breaking news
water scare
-
భగవాన్ ఈ శిక్ష ఎవరికి?
ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో అశేష పూజలందుకున్న ఆదిదేవుడు.. చివరకు ఇలా మిగిలాడు. పెరిగిన పోటీతత్వంతో గల్లీకి రెండు.. మూడు వినాయక మంటపాలను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో ఆర్భాటాలకు పోయి హంగామా చేశారు. భక్తి పేరుతో పర్యావరణానికి హాని తలపెట్టారు. మట్టి గణపతులను కాకుండా గొప్పలకు పోయిన పలువురు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, విషపూరిత రసాయనిక రంగులు, ఇనుప చువ్వలతో తయారు చేసిన ప్రతిమలను కొలువుదీర్చారు. చివరి రోజు ఇలా నిర్లక్ష్యంగా పడేశారు. నీటిలో కరగని వ్యర్థాలతో శింగనమల చెరువు కాస్తా కలుషితమైపోయింది. మట్టి గణపయ్యలను పూజించి.. నిమజ్జనం చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. నీటిలో పడేసిన వినాయకుడి ప్రతిమలను తమ బతుకు తెరువు కోసం కొందరు బుధవారం ఒడ్డుకు లాగారు. వాటిని పగులగొట్టి, అందులో ఉన్న ఇనుప చువ్వలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఐదు రోజుల పాటు ఎనలేని భక్తి భావం చూపిన చోటే... ఆరో రోజు ఇంతటి నిర్ధయను చవిచూడాల్సి రావడం ఆ విఘ్నాధిపతి చేసుకున్న దౌర్భాగ్యమా? మట్టి ప్రతిమలను పూజలకు వినియోగించడంలో భక్తుల నిర్లక్ష్యమా? ఏదేమైనా.. పర్యావరణం మాత్రం దెబ్బతినింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు శింగనమల చెరువుకు ఎన్ని రోజులు పడుతుందో.. - జి.వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్. -
నీటి కొరత లేదు
కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) వద్ద ఏర్పాటు చేసిన అనంత, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత లేదని డీఈ పక్కీరప్ప శుక్రవారం తెలిపారు. డ్యాంలో నీటి మట్టం పెరుగుతోందన్నారు. 18 రోజుల క్రితం డ్యాంలో 1.8 టీఎంసీల నీరు మాత్రమే ఉండేదన్నారు. కానీ ఇప్పుడు 2.1 టీఎంసీల నీరుందన్నారు. అంతేకాకుండా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రోజూ 550 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. అలాగే జల విద్యుత్ కేంద్రలో విద్యుత్ ఉత్పత్తి కోసం రోజూ విడుదల చేసే 800 క్యూసెక్కుల నీటిని నిలిపేశామన్నారు. దీంతో ఔట్‌ఫ్లో తగ్గిపోయిందన్నారు. వేసవిరీత్యా ఈ మూడు తాగునీటి ప్రాజెక్టులకు 1.5 టీఎంసీల వరకు నీటిని నిల్వ ఉంచుతామన్నారు.