ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: ఆదివాసీలకు ఐటీడీఏ ద్వారా కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని 25 పీవీటీజీ గ్రామాలకు మంజూరైన పీఎం జన్‌మన్ పథకం ద్వారా 25 వన్‌దన్ వికాస్ (వీడీవీకే) కేంద్రాలు మంజూరైనట్లు తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో అధికారులు, వీడీవీకేల అధ్యక్షులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మినీ దాల్‌మిల్, పచ్చళ్లు, పౌల్ట్రీ ఫార్మ్, పేపర్ ప్లేట్, ఇప్ప పరక నూనె, వెదురు కర్ర తయారీ కేంద్రాలకు కావల్సిన పరికరాలు, మిషనరీలు వాటికి కావల్సిన మెటీరియల్ గురించి చర్చించారు. అదేవిధంగా మిషనరీలు, పరికరాలు కొనుగోలు కోసం టెండర్ ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయ డీడీ దిలీప్‌కుమార్, ఎస్‌ఎంఎం ట్రైకార్ లక్ష్మి ప్రసాద్, సాయిచరణ్, ఆర్‌ఎం ట్రైఫెడ్ సందీప్‌శర్మ, డీపీవో ప్రవీణ్, జేఎస్‌ఎస్, వీడీవీకే సభ్యులు పాల్గొన్నారు.


