● జిల్లాకు ఈ సారి భారీగా పత్తి విత్తనాలు ● సరిపడా సరఫరాకు కంపెనీలు సిద్ధం ● కొరత ఉండదంటున్న వ్యవసాయశాఖ ● డిమాండ్‌ వైరెటీల ధర కూడా తగ్గే అవకాశం | - | Sakshi
Sakshi News home page

● జిల్లాకు ఈ సారి భారీగా పత్తి విత్తనాలు ● సరిపడా సరఫరాకు కంపెనీలు సిద్ధం ● కొరత ఉండదంటున్న వ్యవసాయశాఖ ● డిమాండ్‌ వైరెటీల ధర కూడా తగ్గే అవకాశం

Apr 26 2025 12:08 AM | Updated on Apr 26 2025 12:08 AM

● జిల్లాకు ఈ సారి భారీగా పత్తి విత్తనాలు ● సరిపడా సరఫరా

● జిల్లాకు ఈ సారి భారీగా పత్తి విత్తనాలు ● సరిపడా సరఫరా

పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు (ఫైల్‌)

తేడాది వానాకాలం సాగుకు ముందు పత్తి విత్తనాల కొనుగోలు పరంగా జిల్లాలో ఎదురైన పరిస్థితులు విదితమే. డిమాండ్‌ రకం సీడ్స్‌ కోసం రైతులు విత్తన దుకాణాల ఎదుట బారులు తీరడం మనం చూశాం. డిమాండ్‌ రకాలు ఒకటి రెండు మాత్రమే ఇచ్చి మిగతావి మామూలు రకాలు అంటగట్టారని అప్పుడు రైతుల నుంచివిమర్శలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ రాజర్షి షా, అప్పటి ఎస్పీ గౌస్‌ ఆలం స్వయంగా రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ సారి ఆ పరిస్థితి ఉండదని వ్యవసాయ శాఖ చెబుతోంది. జిల్లాకు సరిపడాకు మించి విత్తనాలు రానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. – సాక్షి, ఆదిలాబాద్‌

అడిగిన దానికంటే ఎక్కువ..

సాధారణంగానే వానాకాలం సీజన్‌కు ముందు పత్తి విత్తనాల కంపెనీలకు సంబంధించి ఇక్కడి ప్రతినిధులతో జిల్లా అధికారులు సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లతోనూ సమావేశమవుతారు. మండలం వారీగా డీలర్లతో చర్చిస్తారు. ఈ విధంగా ముందుగానే సీడ్స్‌ సరఫరాకు సంబంధించిన యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో పత్తి ఎంత సాగవుతుంది.. మార్కెట్‌లో విత్తన ప్యాకెట్లు అందుకు తగ్గట్లుగా కంపెనీలు సరఫరా చేయగలుగుతాయా లేదా అనే విషయంలోనే ఈ ముందస్తు ప్రణాళిక. జిల్లాలో ఈ సమావేశాలన్నీ వ్యవసాయశాఖ ఇటీవల పూర్తి చేసింది. అందులో విత్తన కంపెనీల ప్రతినిధులు తమ సప్లై ప్లాన్‌ను అధికారులకు తెలియజేశారు. కమిట్‌మెంట్‌ కూడా ఇచ్చేశారు. ఈ సారి అడిగినదానికంటే ఎక్కువ కూడా సరఫరా చేసేందుకు సిద్ధమని వారు తెలియజేశారు. దీంతో వ్యవసాయశాఖలో ఈ సారి సీడ్‌ వర్రీ కనిపించడం లేదు.

ఎందుకంటే ..

ఈ సారి పత్తి విత్తనాల ఉత్పత్తి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల నుంచి విత్తనాల ప్యాకెట్లు జిల్లాకు వస్తాయి. ఎక్కడైతే సీడ్‌ ఉత్పత్తి జరుగుతుందో అక్కడ గడిచిన సీజన్‌లో అకాల వర్షాలు లేకపోవడంతో విత్తన ఉత్పత్తి అధికంగా వచ్చిందని చెబుతున్నారు. అంతే కాకుండా నాణ్య మైన విత్తనం కూడా అందుబాటులో ఉందని పే ర్కొంటున్నారు. దీంతోనే డిమాండ్‌ రకాలు కూడా పుష్కలంగా అందుబాటులో ఉంటాయని అధికారులు భరోసా ఇస్తున్నారు. పత్తి పండించే రైతులు విత్తనాల విషయంలో ఆందోళన పడవద్దని, నకిలీ విత్తనాల వైపు వెళ్లవద్దని సూచిస్తున్నారు.

ధర పెరిగినా..

పత్తి విత్తనాలకు సంబంధించి ప్రైవేట్‌ మార్కెట్‌లోనే ప్యాకెట్లను విక్రయిస్తుంటారు. దీంతోనే ఏటా సీజన్‌ వచ్చిందంటే కంపెనీల ప్రతినిధులతో అధికారులు సమావేశమవుతారు. సరఫరాలో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటారు. కాగా పత్తి విత్తన ప్యాకెట్‌ 450 గ్రాములు ఉంటుంది. ఎకరానికి రెండు ప్యాకెట్లు అవసరం పడుతాయి. అయితే మెజార్టీ రైతులు డిమాండ్‌ వైరెటీ రకాలకే మొగ్గు చూపుతారు. ఆ కంపెనీ ప్యాకెట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వ్యాపారులు అవి తక్కువగా ఇచ్చి ఇతర వైరెటీలను వారికి అంటగడతారు. ఈ విషయంలోనే ఏటా రాద్దంతం అవుతోంది. అయితే ఈ ఏడాది పత్తి విత్తన ప్యాకెట్‌ ధరను కేంద్రం పెంచింది. ఒక్కో ప్యాకెట్‌పై రూ.37 పెరిగింది. అయితే ఈ సారి సీడ్‌ ప్రొడక్షన్‌ అధికంగా ఉండటంతో విత్తన కంపెనీల మధ్య పోటీ పెరగనుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్యార్పీ కన్నా తక్కువకే అమ్మినా ఆశ్చర్య పొనక్కర్లేదని పేర్కొంటున్నారు.

జిల్లాలో పత్తి సాగు, విత్తనాల వివరాలు..

సాగు విస్తీర్ణం అంచనా : 4.50 లక్షల ఎకరాలు

గతేడాది సాగైన విస్తీర్ణం : 4.37 లక్షల ఎకరాలు

విత్తన ప్యాకెట్ల డిమాండ్‌ : 11 లక్షలు

గతేడాది సప్లై చేసింది : 15 లక్షలు (మొదట్లో సీడ్‌ నష్టంతో రైతులు మళ్లీ కొనుగోలు చేశారు)

ఈ సారి ఆయా కంపెనీలు సరఫరా చేస్తామని చెప్పిన విత్తన ప్యాకెట్లు : 20 లక్షల వరకు..

విత్తన సరఫరా ప్రణాళిక సిద్ధం..

పత్తి విత్తనాలకు సంబంధించి ఈ సారి కంపెనీలు డిమాండ్‌ కంటే అధికంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వారితో సమావేశాలు పూర్తి చేశాం. ఈ ఏడాది అడిగినదానికంటే ఎక్కువే సప్‌లై చేస్తామని వారు చెప్పారు. ఈ సారి పత్తి విత్తనాల కొరత ఉండదు. రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేయనవసరం లేదు. అధికారిక విత్తన దుకాణాల్లోనే సరిపడా అందుబాటులో ఉంటాయి.

– శ్రీధర్‌ స్వామి, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement