Women legislators
-
జాతీయ మహిళా లెజిస్లేచర్ సదస్సుకు కవిత
సాక్షి,హైదరాబాద్: కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే జాతీయ మహిళా లెజిస్లేచర్ సదస్సులో పాల్గొనాల్సిందిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో భాగంగా కేరళ శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు జాతీయస్థాయి నేతలు హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా ఈ నెల 27న ‘నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిథ్యం’అనే అంశంపై లోక్‌సభ సభ్యురాలు రమ్యా హరిదాస్ అధ్యక్షతన జరిగే చర్చా గోష్టిలో కవిత ప్రసంగించనున్నారు. కవితతో పాటుగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ రితు ఖండూరీ, భారత మహిళా జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీరాజా పాల్గొననున్నారు. కేరళ ఎమ్మెల్యేలు ఓఎస్ అంబిక, దలీమా సమన్వయం చేస్తారు. -
అన్నిటా ఆమె మహిళా దినోత్సవ సందర్భంగా
రాజకీయాల్లో రాణిస్తున్న మహారాణులు.. పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్న మహిళలు విశాఖపట్నం : అతివలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. చట్ట సభల్లోనూ తమ హవా చాటుకుంటున్నారు. జిల్లాలోని 15 అసెంబ్లీ సిగ్మెంట్లకు గాను పాడేరు, పాయకరావుపేటల నుంచి మహిళా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అరకు లోక్‌సభ నుంచి మహిళ ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ పీఠంతో పాటు రెండు మున్సిపాల్టీలు వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇక 925 పంచాయతీల్లో 463 పంచాయితీల్లో పెత్తనం వారిదే. జెడ్పీలో కీలక భూమిక పోషించే 39 జెడ్పీటీసీలతో పాటు 39 ఎంపీపీల్లో సైతం సగం మండలాలు వారి చేతుల్లోనే ఉన్నాయి. 656ఎంపీటీసీ సభ్యుల్లో 328 మంది మహిళా మణులే. ఇక అధికారులు విషయానికొస్తే..జిల్లా వైద్య ఆరోగ్యం, దేవాదాయం, వ్యవసాయ, పర్యాటక, ఐసీడీఎస్, ఉన్నత విద్య, ప్రాధమిక విద్య, ఎస్సీ కార్పొరేషన్ల జిల్లా ఉన్నతాధికారుల స్థానాలతో పాటు పోలీస్ శాఖల్లో కూడా కీలకమైన పోస్టుల్లో మహిళలు రాణిస్తున్నారు. సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు రంగాల్లో 40 శాతం మంది మహిళలు అద్బుతంగా పనిచేస్తూ ఆయా సంస్థల అభ్యున్నతిలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. రిజర్వేషన్ల పరంగా స్థానిక సంస్థలు,, చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల్లో కూడా చైతన్యం పెరిగింది. నిన్నమొన్నటివరకు కుటుంబ సభ్యులు..రాజకీయ పార్టీల నేతల చేతుల్లో రబ్బర్‌స్టాంప్‌గా పరిమితమైన మహిళలు నేడు పాలనలో వారి పెత్తనాన్ని పక్కన పెట్టి తమదైన పంథాలో దూసుకెళ్తున్నారు. దీంతో క్రమేపీ పురుషుల కంటే ధీటుగా అన్నిరంగాల్లోనూ రాణించగలమని తెగేసిచెబుతున్నారు. అధికార పక్షంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నా అటు అసెంబ్లీలోనూ.. ఇటు స్థానిక సంస్థల్లోనూ ప్రజాసమస్యలపై గళమెత్తుతున్నారు. అయినా ఎందుకు వివక్ష.. ఆడశిశువుల సంఖ్య మాత్రం నానాటికి తగ్గిపోతూనే ఉంది. అక్షరాశ్యతా శాతంలో కూడా జిల్లా ఇంకా వెనుకబడే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 42,90,589 కాగా..పురుషులు.21,38,910 మహిళలు..21,51,679. అంటే పురుషుల కంటే మహిళా జనాభా ఎక్కువ. గత పదేళ్లలో మహిళల పుట్టుక తగ్గిపోతుంది. ఇందుకు తాజాగణాంకాలే ఆధారం. ప్రస్తుతం జిల్లాలోఆరేళ్ల లోపు చిన్నారుల్లో మగశిశువులు..2,30,630 కాగా, ఆడశిశువులు 2,21,583 మంది ఉన్నారు. ప్రతీ వెయ్యి మందికి 960 మంది మాత్రమే మహిళలుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే. జిల్లాలో చదువుకున్న వారిలో కూడా మహిళ అక్షరాస్యతా శాతం చాలా తక్కువగా ఉంది. రాష్ర్టంలో అక్షరాస్యతా శాతం 67.02గా ఉంటే..మన జిల్లాలో 66.91 శాతంగా ఉంది. ఇక వీరిలో పురుషుల అక్షరాస్యతా శాతం 74.56 శాతంగాఉంటే..మహిళల అక్షరాస్యతా శాతం కేవలం 59.34 శాతంగా మాత్రమే ఉంది. పైగా ఇటీవలే ఆడవాళ్లను చదివించాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో కలుగుతుంది. నగరంలో ఓకే..కానీ పల్లెల్లో.. విశాఖ నగరం,,పరిసర ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యతా శాతం మెరుగ్గానే ఉన్నప్పటికీ గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఆశించన స్థాయిలో పురోగతి కన్పించడం లేదు. ఆనాటి ఉద్యమాల్లో వేతన సవరణల కోసం ఉద్యమించి మహిళలు విజయాలకు చిహ్నంగా నేడు మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. నేడు అది ఫ్యాషన్‌గా మారిపోయింది. ముగ్గులు పోటీలు, వ్యాసరచన పోటీలంటూ ప్రతి క్లబ్‌లు, సంఘాలు దినోత్సవం చేసుకోవడం రివాజుగా మారిపోయింది. మహిళలు అన్నీ రంగాల్లో విజయం సాధించాలంటే క్షేత్రస్థాయి వారి జీవితాల్లో చైతన్యం తీసుకురావాలి. సమాజంలో నేటికీ కొనసాగుతున్న వివక్షతా విషవలయాలు పటాపంచలవ్వాలి. అసంఘటిత రంగంలో పని చేస్తున్న నిరుపేద మహిళలను తీవ్రంగా కుంగదీస్తుంది. ఫలితంగా ఆహారం-ఆరోగ్యస్థితుగతులు పూర్తిగా క్షీణిస్తున్నాయి. ఇప్పటికీ అభద్రత చోటు చేసుకుంది. చీకటిపడితే ఇంటికి చేరే వరకు ఆ తల్లిదండ్రులకు టెన్షన్ తప్పడంలేదు. కుల,వర్గ,జాతి విభేదాలు లేకుండా మహిళల హక్కుల కోసం, మానవాళి సంక్షేమానికి పాలక వర్గాలు అంకిత భావంతో పనిచేయడం లేదు. -
‘కామన్వెల్త్’కు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న ఢిల్లీలో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఢిల్లీ చాప్టర్ నిర్వహిస్తున్న సదస్సుకు తెలంగాణ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ‘భారతదేశ ప్రజాస్వామ్యం- మహిళల పాత్ర’ అనే అంశంపై జరిగే ఈ సెమినార్లో గొంగిడి సునీత(టీఆర్ఎస్), ఎన్.పద్మావతి(కాంగ్రెస్) పాల్గొననున్నట్లు అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. -
మంత్రివర్గంలో మహిళలెందరు..?
గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు మహిళలు కేసీఆర్ కూర్పుపై ఆసక్తి.. హైదరాబాద్: తెలంగాణ కేబినెట్లో ఎంతమంది మహిళలు ఉంటారు? ఏయే జిల్లాల నుంచి మహిళలకు ప్రాతినిధ్యం దక్కనుంది? కేసీఆర్ మదిలో ఏముంది? అన్నది ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు, నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన 63 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు మహిళలున్నారు. రేఖానాయక్(ఖానాపూర్), కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), బొడిగె శోభ(చొప్పదండి), పద్మా దేవేందర్‌రెడ్డి(మెదక్). గొంగిడి సునీత(ఆలేరు), కొండా సురేఖ(వరంగల్ తూర్పు)లు టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వీరిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కనుందనే విషయమై పార్టీ శ్రేణులకూ అంతుచిక్కడం లేదు. గతంలో పనిచేసిన అనుభవం, సామాజికవర్గం, జిల్లాల మధ్య సమతూకం, జిల్లాల్లోని రాజకీయ వర్గాల మధ్య సమన్వయం, విధేయత వంటివాటిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఎన్నికైనవారిలో కొండా సురేఖ, పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. గొంగిడి సునీత, బొడిగె శోభ, కోవా లక్ష్మి, రేఖా నాయక్ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడుతున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖకు అవకాశం ఇవ్వాలంటే వరంగల్ జిల్లాలో సీనియర్లు ఎక్కువమంది మంత్రివర్గంలో బెర్త్ కోసం పోటీ పడుతున్నారు. చందూలాల్, డాక్టర్ టి.రాజయ్య, మధుసూదనాచారి, దాస్యం వినయ్ భాస్కర్ పోటీలో ఉన్నారు. వీరిలో చందూలాల్‌కు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. బీసీ వర్గాలకే చెందిన వినయ్‌భాస్కర్ , మధుసూదనాచారి కూడా మంత్రి వర్గంలో బెర్త్ కోసం పోటీ పడుతుండగా, కొండా సురేఖకు అవకాశం దక్కుతుందా? లేదా అనేది ఆ పార్టీలో ఉత్కంఠను కలిగిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ జిల్లాలోని గజ్వేల్ నుంచి, ఆయన మేనల్లుడు టి.హరీశ్‌రావు సిద్దిపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్, ముఖ్యమైన పోర్టుఫోలియోలోనే హరీశ్‌రావు ఒకే రెవెన్యూ డివిజన్ నుంచి మంత్రివర్గంలో ఉంటున్నారు. అందువల్ల మరో రెవెన్యూ డివిజన్‌కు చెందిన పద్మా దేవేంద ర్ రెడ్డికి అవకాశం ఉండొచ్చునని పార్టీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి జి.జగదీశ్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జిల్లా నుంచి ఒకవేళ మరొకరికి కేబినెట్లో అవకాశం కల్పిస్తే జిల్లాలో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో గొంగిడి సునీతకే చోటు దక్కనుంది. ఆదిలాబాద్‌లో ఇద్దరూ కొత్తవారే అయినా రేఖానాయక్, కోవా లక్ష్మిలో ఒకరికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈటెల, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్‌కు కేబినెట్లో చోటు ఖాయమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జిల్లా నుంచి మరొకరికి అవకాశం అనుమానమేనని తెలుస్తోంది. ఇదే జరిగితే మంత్రి వర్గంలో బొడిగె శోభకు స్థానం లేనట్టే.