breaking news
yamuna kishore
-
సినిమా కన్నా యాడ్ ఫిల్మ్‌కే ఎక్కువ కష్టపడాలి
క్రియేటివిటీ.. క్వాలిటీ రెండూ కావాలితక్కువ సమయంలో ఎక్కువ పనిఈ రంగంలో అవకాశాలు పుష్కలంయాడ్ డైరెక్టర్ యమునా కిషోర్ సమయం తక్కువ ఇస్తున్నారు.. సృజన ఎక్కువ ఆశిస్తున్నారు.. యాడ్ ఫిల్మ్ రంగం గురించి ఇలా చెబుతున్నారు యమునా కిషోర్. తెలుగులో సినిమా దర్శకులు అంటే బోలెడన్ని పేర్లు చెప్పగలమేమో గానీ, ప్రచార చిత్రాల దర్శకులు అంటే మనం భూతద్దం పెట్టి వెతకాల్సిందే. అలా వెతికితే దొరికే పేర్లలో ముందుంటారు యమునా కిషోర్. అచ్చతెలుగు ప్రచార చిత్రాల దర్శకుడిగా ప్రస్తుతం ఆయన టాప్ గ్రేడ్‌లో ఉన్నారు. నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రానా, అఖిల్, రామ్ చరణ్.. వంటి స్టార్స్‌తో వర్క్ చేయడంతో పాటు ఎవరూ ఊహించని విధంగా కె.విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యాంకర్ సుమ.. వంటివారిని యాడ్స్‌లోకి తీసుకొచ్చి ట్రెండ్ సెట్టర్‌గా మారారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనుభవాలను పంచుకున్నారు.. ఆ విశేషాలు.. స్వర్గసీమ, సువర్ణభూమి, ఆర్ఎస్ బ్రదర్స్, నూజివీడు సీడ్స్, కావేరీ సీడ్స్... వంటి ఎన్నో పేరున్న బ్రాండ్స్‌కి పనిచేశారు యాడ్ డైరెక్టర్ యమునా కిషోర్. దాదాపు 17 ఏళ్ల క్రితం అంటే 2007లో సంస్కారవంతమైన సోప్ ద్వారా ఈ రంగంలోకి వచ్చాను. అప్పటి నుంచీ ప్రతి ఏటా ఏదో ఒక టాప్ యాడ్ రావడం వల్ల అప్పటి నుంచి విజయవంతమైన యాడ్ ఫిల్మ్ మేకర్‌గా ఈ రంగంలో ఉన్నాను. ఇప్పటి వరకూ సెకండ్ ఇన్నింగ్స్ అనేదే లేదు. కేవలం కరోనా సమయంలో తప్ప ఎప్పుడూ ఖాళీగా లేను.అవకాశాలు పుష్కలం...అడ్వరై్టజ్మెంట్స్ రంగం గతం కంటే ఎక్కువ అవకాశాలు అందిస్తోంది. కొత్త కొత్త విభాగాలు వస్తుండడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. నటీనటుల మేకప్ కోసం ఒకప్పుడు సినిమా వాళ్లని వినియోగించేవారు. ఇప్పుడు యాడ్ ఫిల్మ్ కోసం ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. అలాగే స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, లాంగ్వేజ్ కో–ఆర్డినేటర్లు, ఇంటిమసీ కో–ఆర్డినేటర్లు, ఫుడ్ స్టైలిస్ట్స్, నెయిల్ క్లోజ్‌గా చూపాలంటే నెయిల్ మోడల్స్, లెగ్స్‌ని క్లోజ్‌గా చూపాలంటే లెగ్ మోడల్స్.. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్లో కూడా అనేక విభాగాల నుంచి అవకాశాలు పెరిగాయి. సెలబ్రిటీతో వర్క్ సంక్లిష్టమైన టాస్్క... సెలబ్రిటీల రెమ్యునరేషన్ భారీగా ఉంటోంది. కాబట్టి..సెలబ్రిటీ ఇచ్చే ప్రతి నిమిషం అత్యంత విలువైనదే. సెలబ్రిటీకి సినిమాల తరహాలోనే యాడ్ ప్లాట్ చెప్పి ఒప్పించాలి. వాళ్లు ఇచ్చిన టైమ్‌లో ఎన్ని వీలైతే అన్ని యాడ్స్ తీసేయాలి. అది యాడ్ ఫిల్మ్ మేకర్‌కి పెద్ద టాస్క్‌గా మారుతోంది. అందుకే చేయి తిరిగిన యాడ్ ఫిల్మ్ మేకర్స్‌నే సెలక్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి నేను మహే‹Ùబాబుతో ఓ యాడ్ షూట్ కోసం వర్క్ చేశాను. ఆ యాడ్‌లో భాగంగా షాప్ కీపర్‌తో, పారిశ్రామిక వేత్తలతో, ఓ ఇంట్లో కుటుంబ సభ్యులతో మహేష్ మాట్లాడతారు.. ఇవన్నీ మూడు వేర్వేరు తరహా నేపథ్యాలు కలిగినవి. అయితే ఈ మూడూ ఒకే సమయంలో షూట్ చేయడానికి మూడు సెట్లు ఒకే చోట వేశాం. సెలబ్రిటీలు ఇచ్చిన సమయం వృథా కాకుండా వారి నుంచి గరిష్ట ప్రయోజనం పొందడం ఇందులోని ముఖ్యమైన అంశం. సెలబ్రిటీల్లా.. సంస్థల యజమానులుయాడ్ ఫిల్మ్‌కి సంస్థ యజమానులే మోడల్స్‌గా మారడం అనేది చాలా కాలం క్రితమే మొదలైనా.. లలితా జ్యుయలర్స్ యాడ్ తర్వాత బాగా పెరిగింది. చాలా మంది అదే దారిలో ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఉదాహరణకు స్వర్గసీమ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన చంద్రశేఖర్ గారి గురించి చెప్పొచ్చు. ఆయనతో మేం రూపొందించిన యాడ్ ఫిల్మ్ కోసం ఒకే రోజు 25 క్యారెక్టర్లు షూట్ చేశాం. ఆయన పూర్తి స్థాయి ప్రొఫెషనల్ ఆరి్టస్ట్లా వరుసగా క్యారెక్టర్లు మారుతున్నా ఏ మాత్రం విసుగు చెందకుండా ప్రతి పాత్రలోనూ లీనమై చేశారు. అలాంటి అంకిత భావం ఉంటే తప్ప సంస్థ యజమాని అయినంత మాత్రాన వాళ్లు చేసిన యాడ్స్ హిట్ కావు. మలచుకుంటేనే.. గెలుచుకుంటాం.. యాడ్ ఫిల్మ్ మేకింగ్‌ని ప్రేమించి రావాలి. కానీ ఈ రంగంలోకి వచ్చేవారిలో సినిమాలకు వెళ్తూ వెళ్లూ మధ్యలో సరదాగానో టైంపాస్గానో చేసేవాళ్లు ఎక్కువ. పూర్తి స్థాయిలో ఈ ఫీల్డ్‌లోనే స్థిరపడాలి అనుకునేవారు తక్కువ. యాడ్ ఫిల్మ్‌కి సినిమా కన్నా ఎక్కువ కష్టపడాలి. రూపొందించే దర్శకుడికి సమాజం పట్ల అవగాహన, సమకాలీన మార్పుల మీద పట్టు అవసరం. ఆధునిక పోకడల్ని అందిపుచ్చుకుంటూ, మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా మనల్ని మనం మలచుకుంటూ డైనమిక్‌గా ఉన్నంత కాలం అవకాశాలు పుష్కలంగా వస్తూనే ఉంటాయి. క్రియేటివిటీతో పాటు స్పీడ్ కూడా.. యాడ్ ఫిల్మ్ తయారయ్యాక ప్రదర్శించడానికి ఒకప్పుడు టీవీలు లాంటి ఒకటో రెండో మాత్రమే ఉండేవి. సోషల్ మీడియా ఆగమనం తర్వాత విభిన్న రకాల వేదికలు వస్తున్నాయి. యాడ్స్ రూపకల్పన సమయంలోనే వాటిని ప్రదర్శించే వేదికల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రంగంలో వేగం, అదే సమయంలో సృజనాత్మకత కూడా పెరిగింది. ఇప్పుడు వీక్షకులు ఎక్కువ నిడివి ఉండే యాడ్స్ చూడడం లేదు. కాబట్టి వారిని కొన్ని సెకన్లలోనే ఆకట్టుకునేలా యాడ్ తీయగలగాలి. అదే సమయంలో క్రియేటివిటీ మిస్ కాకుండా చూసుకోవాలి. -
శ్రీదేవి కాల్ చేశారు.. తర్వాత భయపడ్డాను
సంస్కారానికి సబ్బుకి సంబంధం ఏంటి? చీరల్ని కేజీల కొద్దీ అమ్మే రోజులు తిరిగొచ్చాయా? కళాతపస్వి కె.విశ్వనాథ్‌తో యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేయడం సాధ్యమా? ఇలాంటి ఊహించని ఎన్నో ట్రెండ్స్‌కు చిరునామా యమునా కిషోర్. అడ్వర్టయిజింగ్ రంగంలో సంచనాలకు కేరాఫ్ అడ్రస్ ఈ హైదరాబాద్ వాసి. తెలుగు యాడ్ ఫిల్మ్ మేకర్స్‌కు స్ఫూర్తి. పదేళ్ల క్రితం వాణిజ్య చిత్రాల రూపకల్పనలో ప్రయాణం ప్రారంభించిన ఈ డిగ్రీ ఫెయిల్యూర్ కుర్రాడు... వృత్తి జీవితంలో ప్రతి పరీక్ష పాసవుతూనే ఉన్నాడు. తన ప్రయాణ ‘పది’నిసలపై కిషోర్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. ఎస్.సత్యబాబు టెన్త్ వరకు బాగా చదివినా గుంటూరులో ఎక్కువగా జరిగే నాటకాలు, సాహితీ, సినీ, సాంస్కృతిక కార్యక్రమాల చుట్టూ రౌండ్స్ కొట్టిన ఫలితం... ఇంటర్ అత్తెసరు మార్కులతో పాస్, డిగ్రీ ఫెయిల్. మొదట థియేటర్లలో ఇంటర్వెల్ టైమ్‌లో వేసే స్లైడ్స్ రూపొందించే కంపెనీలో మార్కెటింగ్ జాబ్ చేశాను. తర్వాత స్నేహితుడితో కలిసి అదే బిజినెస్ ప్రారంభించాను. స్థానిక వ్యాపార సంస్థల కోసం దాదాపు ఏడేళ్లు పనిచేశాను. ఆ తర్వాత ఆ బిజినెస్ డల్ అయింది. అప్పుడే త్రిబుల్ ఎక్స్ సోప్ కంపెనీ యజమానికి ఓ యాడ్ స్టోరీ చెప్పాను. ఆ యాడ్ నచ్చి రూ.5 లక్షలు ఇచ్చారు. అది బాగా హిట్టయింది. ఇక కళానికేతన్, ఆర్ఎస్ బ్రదర్స్, సువర్ణ భూమి, అంబికా దర్బార్ బత్తి, డబుల్ హార్స్ మినపగుళ్లు.. ఇలా వరుసబెట్టి అవకాశాలు వచ్చాయి. నేర్పబోయి నేర్చుకున్నా.. కళాతపస్వి విశ్వనాథ్ గారిని ఒక యాడ్ కోసం తీసుకోవడమనే ఆలోచన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎలా అయితేనేం ఆయన్ని ఒప్పించాను. తొలి రోజే పెద్ద డైరెక్టర్లాగా ఆయనకి ఏదో చెప్పబోయి చివాట్లు తిన్నాను. అయితే అవే తర్వాత నాకు పాఠాలయ్యాయి. ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్‌ని బట్టి సన్నివేశం, సంభాషణలు ఉండాలనే విషయం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మనసే ముఖ్యం... మైసూర్ దగ్గర మేల్కొటే అనే మారుమూల ప్రాంతంలో ఎస్పీ బాలు గారితో షూటింగ్. బంద్ కారణంగా మా ఫుడ్ వ్యాన్ని ఆపేశారు. అందరం ఆకలితో ఉన్నా, బాలు గారి గురించే నేను ఎక్కువ ఆందోళన చెందాను. అయితే ‘ఈసారికి రెండు అరటి పండ్లు చాలండీ. నా గురించి టెన్షన్ పడొద్దు’ అని ఆయన అన్నప్పుడు కళ్ల నుంచి నీళ్లొచ్చాయి. గొప్ప ప్రతిభ కాదు.. గొప్ప మనసు ఉండడం కూడా మనిషికి చాలా అవసరమని అప్పుడే తెలిసింది. మరోసారి కర్ణాటకలో షూట్ చేస్తున్నప్పుడు అభిమానులు ఆయన మీద పడిపోతుంటే నేను అడ్డుకున్నాను. దాంతో వారు నా మీద దాడికి ప్రయత్నించారు. అప్పుడు బాలు గారే వచ్చి అతి ప్రయాస మీద వాళ్లను ఆపారు. సముద్రమే చిన్నబోయేలా.. మెరీనాబీచ్‌లో మంగళంపల్లి జీవితంలో చేసిన ఫస్ట్ యాడ్ అది.. ‘సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా’ అని ఆయన పాటలాగా పాడాలి. ఆయన పాడిన క్షణాల్లో సముద్ర హోరే నిశ్శబ్దమైపోయిందంటే నమ్మండి. ఆనంద ఆనవాళ్లు ఒకసారి షూటింగ్ వివరాలు తెలుసుకోవడానికి సినీ నటి శ్రీదేవి కాల్ చేశారు. అయితే నేను టెలికాలర్ అనుకొని విసుక్కున్నాను. తర్వాత ఆమె అని తెలిశాక భయపడ్డాను. అయితే దాన్ని ఆమె స్పోర్టివ్‌గా, జోవియల్‌గా తీసుకున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ కోసం కేజీల్లో చీరలమ్మే కాన్సెప్ట్ డిజైన్ చేశాం. ఆ యాడ్‌కి టాప్ యాంకర్ సుమని అడిగాం. అయితే ఆమె విపరీతమైన బిజీ. అయినా ఒప్పించి కేవలం రెండు గంటలే సమయం తీసుకున్నాం. అనుకున్న టైమ్‌లో యాడ్ పూర్తి చేయడంతో సుమ ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె మా సంస్థలో రెగ్యులర్‌గా చేస్తున్నారు. క్రేన్ వక్కపొడి 60 ఏళ్ల వేడుక సందర్భంగా 60 ఏళ్లున్న అప్పటి, ఇప్పటి నటీనటులతో యాడ్ చేయాలని కష్టపడి ఎందరినో పట్టుకున్నాం. రావికొండలరావు, సత్యనారాయణ, చంద్రమోహన్, అన్నపూర్ణ... ఇలా 100 మంది ఆర్టిస్టులతో షూట్ చేశాం. సారథి స్టూడియోలో అది ఒక పండగలా జరిగింది. ఒక యాడ్ షూట్ కోసం సిరివెన్నెల కుటుంబంతో రుషికేష్‌లో వారం రోజులు గడపడం.. మర్చిపోలేని అనుభూతి. ఆయన కవితలు, పాటలు వినిపిస్తుంటే జీవితానికి ఇంతకు మించి దక్కే వరం ఏముంటుంది? కష్టం.. నష్టం చెన్నైలో కాజల్ అగర్వాల్ ఆర్టిస్టుగా షూటింగ్. రేపు షూట్ అనగా సాయంత్రం 6 గంటలకు లైట్మెన్లు మెరుపు సమ్మె ప్రకటించారు. ఎంతో బతిమిలాడితే అనుమతిచ్చి ఉదయాన్నే అడ్డుకున్నారు. దీంతో చాలా నష్టం వచ్చింది. అయితే కాజల్, ఆమె తండ్రి షూటింగ్ హైదరాబాద్‌లో కంటిన్యూ చేద్దామని మద్దతివ్వడం చాలా ఆనందాన్నిచ్చింది.