తల విభేదాలు, పోలీస్ స్టేషన్‌లలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు తదితర సమస్యలపై ఫిర్యాదు చేశా రు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, విభాగ అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు.
‘మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి’
ఉట్నూర్‌రూరల్: మత్స్య సంపదతో ఆర్థిక లబ్ధి చేకూరుతుందని జిల్లా మత్స్య శాఖ సొసైటీ డైరెక్టర్ సిడాం సోనేరావు అన్నారు. సోమవారం ఆదివాసీ భవనంలో గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మత్స్యకారులు, చేపల పెంపకం దారులు, చేపల విక్రయదారులు, మత్స్య మహిళా సంఘాలకు ద్విచక్ర వాహనాలు, పికప్ వాహనాలు, ఫిష్‌ఫాంలు, రుణ సదుపాయం వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మి, కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ కుంర వినాయక్, ప్రతినిధి పెందూర్ వినోద్, ఆయా సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు ఉన్నారు.