breaking news
Womens One Day Cricket World Cup
-
దీప్తి ఆల్‌రౌండ్ షో
గువాహటి: సొంతగడ్డపై అట్టహాసంగా ఆరంభమైన వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ సాధించిన దీప్తి శర్మ బౌలింగ్‌లో కీలక వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. దీంతో మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్... వర్షం వల్ల కుదించిన 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (53 బంతుల్లో 53; 3 ఫోర్లు), అమన్‌జోత్ కౌర్ (56 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రాణించారు. లంక బౌలర్లలో ఇనొక రణవీర 4 వికెట్లు, ప్రబోధని 2 వికెట్లు తీశారు. అనంతరం దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ చమరి ఆటపట్టు (47 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగ్గా ఆడింది. దీప్తి (3/54) సహా భారత బౌలర్లు స్నేహ్ రాణా (2/32), ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి (2/37), క్రాంతి (1/41), అమన్‌జోత్ (1/37), ప్రతిక (1/6) సమష్టిగా ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టారు. అమన్‌జోత్‌తో నడిపించి... బౌలింగ్‌తో గెలిపించి... భారత వెటరన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షోకు శ్రీలంక కుదేలైంది. ప్రతీక (37; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్లీన్ డియోల్ (64 బంతుల్లో 48; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ మరోవైపు కీలక స్టార్లు స్మృతి మంధాన (8), హర్మన్‌ప్రీత్ (21), జెమీమా (0), రిచా ఘోష్ (2) విఫలమవడంతో 124/6 స్కోరు వద్ద భారత్ పనైపోయిందనిపించింది. ఈ దశలో దీప్తి, అమన్‌జోత్‌తో కలిసి భారత్‌ను నడిపించింది. లంక అమ్మాయిల చెత్త ఫీల్డింగ్‌తో అమన్‌జోత్ మూడుసార్లు 18, 37, 50 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడింది. ఇద్దరు అర్ధసెంచరీ పూర్తి చేసుకొని జట్టును ఒడ్డుకు చేర్చారు. ఏడో వికెట్‌కు 99 బంతుల్లో 103 పరుగులు జోడించాక ముందుగా అమన్‌జోత్, అనంతరం దీప్తి అవుటయ్యారు. ఆఖర్లో స్నేహ్ రాణా (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించింది. తర్వాత కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. ఓపెనర్, కెపె్టన్ చమరి ఆటపట్టు, వన్‌డౌన్ బ్యాటర్ హర్షిత (29; 3 ఫోర్లు), మిడిలార్డర్లో నీలాక్షిక సిల్వా (29 బంతుల్లో 35; 4 ఫోర్లు; 1 సిక్స్) మెరుగ్గా ఆడారంతే! మిగతా బ్యాటర్లను భారత బౌలింగ్ దళం క్రీజులో నిలువనీయలేదు.స్కోరు వివరాలుభారత మహిళల ఇన్నింగ్స్: ప్రతిక రావల్ (సి) విష్మి (బి) ఇనొక 37; స్మృతి మంధాన (సి) విష్మి (బి) ప్రబోధని 8; హర్లీన్ డియోల్ (సి) దిల్హారి (బి) ఇనొక 48; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ఇనొక 21; జెమీమా రోడ్రిగ్స్ (బి) ఇనొక 0; దీప్తి శర్మ (సి) సుగంధిక (బి) అచిని 53; రిచా ఘోష్ (సి) ప్రబోధని (బి) చమరి 2; అమన్‌జోత్ (సి) విష్మి (బి) ప్రబోధని 57; స్నేహ్ రాణా (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (47 ఓవర్లలో 8 వికెట్లకు) 269. వికెట్ల పతనం: 1–14, 2–81, 3–120, 4–120, 5–121, 6–124, 7–227, 8–269. బౌలింగ్: అచిని కులసూర్య 8–0–42–1, ఉదేíÙక ప్రబోధని 10–1–55–2, సుగంధిక 9–0–46–0, కవిశా దిల్హారి 8–0–51–0, ఇనొక రణవీర 9–0–46–4, చమరి 3–0–24–1. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (బి) క్రాంతి గౌడ్ 14; చమరి (బి) దీప్తి శర్మ 43; హర్షిత (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 29; విష్మి గుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) అమన్‌జోత్ 11; కవిశా (సి) రిచా ఘోష్ (బి) దీప్తి 15; నీలాక్షిక (బి) స్నేహ్ రాణా 35; అనుష్క (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తి 6; సుగంధిక (బి) స్నేహ్ రాణా 10; అచిని (సి) స్మృతి (బి) శ్రీచరణి 17; ప్రబోధని (నాటౌట్) 14; ఇనొక రణవీర (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రతిక రావల్ 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (45.4 ఓవర్లలో ఆలౌట్) 211. వికెట్ల పతనం: 1–30, 2–82, 3–103, 4–105, 5–130, 6–140, 7–173, 8–184, 9–199, 10–211. బౌలింగ్: క్రాంతి గౌడ్ 9–0–41–1, అమన్‌జోత్ 6–0–37–1, స్నేహ్ రాణా 10–0–32–2, దీప్తి శర్మ 10–1–54–3, శ్రీచరణి 8–0–37–2, ప్రతిక 2.4–0–6–1. -
2021 ప్రపంచకప్‌తోనే ముగిస్తా
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఎప్పుడంటూ తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ సమాధానమిచ్చింది. తన సుదీర్ఘ కెరీర్‌ను వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌తో ముగిస్తానంటూ ఆమె ఆదివారం ప్రకటించింది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ హైదరాబాదీ... 2021లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ‘2021 వన్డే ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది. అప్పడు భారతే టైటిల్‌ను గెలుస్తుందని భావిస్తున్నా. ఒకవేళ అదే జరిగితే భారత్‌లో మహిళల క్రికెట్ అభివృద్ధికి గొప్ప మలుపు అవుతుంది. ఎందరో అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. 2017 ప్రపంచకప్ ఫైనల్ ప్రభావం మనం ఇప్పుడు చూస్తున్నాం’ అని మిథాలీ వివరించింది. తాను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటితో పోలిస్తే ఇప్పుడు మహిళా క్రికెటర్లకు మంచి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల తరహాలో ఐసీసీ ఈవెంట్లలో ఇప్పుడు భారత్ కూడా టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోందన్న ఆమె... దీనికి ఆటగాళ్ల కృషితోపాటు బీసీసీఐ సహాయక సిబ్బంది తోడ్పాటే కారణమని చెప్పింది. ‘మహిళల క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. నేను అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సమయంలో విదేశీ పర్యటనల సమయంలో ఆట గురించి చాలా నేర్చుకున్నా. కానీ ఇప్పుడు షెఫాలీ వర్మ లాంటి యువ క్రీడాకారిణిలకు అరంగేట్రానికి ముందే అంతర్జాతీయ అనుభవం ఉంటుంది. దేశవాళీ టోర్నీలు, చాలెంజర్ ట్రోఫీలు ఆడటం ద్వారా వారు చాలా నేర్చుకుంటున్నారు. మాకు అప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) శిబిరాల గురించి కూడా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు మహిళా క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టులు కూడా దక్కుతున్నాయి. ఆదాయం పెరగడంతో కేవలం ఆటపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతోంది’ అని మిథాలీ వివరించింది. -
మిథాలీ రాజ్‌కు రూ.కోటి నజరానా
►హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 600 గజాల నివాస స్థలం ►ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన హైదరాబాద్: మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. మిథాలీకి ప్రభుత్వం తరఫున రూ.కోటి నగదు ప్రోత్సాహం ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. మిథాలీ కోచ్ మూర్తికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మిథాలీ... ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మిథాలీతోపాటు ఆమె కోచ్ ఆర్.ఎస్.ఆర్. మూర్తిని కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. ‘ప్రపంచ కప్‌లో అద్భుతంగా ఆడారు. ఫైనల్ దాకా వచ్చారు. ఫైనల్లో కూడా గెలవడం ఖాయం అనుకున్నాం. దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో ఓడిపోయాం. అయినప్పటికీ మీ జట్టంతా అద్భుతంగా ఆడింది. దేశమంతా మీ ఆట చూసింది. నేనూ చూశాను. అంతా మీకు మద్దతుగా నిలిచారు. నువ్వు ఈ టోర్నీలో బాగా ఆడావు. అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నావు. అద్భుత ప్రతిభ కనబరిచావు. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. వ్యక్తిగతంగా నా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున అభినందనలు. నీకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని మిథాలీతో కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మిథాలీరాజ్ తల్లిదండ్రులు లీలారాజ్, దొరై రాజ్, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీ అంజనీ కుమార్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, శాట్స్ ఎండీ దినకర్ బాబు, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర సర్కార్ కూడా.. ముంబై: మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తమ రాష్ట్ర క్రీడాకారిణులు స్మృతి మంధన, పూనమ్ రౌత్, మోనా మేశ్రమ్లకు రూ. 50 లక్షల చొప్పున నగదు పురస్కారం ప్రకటించింది.


