విశాఖను కొత్తగా విశ్వనగరం చేయడం ఏంటి?
మనకు నచ్చిన వాడు అధికారంలో ఉంటే.. విశాఖ విశ్వనగరి అవుతుంది. లేదంటే ఎందుకు కొరగానిది. సాగర ముప్పు ఎదుర్కుంటుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా వైఖరి. డేటా సెంటర్, లేదా ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్ భూములు కేటాయిస్తే రాష్ట్రాన్ని అదానికి రాసిచ్చేస్తున్నట్లు... అదే చంద్రబాబు ఇస్తే... మాస్టర్‌స్ట్రోక్ అన్నమాట. అయితే ఈ రకమైన ద్వంద్వ వైఖరితో ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు వాటి పరువును మరింతగా బజారుకీడుస్తున్న సంగతి వాటికి అర్థం కావడం లేదని అనిపిస్తుంది. తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి నారా లోకేశ్‌ల ప్రయోజనాలను కాపాడడమే తమ లక్ష్యంగా ఈ రెండు పత్రికలు పని చేస్తున్నాయి. తమ రాతల ద్వారా, ప్రసారాల ద్వారా ప్రజలను నిత్యం మోసం చేయాలని ప్రయత్నిస్తోంది.ఈనాడు పత్రిక కొద్ది రోజుల క్రితం విశ్వనగరి.. మన విశాఖ అని ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అదాని గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయడానికి రెండు రోజుల ముందు రాసిన స్టోరీ ఇది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల దృష్టి ఇటువైపే అని పేర్కొంది. అంతే... ఏయు శతాబ్ది ఉత్సవాల్లో, డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలోనూ బాబు కూడా అదే రాగం ఎత్తుకున్నారు. నిజానికి విశాఖ ఎప్పటి నుంచో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉన్న నగరం. విశాఖపై దాడికి ప్రయత్నించి పాకిస్థాన్ జలాంతర్గామిని భారత నావికాదళం సముద్రంలో ముంచేసింది ఇక్కడే. ఆ జలాంతర్గామి ఇప్పటికీ అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంటుంది.అంతేకాదు. సుందరమైన సముద్రతీరం దాని సొంతం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ అంతటా జరిగిన పెద్ద ఉద్యమం దేశం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దానిని నీరుకార్చి ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కోసం కూటమి పెద్దలు తాపత్రయపడుతున్నారు. అది వేరే విషయం. హెచ్పీసీఎల్తో పాటు హిందుస్తాన్ జింక్, అనేక భారీ పరిశ్రమలు కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ ఏర్పాటయ్యాయి. రెండు పోర్టులు, షిప్ యార్డులు ఉన్నాయి. అందువల్లే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే ఏపీకి మంచి గ్రోత్ ఇంజన్ అవుతుందని భావించారు. దానిని అడ్డుకుంది ఇదే తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ ఎల్లో మీడియానే! ఎక్కడ జగన్‌కు పేరొచ్చేస్తుందో అనే దుగ్ధ. ఎలాగైనా దానిపై విషం చిమ్మాలన్న ఏకైక లక్ష్యంతో ఆ మీడియా పనిచేసింది. అందుకే అప్పట్లో ఈనాడు ‘‘తీరంలో చీలిక’’, ‘‘ఈ గాయం తీరనిది’’, ‘‘మరిగే ఎండ కరిగే మంచు, పొంగే సముద్రం ..ఆ నగరాలకు ముప్పు ..జాబితాలో మన విశాఖపట్నం కూడా ,భయపెడుతున్న నాసా అధ్యయనం అని వార్తలు వండి వార్చారు. సముద్రం కారణంగా విశాఖ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని రాశారంటే ఏమని అనుకోవాలి. అంతేకాదు.. తీర ప్రాంతం గుండా భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు విస్తరణ చేస్తుంటే ,ప్రజల ఇళ్లు పోతాయని రెచ్చగొడుతూ స్టోరీలు ఇచ్చారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి 'అదాని అడిగారని..2600 కోట్ల భూమి 130 కోట్లకే సొంతం’ అని రాసింది. కృష్ణపట్నం పోర్టును కట్టబెట్టారు..గంగవరం పోర్టును చుట్టబెట్టి ఇచ్చారు., ఇది అదాని పై సర్కార్ కు ఉన్న ప్రేమ అని విమర్శిస్తూ స్టోరీలు ఇచ్చారు. ఇప్పుడు ఇవే మీడియా సంస్థలు ఆహో, ఓహో అని తెగ పొగుడుతూ వార్తలు ఇస్తున్నాయి. అదాని డెటా సెంటర్‌ను గూగుల్ డేటా సెంటర్ గా ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. ఇక అది సాధ్యం కాదని అర్ధం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే అదాని డేటా సెంటర్ కే ప్రభుత్వం భూములు కేటాయించవలసి వచ్చింది.ఈ కంపెనీ ఏర్పాటు చేసే డేటా సెంటర్ ను గూగుల్ వాడుకుంటుంది.అంటే ఒక రకంగా అద్దెకు తీసుకుంటుందన్న మాట. తప్పులేదు. కాని జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఆ భూమి ఎకరా విలువ రూ.20 కోట్లు ఉంటుందని లెక్కగట్టింది. ఎకరా కోటి రూపాయలకే ఇచ్చేస్తారా అని తప్పుపట్టింది. ఇప్పుడేమో 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతుంటే అబ్బ! ఎంత గొప్పదనం అని తెగ సంబర పడుతోంది. ఇలా ఉంటుంది ఎల్లో మీడియా ద్వంద్వ నీతి. అదాని డేటా సెంటర్ జగన్ టైమ్ లో వచ్చింది. దానిని మరికొంత పెంచి 490 ఎకరాల భూమిని ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ అన్నారు. ఒకే. ఫర్వాలేదు.ఈ డేటా సెంటర్ వల్ల తక్కువ ఉద్యోగాలు వస్తాయనే కదా జగన్ ఆ రోజుల్లో పలు షరతులు పెట్టి 25 వేల ఉద్యోగాలు కల్పించాలని జి.ఓ.లో పేర్కొన్నారు. ఇప్పుడేమో కేవలం 200 ఉద్యోగాలే వస్తాయని ప్రభుత్వమే అధికారికంగా తెలిపింది. ఆ తర్వాత ఫ్లెక్సీలలో మాత్రం లక్ష ఎనభైవేల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ ప్రచారం చేస్తే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు రావని తేల్చి చెప్పారు. ఈ డేటా సెంటర్లపై అమెరికా, మరికొన్ని దేశాలలో ఎందుకు వ్యతిరేకత వస్తుందో కూడా గమనించాలి. విశాఖ నగరానికి సరఫరా చేసే విద్యుత్ పరిణామం అంత ఈ డేటా సెంటర్ కు నిత్యం అవసరం అవుతుందట.అలాగే నీరు కూడా భారీగా వాడుకుంటుంది. ఇవి ఒక ఎత్తు అయితే ఏకంగా ఈ కంపెనీకి 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై సీనియర్ రిటైర్డ్ అధికారి ఈఎఎస్ శర్మ వంటివారు ఆక్షేపిస్తున్నారు. ఒకవైపు ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అని లోకేశ్ చెబుతున్నారు. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాలలో మాదిరి ఇక్కడ కూడా ఆ కంపెనీలు భూమి కొనుగోలు చేసి యూనిట్లను స్థాపించి ఉండేవి కదా అన్నదానికి జవాబు ఉండదు. భూములు 99 పైసలకే ఇవ్వడం ద్వారా విశ్వనగరం విశాఖ బ్రాండ్‌ను చంద్రబాబు సర్కార్ పాడు చేస్తున్నదా అన్న సందేహం కలుగుతుంది. జగన్ టైమ్‌లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకుని డెవలప్మెంట్ సెంటర్ ను ఆరంభించింది.దానివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడలేదు. కాని ఇప్పుడు అదే కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకే అప్పగిస్తున్నారు. ఈ సంస్థ ప్రతి మూడు నెలలకు రూ.8500 కోట్ల లాభాలు ఆర్జిస్తుంటుంది. అలాంటి సంస్థకు దాదాపు ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరముందా? అలాగే ఐటి ముసుగులో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ప్రభుత్వ భూములను ఉదారంగా పందేరం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇలాగైతే విశాఖ విశ్వనగరం ఎలా అవుతుంది? భవిష్యత్తులో ప్రభుత్వ భూములే లేకుండా పోతాయి. ఈ స్థితిలో గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ అంతర్జాతీయ గేట్ వేగా ఏపీ అవుతుందని, ఉత్తరాంధ్ర నుంచి వలసలకు ఇకపై బ్రేక్ పడుతుందని చంద్రబాబు చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టడం కాకుండా మరొకటి అవుతుందా? గేమ్ ఛేంజర్ వంటి పడికట్టు పదాలను వాడవచ్చు కాని, కేవలం వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే ఈ సంస్థ ద్వారా ఎలా వలసలు ఆగుతాయో తెలియదు.ఈ కంపెనీ తొలుత 85వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని అన్నారు.అది తర్వాత 135000 కోట్లు అని చెప్పారు.ఇప్పుడు మీడియాలో లక్షన్నర కోట్ల పెట్టుబడి అంటున్నారు.నిజంగా ఈ స్థాయిలో పెట్టబుడులు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించుకోవచ్చు.నిజంగానే భారి పెట్టుబడులు పెట్టి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే సంతోషించవచ్చు.అలా కాకుండా వైజాగ్ కు ఈ డేటా సెంటర్ లు భారం కాకుండా ఉంటే చాలు అదే పదివేలు అనుకునే పరిస్థితి రాకూడదని చెప్పాలి. కేంద్ర రైల్వే,ఐటిల శాఖల మంత్రి అశ్వనీ వైభవ్ మరింత ఆశ్చర్యకరమైన ప్రకటన ఇచ్చి వెళ్లారు.ఎల్లో మీడియాలో మంచి హెడింగ్ కోసం చెప్పారేమో తెలియదు కాని,అమరావతికి బుల్లెట్ రైలు వచ్చేసిందన్న చందంగా మాట్లాడడడం విడ్డూరం. ఆంధ్ర ప్రజలు అమాయకులని,వారికి ప్రపంచంలో జరిగే విషయాలేవి తెలియదని అనుకుంటున్నట్లుగా ఉంది. మొత్తం మీద ఈ మూడేళ్లు వేలాడే ముంతను చూపుతూ ప్రజలను ఊరిస్తారా? లేక ఏమైనా వాస్తవరూపం దాల్చేలా చేస్తారా అన్నది కాలమే తేల్చుతుంది. కొసమెరుపు ఏమిటంటే ఈ డేటా సెంటర్ నిమిత్తం తర్లుపాడు గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నా, ఇంతవరకు పరిహారం ఇవ్వలేదట. వారు నిరసన చెబుతారని ఊరును దిగ్బందం చేసి కార్యక్రమం నిర్వహించారట. దీనిని బట్టే ప్రభుత్వం చిత్తశుద్ది అర్థం చేసుకోవచ్చేమో! ఇంతకాలం సైబరాబాద్, హైదరాబాద్ తామే నిర్మించామని చంద్రబాబు చెబుతుండేవారు.ఇకపై విశాఖను తామే విశ్వనగరం చేశామని, తామే నిర్మించామని ప్రచారం చేసుకుంటారేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత