breaking news
World Agriculture Forum Congress
-
మంత్రి కన్నాను నిలదీసిన రైతులు
హైదరాబాద్ : అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు వేదిక వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. సదస్సుకు రైతులను అనుమతించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ సదస్సుకు అనుమతించటం లేదంటూ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఈ సందర్భంగా రైతులు నిలదీశారు. అయితే జిల్లాల వారీగా ఎంపిక చేసిన రైతులను మాత్రమే సదస్సుకు ఉచితంగా ప్రవేశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సదస్సును ఏర్పాటు చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ సదస్సుకు రైతులను అనుమతించకపోవటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాగా అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు సభ్యత్వ నమోదు రుసుమును ప్రభుత్వం రూ.5,000గా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ప్రారంభమైన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు
హైదరాబాద్ : అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణం సోమవారం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సుకు 9 నెలల క్రితం నుంచే సన్నాహాలు చేయనారంభించినా ప్రతినిధుల స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నిర్వాహకులు మొదట చెప్పినట్లు ప్రధాని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బిల్‌గేట్స్ రావడం లేదు. చివరికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణే కార్యక్రమాన్ని నడిపించే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 350 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విదేశీ ప్రతినిధులే 350 మంది హాజరవుతారని తొలుత ప్రకటించారు. చివరకు వీరి సంఖ్య 33కు పరిమితమైంది. సభ్యత్వ నమోదు రుసుమును రూ.10,600 నుంచి రూ.5,000కు తగ్గించినప్పటికీ ప్రతినిధుల సంఖ్య పెరగలేదు.