breaking news
Voicemail
-
ఏకీకృత లైసెన్స్ పరిధిలోకి ఆడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇక నుంచి ఆడియో కాన్ఫరెన్సింగ్, ఆడియోటెక్స్, వాయిస్ మెయిల్ సర్వీసుల లైసెన్సింగ్ విధానం.. ’ఏకీకృత లైసెన్స్’ పరిధిలోనే ఉండనున్నట్లు టెలికం విభాగం (డాట్) వెల్లడించింది. ప్రస్తుతం ఆడియోటెక్స్, వాయిస్ మెయిల్ సర్వీసులకు స్టాండెలోన్ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటోంది. తాజా మార్పుల ప్రకారం ప్రస్తుతం వీఎంఎస్ / ఆడియోటెక్స్ / యూఎంఎస్ లైసెన్సులు ఉన్న సంస్థలు ఏకీకృత లైసెన్సుకు మారడమనేది ఐచ్ఛికంగానే ఉంటుందని డాట్ తెలిపింది. కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ‘2001 జులై 16న ఇచ్చిన వీఎంఎస్, ఆడియోటెక్స్, యూఎంఎస్ లైసెన్సులను పునరుద్ధరించడం లేదా కొత్తగా స్టాండెలోన్ లైసెన్సులను జారీ చేయబోము‘ అని డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం రంగంలో విధానపరమైన సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. -
పండగ చేస్కో
హ్యూమర్ ఫ్లస్ జీవితంలో చేదు, వగరు, పులుపే ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా తీపి తగిలే టైం వస్తే అప్పుడు మనకు సుగరొస్తుంది. ఈ సత్యం తెలిసే మనకు ఉగాది పచ్చడి పెడతారు. నిజానికి మనం టెక్నాలజీ రుచి మరిగి అసలు రుచుల్ని గుర్తుపట్టే స్థితిలో లేము. ఒకాయనకి ఫేస్బుక్ చూస్తూ భోంచేయడం అలవాటు. లైక్‌లు కొట్టికొట్టి అలసిపోయి చెయ్యి కడుక్కుంటాడు. చికెన్ చాలా బావుందని భార్యకి చెబుతాడు. ఆమె వాట్సాప్ మెసేజ్‌ల్లో ఇరుక్కుపోయి థ్యాంక్సండీ అంటుంది. నిజానికి అతనేం తిన్నాడో అతనికి తెలియదు. ఏం వండిందో ఆమెకి గుర్తులేదు. ఇంకొకాయన సన్నాసుల్లో కలిసిపోయాడు. ఈయన దగ్గర సెల్‌ఫోన్ వున్నందువల్ల తమలో కలుపుకోవడానికి సన్నాసులు నిరాకరించారు. భార్య తనతో ఫేస్బుక్లో తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడ్డం లేదని అలిగి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏరోజుకారోజు భర్త తన ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేస్తే తప్ప అతన్ని ఆమె గుర్తుపట్టలేదు. చేతిలో సెల్‌ఫోన్ లేకుండా కనిపిస్తే ఆమెను అస్సలు అతను గుర్తుపట్టలేడు. అతనికోసం ఆమె వెతక్కుండా ఫేస్బుక్ పోస్టింగ్ పెట్టింది. చూసి చూడనట్టున్నాడు. ఒకరోజు జుత్తు విరబోసుకున్న ఫోటోని అప్డేట్ చేసేసరికి శ్మశాన వైరాగ్యం ఆవరించి సెల్‌ని చితకబాది కాశీలోని హరిశ్చంద్ర ఘాట్‌లో సెటిలైపోయాడు. ‘ఇల్లు ఇల్లనేవు, సెల్లు సెల్లనేవు చిలకా’ అని పాడుతూ ఎవరికో కనిపించాడట. భర్త ఈరకంగా కాశీమజిలీ యాత్ర చేశాడని ఆమె పోస్టింగ్ పెడితే రెండొందలమంది లైక్ కొట్టారు. మొగుడ్ని సన్యాసుల్లో కలిపే చిట్కా వివరించమని కోరుతూ ఐదొందలమంది వాట్సప్ మెసేజ్‌లు పెట్టారు.పల్లెటూళ్లలో కూడా సోషల్ మీడియా వచ్చేసింది. ఫలానా సుబ్బమ్మకి చాలా టెక్కులు అని పోస్టింగ్ పెడితే అన్నివర్గాల వారు లైక్‌లు నూరి కామెంట్లు అతికిస్తున్నారు. కుళాయిల దగ్గర కొట్టుకోవడం మానేసి వాట్సప్ గ్రూపుల్లో యుద్ధం చేస్తున్నారు. ఎండల దెబ్బకి ఈసారి కవుల గొంతు కూడా మూగబోయేలా ఉంది. గొంతు సవరించుకునేలోగా దాహమేసి నీళ్లు తాగేస్తున్నారు. గతంలో కవిత్వం చదివి శ్రోతల చేత మూడు చెరువుల నీళ్లు తాగించేవాళ్లు కూడా ఈసారి సేఫ్‌సైడ్‌గా వాయిస్‌మెయిల్‌ని ఆశ్రయిస్తున్నారు.కవిత్వాన్ని మెయిల్ చేస్తే అవతలివాళ్లు దాన్ని జాగ్రత్తగా డౌన్లోడ్ చేసి సమ్మేళనాల్లో వినిపిస్తున్నారు. శ్రోతలు వహ్వా అనకపోయినా, నిర్వాహకులే ముందస్తుగా వహ్వాలు రికార్డు చేసి, అవతలిపక్షానికి డౌన్లోడ్ చేయిస్తున్నారు. నిజానికి కవుల గొంతు లోడ్ చేసిన తుపాకీ లాంటిది. ట్రిగ్గర్ నొక్కితే పశుపక్ష్యాదులు కూడా కకావికలే. ఈ పొల్యూషన్‌కి కోయిలలకి కూడా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. పాడ్డం మానేశాయి. కనపడుతున్నట్టు కూడా లేదు. లేదంటే ఫేస్‌బుక్స్ వాళ్లు విజృంభించి ఫోటోలు పెట్టేవాళ్లు. ఉగాదినాడు ఎవరి పంచాంగాలు వాళ్లు చదువుకుంటారు. అందరికీ అన్నీ శుభాలే జరుగుతాయంటారు. పులికి, మేకకి ఏకకాలంలో శుభం జరగడం అసాధ్యం. దేవుడు ఎప్పుడూ ఒకరిపక్షానే ఉంటాడు. ఎక్కువసార్లు పులిపక్షంలో ఉంటాడు. కనపడని పులితో జూదమాడ్డమే పులిజూదం. మాటలన్నీ మాయమై మెసేజ్లుగా మారిపోతున్నాయి. అన్నిటినీ గూగుల్ సెర్చ్‌లో వెతుక్కునే మనం, ఏదో ఒకనాడు మనల్ని మనమే వెతుక్కుంటాం. వెతుక్కున్నా దొరకం. మనల్ని మనం గుర్తుపట్టలేకపోవడమే మాడ్రన్ లైఫ్. ఎప్పుడో ఒకరోజు పండగ రావడం కాదు. ఎప్పుడూ పండగలా జీవించడమే నిజమైన ఉగాది. - జి.ఆర్. మహర్షి -
అభివృద్ధి పథంలో 'వాయిస్ మెయిల్ ఫార్మర్స్'
ఆధునిక టెక్నాలజీని ఆ మహిళలు అంది పుచ్చుకున్నారు. నిరక్షరాస్యత వ్యాపారాభివృద్ధికి అడ్డు కాదని నిరూపించారు. కాస్త తెలివి, కొంచెం డబ్బు ఉంటే చాలు... చదువు లేకపోయినా ఏకంగా స్వంత కంపెనీ స్థాపించారు. తమిళనాడులోని సుమారు వెయ్యిమంది మహిళలు ఒక్కతాటిపైకి వచ్చి మొబైల్ ఫోన్ వినియోగం (వాయిస్ మెయిల్) ద్వారా మేకల పెంపకంలో మెళకువలను నేర్చుకున్నారు. శాస్త్రీయ చిట్కాలను, పశువుల ఆరోగ్య రక్షణను వాయిస్ మెయిల్ ద్వారా తెలుసుకుంటూ... 'వాయిస్ మెయిల్ ఫార్మర్స్' గా గుర్తింపు పొందారు. సుమారు పదిహేనేళ్ళక్రితం నిరక్షరాస్యులైన వెయ్యిమంది మహిళలు (వాయిస్ మెయిల్ ఫార్మర్స్) స్థాపించిన కంపెనీ ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తోంది. ప్రస్తుతం 1,300 మంది మహిళల భాగస్వామ్యంతో ప్రారంభించిన స్వంత కంపెనీ... స్థానిక మహిళాభివృద్ధికి బాటలు వేసింది. పచ్చదనం నడుమ... బోడి వెస్ట్ హిల్స్ ప్రాంతంలో గోట్ ఫార్మర్స్ కంపెనీ ఏర్పాటై... చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సైతం సహాయ సహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఒక్కొక్కరు వెయ్యి రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టి... థేని జిల్లా కేంద్రంగా మేకల రైతులు స్థాపించిన 'గోట్ ఫార్మర్స్ కంపెనీ లిమిడెడ్' స్థానిక మహిళల సత్తాను చాటుతోంది. ఐకమత్యమే మహా బలం అన్న చందంగా... ఆ మహిళా రైతులు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. స్వంత కంపెనీ స్థాపించి అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. మేకల రైతులు వారి మేకలను మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా అమ్ముకునేందుకు ఈ కంపెనీ సహాయపడుతుంది. మేకలకు కావాల్సిన గ్రాసం, మందులు వంటివి కూడ ఈ కంపెనీ ద్వారా కొనుగోలు చేసి, పంపిణీ చేస్తారు. అనుకున్న ప్రణాళికలను అమలు పరుస్తూ వందశాతం నాణ్యతను అందించేందుకు ఈ మహిళా రైతులు చేస్తున్నారు. ఇటీవల థేని కలెక్టర్ ఎన్. వెంకటాచలం ఈ గోట్ ఫార్మర్స్ కంపెనీని ప్రారంభించారు. సంస్థలోని పదిమంది బోర్డు మెంబర్లలో ఎనిమిది మంది మహిళా మెంబర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి, స్థానిక సామాజిక సంస్థ విడియాల్ సాంకేతిక సహాయం అందిస్తోంది.