
గాడిన పడేనా!
● సమస్యల్లో విజ్ఞాన భాండాగారాలు ● ఇబ్బందులు తీర్చాలంటున్న పాఠకులు ● గ్రంథాలయ జిల్లా చైర్మన్‌పై గంపెడాశలు
ఆదిలాబాద్: జిల్లావ్యాప్తంగా విజ్ఞాన భాండాగా రాలు సమస్యలకు నిలయంగా మారాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాల పరిస్థితి అధ్వానంగా మారింది. అరకొర వసతులు, సరిపడా సిబ్బంది లేక అలంకా రప్రాయంగా దర్శనమిస్తున్నాయి. పాఠకులు, నిరుద్యోగ అభ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. ఇటీవల గ్రంథాలయ సంస్థ జిల్లా నూతన చైర్మన్‌గా మల్లెపూల నర్సయ్య నియామకంతో సమస్యల పరిష్కారంపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో గల జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పాఠకులు, నిరుద్యోగ అభ్యర్థులు వందల సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇప్పటికీ దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంలోనే పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన దుస్థితి. నూతన భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో ఇరుకై న పాత భవనంలోనే కాలం వెల్లదీయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో ప్రిపరేషన్ కోసం నిరుద్యోగ అభ్యర్థులు సమీప గ్రా మాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అయితే పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో వేలాది రూపాయలు వెచ్చించి సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది. విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తూతూ మంత్రంగా ఒకటి, రెండు పుస్తకాలు తెచ్చి చేతులు దులుపుకుంటున్నారని నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొంటున్నారు.
మండల కేంద్రాల్లో మరీ దారుణం..
ఇక మండల కేంద్రాల్లోని గ్రంథాలయాల విషయానికి వస్తే సొంతభవనాలు లేకపోవడం గమనార్హం. అద్దె భవనాల్లో చాలీచాలని వసతుల నడుమ నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. పుస్తకాల విషయం పక్కన పెడితే కనీసం దినపత్రికలు సైతం అందుబాటులో ఉంచకపోవడంతో పాఠకుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రంథాలయాల్లో లైబ్రేరియన్లకు బదులు ఏళ్లుగా రికార్డు అసిస్టెంట్లతో నెట్టుకు వస్తున్నారు. మరోవైపు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు లైబ్రరీ సెస్ వసూలు చేస్తున్నప్పటికీ గ్రంథాలయ సంస్థకు బకాయిలు ఉంటుండడంతో ప్రగతి జరగట్లేదని సంబంధిత అధికారులే పేర్కొంటుండడం గమనార్హం.