సినిమా కన్నా యాడ్‌ ఫిల్మ్‌కే ఎక్కువ కష్టపడాలి | Ad Film Maker Yamuna Kishore Comments On Ad Shooting With Celebrities, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలతో పని చేయడం కష్టమైన టాస్క్‌: యాడ్‌ డైరెక్టర్‌

Jul 20 2024 12:07 PM | Updated on Jul 20 2024 1:38 PM

Ad Film Maker Yamuna Kishore

క్రియేటివిటీ.. క్వాలిటీ రెండూ కావాలి
తక్కువ సమయంలో ఎక్కువ పని
ఈ రంగంలో అవకాశాలు పుష్కలం
యాడ్‌ డైరెక్టర్‌ యమునా కిషోర్‌  

సమయం తక్కువ ఇస్తున్నారు.. సృజన ఎక్కువ ఆశిస్తున్నారు.. యాడ్‌ ఫిల్మ్‌ రంగం గురించి ఇలా చెబుతున్నారు యమునా కిషోర్‌. తెలుగులో సినిమా దర్శకులు అంటే బోలెడన్ని పేర్లు చెప్పగలమేమో గానీ, ప్రచార చిత్రాల దర్శకులు అంటే మనం భూతద్దం పెట్టి వెతకాల్సిందే. అలా వెతికితే దొరికే పేర్లలో ముందుంటారు యమునా కిషోర్‌. అచ్చతెలుగు ప్రచార చిత్రాల దర్శకుడిగా ప్రస్తుతం ఆయన టాప్‌ గ్రేడ్‌లో ఉన్నారు. నాగార్జున, వెంకటేష్, మహేష్‌ బాబు, రానా, అఖిల్, రామ్‌ చరణ్‌.. వంటి స్టార్స్‌తో వర్క్‌ చేయడంతో పాటు ఎవరూ ఊహించని విధంగా కె.విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యాంకర్‌ సుమ.. వంటివారిని యాడ్స్‌లోకి తీసుకొచ్చి ట్రెండ్‌ సెట్టర్‌గా మారారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనుభవాలను పంచుకున్నారు.. ఆ విశేషాలు..  

స్వర్గసీమ, సువర్ణభూమి, ఆర్‌ఎస్‌ బ్రదర్స్, నూజివీడు సీడ్స్, కావేరీ సీడ్స్‌... వంటి ఎన్నో పేరున్న బ్రాండ్స్‌కి పనిచేశారు యాడ్‌ డైరెక్టర్‌ యమునా కిషోర్‌. దాదాపు 17 ఏళ్ల క్రితం అంటే 2007లో సంస్కారవంతమైన సోప్‌ ద్వారా ఈ రంగంలోకి వచ్చాను. అప్పటి నుంచీ ప్రతి ఏటా ఏదో ఒక టాప్‌ యాడ్‌ రావడం వల్ల అప్పటి నుంచి విజయవంతమైన యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌గా ఈ రంగంలో ఉన్నాను. ఇప్పటి వరకూ సెకండ్‌ ఇన్నింగ్స్‌ అనేదే లేదు. కేవలం కరోనా సమయంలో తప్ప ఎప్పుడూ ఖాళీగా లేను.

అవకాశాలు పుష్కలం...
అడ్వరై్టజ్‌మెంట్స్‌ రంగం గతం కంటే ఎక్కువ అవకాశాలు అందిస్తోంది. కొత్త కొత్త విభాగాలు వస్తుండడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. నటీనటుల మేకప్‌ కోసం ఒకప్పుడు సినిమా వాళ్లని వినియోగించేవారు. ఇప్పుడు యాడ్‌ ఫిల్మ్‌ కోసం ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. అలాగే స్టైలింగ్, కాస్ట్యూమ్‌ డిజైనింగ్, లాంగ్వేజ్‌ కో–ఆర్డినేటర్లు, ఇంటిమసీ కో–ఆర్డినేటర్లు, ఫుడ్‌ స్టైలిస్ట్స్, నెయిల్‌ క్లోజ్‌గా చూపాలంటే నెయిల్‌ మోడల్స్, లెగ్స్‌ని క్లోజ్‌గా చూపాలంటే లెగ్‌ మోడల్స్‌.. ఇక ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో కూడా అనేక విభాగాల నుంచి అవకాశాలు పెరిగాయి.  

సెలబ్రిటీతో వర్క్‌ సంక్లిష్టమైన టాస్‌్క... 
సెలబ్రిటీల రెమ్యునరేషన్‌ భారీగా ఉంటోంది. కాబట్టి..సెలబ్రిటీ ఇచ్చే ప్రతి నిమిషం అత్యంత విలువైనదే. సెలబ్రిటీకి సినిమాల తరహాలోనే యాడ్‌ ప్లాట్‌ చెప్పి ఒప్పించాలి. వాళ్లు ఇచ్చిన టైమ్‌లో ఎన్ని వీలైతే అన్ని యాడ్స్‌ తీసేయాలి. అది యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌కి పెద్ద టాస్క్‌గా మారుతోంది. అందుకే చేయి తిరిగిన యాడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌నే సెలక్ట్‌ చేస్తున్నారు. ఉదాహరణకి నేను మహే‹Ùబాబుతో ఓ యాడ్‌ షూట్‌ కోసం వర్క్‌ చేశాను. ఆ యాడ్‌లో భాగంగా షాప్‌ కీపర్‌తో, పారిశ్రామిక వేత్తలతో, ఓ ఇంట్లో కుటుంబ సభ్యులతో మహేష్‌ మాట్లాడతారు.. ఇవన్నీ మూడు వేర్వేరు తరహా నేపథ్యాలు కలిగినవి. అయితే ఈ మూడూ ఒకే సమయంలో షూట్‌ చేయడానికి మూడు సెట్లు ఒకే చోట వేశాం. సెలబ్రిటీలు ఇచ్చిన సమయం వృథా కాకుండా వారి నుంచి గరిష్ట ప్రయోజనం పొందడం ఇందులోని ముఖ్యమైన అంశం.  

సెలబ్రిటీల్లా.. సంస్థల యజమానులు
యాడ్‌ ఫిల్మ్‌కి సంస్థ యజమానులే మోడల్స్‌గా మారడం అనేది చాలా కాలం క్రితమే మొదలైనా.. లలితా జ్యుయలర్స్‌ యాడ్‌ తర్వాత బాగా పెరిగింది. చాలా మంది అదే దారిలో ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్‌ అవుతున్నారు. ఉదాహరణకు స్వర్గసీమ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన చంద్రశేఖర్‌ గారి గురించి చెప్పొచ్చు. ఆయనతో మేం రూపొందించిన యాడ్‌ ఫిల్మ్‌ కోసం ఒకే రోజు 25 క్యారెక్టర్లు షూట్‌ చేశాం. ఆయన పూర్తి స్థాయి ప్రొఫెషనల్‌ ఆరి్టస్ట్‌లా వరుసగా క్యారెక్టర్లు మారుతున్నా ఏ మాత్రం విసుగు చెందకుండా ప్రతి పాత్రలోనూ లీనమై చేశారు. అలాంటి అంకిత భావం ఉంటే తప్ప సంస్థ యజమాని అయినంత మాత్రాన వాళ్లు చేసిన యాడ్స్‌ హిట్‌ కావు.  

మలచుకుంటేనే.. గెలుచుకుంటాం.. 
యాడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ని ప్రేమించి రావాలి. కానీ ఈ రంగంలోకి వచ్చేవారిలో సినిమాలకు వెళ్తూ వెళ్లూ మధ్యలో సరదాగానో టైంపాస్‌గానో చేసేవాళ్లు ఎక్కువ. పూర్తి స్థాయిలో ఈ ఫీల్డ్‌లోనే స్థిరపడాలి అనుకునేవారు తక్కువ. యాడ్‌ ఫిల్మ్‌కి సినిమా కన్నా ఎక్కువ కష్టపడాలి. రూపొందించే దర్శకుడికి సమాజం పట్ల అవగాహన, సమకాలీన మార్పుల మీద పట్టు అవసరం. ఆధునిక పోకడల్ని అందిపుచ్చుకుంటూ, మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా మనల్ని మనం మలచుకుంటూ డైనమిక్‌గా ఉన్నంత కాలం అవకాశాలు పుష్కలంగా వస్తూనే ఉంటాయి.  

క్రియేటివిటీతో పాటు స్పీడ్‌ కూడా.. 
యాడ్‌ ఫిల్మ్‌ తయారయ్యాక ప్రదర్శించడానికి ఒకప్పుడు టీవీలు లాంటి ఒకటో రెండో మాత్రమే ఉండేవి. సోషల్‌ మీడియా ఆగమనం తర్వాత విభిన్న రకాల వేదికలు వస్తున్నాయి. యాడ్స్‌ రూపకల్పన సమయంలోనే వాటిని ప్రదర్శించే వేదికల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రంగంలో వేగం, అదే సమయంలో సృజనాత్మకత కూడా పెరిగింది. ఇప్పుడు వీక్షకులు ఎక్కువ నిడివి ఉండే యాడ్స్‌ చూడడం లేదు. కాబట్టి వారిని కొన్ని సెకన్లలోనే ఆకట్టుకునేలా యాడ్‌ తీయగలగాలి. అదే సమయంలో క్రియేటివిటీ మిస్‌ కాకుండా చూసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement