breaking news
vinupriya
-
మృగాడి వికృత చేష్ట.. వినుప్రియ విషాదాంతం!
- ఫేస్బుక్లో వినుప్రియ ఫొటోమార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన యువకుడు - ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఖాకీలు, సైబర్ క్రైమ్ - నగుబాటు భరించలేక తనువు చాలించిన యువతి - ప్రేమికుడి అరెస్ట్.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమ మాటున మృగాడి వికృత చేష్ట.. ఖాకీల అలవిమాలిన నిర్లక్ష్యం.. వెరసి యువతి ప్రాణాలు తీశాయి. ఫొటోమార్ఫింగ్పై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో భరించలేని అవమాన భారంతో బాధితురాలు ఉరి వేసుకొని తనువు చాలించింది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు అన్నాదురై కుమార్తె వినుప్రియ (20) బీఎస్సీ పాసై ఓ పాఠశాలలో టీచర్‌గా చేరింది. హాయిగా సాగుతున్న ఆమె జీవితంలో మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫొటోలు ఈనెల 17న ఫేస్బుక్లో ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసి అవమానభారంతో కుంగిపోయిన వినుప్రియ తల్లిదండ్రులకు చెప్పుకొని బోరున విలపించింది. తండ్రి అన్నాదురై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఐడీని బ్లాక్ చేసే సర్వర్ విదేశాల్లో ఉంటుందని, ఇందుకు 20 రోజులు పడుతుందని అక్కడ తాపీగా సమాధానం ఇచ్చారు. అన్నాదురై అక్కడి నుంచి సైబర్‌క్రైం పోలీసుల వద్దకు వెళ్లి వేడుకున్నాడు. అక్కడ ఒక సెల్‌ఫోన్ కొనివ్వమని హెడ్ కానిస్టేబుల్ సురేశ్ బేరమాడాడు. అన్నాదురై వెంటనే సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అయినా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం సురేశ్ చేయలేదు. ఈ క్రమంలో 26న మరోసారి వినుప్రియ అశ్లీల ఫొటో ఫేస్బుక్లో కనిపించింది. హతాశులైన తల్లిదండ్రులు మళ్లీ పోలీసుల వద్దకు పరుగులు తీశారు. తనకు, తనవారికి జరిగిన అవమానాన్ని భరించలే కపోయిన వినుప్రియ ఈనెల 26న సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్బుక్ ఐడీని బ్లాక్ చేయడానికి 20 రోజుల సమయం పడుతుందని నిర్లక్ష్యం వహించిన పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల్లోనే బ్లాక్ చేశారు. మూడో రోజునే నిందితుడి అరెస్ట్ జరిగిపోయింది. ఫిర్యాదు అందగానే పోలీసులు చర్య తీసుకుని ఉంటే మరోసారి అశ్లీల ఫొటోలు ప్రచారమయ్యేవి కావని, వినుప్రియ నిండు ప్రాణాలు పోయేవి కావని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రేమించలేదని.. ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారిన సురేశ్ అనే యువకుడే వినుప్రియ ప్రాణాలను బలిగొన్నట్లు తెలుస్తోంది. సేలం జిల్లా కల్‌పారాపట్టికి చెందినసురేశ్.. వినుప్రియ వెంట పడేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వినుప్రియ తల్లిదండ్రులు హెచ్చరించడంతో ఆమె పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. వినుప్రియ ఫొటోను సంపాదించి మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెట్టినట్లు బుధవారం అరెస్టయిన సురేశ్ పోలీసుల వద్ద అంగీకరించాడు. సెల్‌ఫోన్ లంచంగా తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సురేశ్‌ను సస్పెండ్ చేశారు. వినుప్రియ ఫొటోలను మార్ఫింగ్ చేసిన నిందితుడిపై పోలీసులు కేసు పెట్టారు. -
వినుప్రియ ఆత్మహత్య కేసులో ...
టీనగర్: వినుప్రియ ఆత్మహత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సేలం సమీపానగల ఇలంపిళ్లై ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అన్నాదురై కుమార్తె వినుప్రియ (20) ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్లో అసభ్య చిత్రాన్ని విడుదల చేసిన నిందితులను అరెస్టు చేసేంతవరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లమని తెలుపుతూ వినుప్రియ తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ అమిత్‌కుమార్ సింగ్ సమాధాన చర్చలు జరపడంతో వినుప్రియ మృతదేహాన్ని వారు తీసుకువెళ్లారు. ఇలావుండగా ఈ కేసు గురించి మకుడంచావడి పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ఇందులో ఇలంపిళ్లై సమీపానగల కల్పారపట్టి ప్రాంతానికి చెందిన పి. సురేష్ (21) అనే చేనేత కార్మికుని పోలీసులు అరెస్టు చేశారు. నష్ట పరిహారం చెల్లించాలి: ఐద్వా ఆత్మహత్య చేసుకున్న వినుప్రియ కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలంటూ అనైత్తిండియా జననాయగ మాదర్ సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ఈ కేసులో వినుప్రియ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన జరిపారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి తంగవేలు, ఐద్వా జిల్లా కార్యదర్శి కె. రాజాత్తి, ఇందియ జననాయగ వాలిబర్ సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనిగురించి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ ఈ కేసును సత్వరమే ముగించాలని కోరారు. వినుప్రియ మరణానికి పోలీసులు నైతిక బాధ్యత వ హించాలని, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నష్ట పరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. -
వినుప్రియ విషాదానికి కారకులు ఎవరు?
- ఏకపక్ష ప్రేమికుడా, పట్టించుకోని పోలీసా? -విషాదంతో ముగిసిన వినుప్రియ జీవితం -ప్రేమికుడి అరెస్ట్ -హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ సాక్షి ప్రతినిధి, చెన్నై ప్రేమ అనే మధురమైన రెండక్షరాలు యువతీయువకుల జీవితాలను అందమైన మలుపు తిప్పగలవు. పెళ్లిపీటల వరకు నడిపించి నిండు నూరేళ్లు బతకాలన్న ఆశలను చిగురింపజేయగలవు. అవే రెండక్షరాలు ఏకపక్షమైతే ఓ నిండు జీవితాన్ని ఆదిలోనే నిర్దాక్షిణ్యంగా ఆర్పేయగలవు. ప్రేమ ముసుగులో ఓ మృగాడు సాగించిన వికృతచేష్ట వినుప్రియ అనే ఉపాధ్యాయురాలి జీవితాన్ని చిదిమేసింది. వినుప్రియ (20) బలవన్మరణానికి బాధ్యులు ఎవరు? మార్ఫింగ్‌కు పాల్పడిన ఏకపక్ష ప్రేమికుడా? ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసా? అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు అన్నాదురై కుమార్తె వినుప్రియ. పేదింటిలో పుట్టినా టీచర్‌గా జీవించాలని ఆశపడింది. బీఎస్సీ పాసై సమీపంలోని ఓ పాఠశాల్లో ఉపాధ్యాయురాలిగా చేరింది. హాయిగా సాగుతున్న ఆమె జీవితంలో మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫొటోలు ఆందోళనను రేకెత్తించాయి. ఈనెల 17వ తేదీన ఫేస్బుక్ ద్వారా ప్రచారం జరగడంతో అవమానభారంతో కుంగిపోయిన వినుప్రియ తల్లిదండ్రులకు చెప్పుకుని బోరున విలపించింది. కుమార్తెను ఓదార్చిన తండ్రి అన్నాదురై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వెంటనే సదరు ఫేస్బుక్ ఐడీని బ్లాక్ చేయాలని, నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరాడు. అయితే అక్కడి సిబ్బంది ఈ ఫిర్యాదును సర్వసాధారణంగా తీసుకోవడంతో పాటూ హేళనగా మాట్లాడారు. ఐడీని బ్లాక్ చేయగల సర్వర్ విదేశాల్లో ఉంటుంది. ఇందుకు 20 రోజులు పడుతుందని తాపీగా సమాధానం ఇచ్చారు. అన్నాదురై అక్కడి నుంచి సైబర్‌క్రైం పోలీసుల వద్దకు వెళ్లి వేడుకున్నాడు. సిమ్‌కార్డు వేసి మాట్లాడేందుకు వీలుగా ఒక సెల్‌ఫోన్ కొనివ్వమని సైబర్‌క్రైం పోలీసు హెడ్‌కానిస్టేబుల్ సురేష్ డిమాండ్ చేశాడు. కుమార్తెకు న్యాయం జరుగుతుందని ఆశతో అన్నాదురై రూ.2,350 ఖర్చుచేసి వెంటనే సెల్‌ఫోన్ కొనిచ్చాడు. సెల్‌ఫోన్‌ను లంచంగా పుచ్చుకున్న సురేష్ దానిని వినుప్రియ కేసు విచారణకు ఉపయోగించకుండా ఇంట్లో ఇచ్చాడు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. రోజులు గడుస్తున్నా ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ చేయలేదు. అంతే ఈనెల 26వ తేదీన మరోసారి వినుప్రియ అశ్లీల ఫొటో, అన్నాదురై ఫోన్ నంబరు సహా అదే ఫేస్బుక్లో ప్రత్యక్షమైంది. హతాశయులైన తల్లిదండ్రులు అన్నాదురై, మంజుల ఫిర్యాదు చేసిన పోలీసుల వద్దకు మళ్లీ పరుగులు తీశారు. తనకు, తనవారికి జరిగిన అవమానాన్ని భరించలే క పోయిన వినుప్రియ తల్లిదండ్రులు పోలీసుల కోసం వెళ్లగానే ఆదివారం (26వ తేదీ) సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. ‘మీరంతా ముందు నన్ను క్షమించండి, నా జీవితమే నాశనం అయిన తర్వాత జీవించి ప్రయోజనం ఏమిటి. నాకు జీవించాలని లేదు. నిజం చెబుతున్నా నా ఫొటోలు ఎవ్వరికీ పంపలేదు. ఏ తప్పూ చేయలేదు. బిలీవ్ మీ వన్స్ ఎగైన్. సారీ..సారీ’ అంటూ ఆమె మృతదేహం సమీపంలో దొరికిన ఒక ఉత్తరం వినుప్రియ హృదయఘోషకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఫేస్బుక్ ఐడీని బ్లాక్ చేయడానికి 20 రోజుల సమయం పడుతుందని నిర్లక్ష్యం వహించిన పోలీసులు ఆమె ఆత్మహత్యకు చేసుకున్న కొన్ని గంటల్లోనే బ్లాక్ చేయగలిగారు. మూడో రోజునే నిందితుడిని అరెస్ట్ చేయగలిగారు. ఫిర్యాదు అందగానే పోలీసులు చర్య తీసుకుని ఉంటే మరోసారి అశ్లీల ఫొటోలు ప్రచారమయ్యేవి కావు, వినుప్రియ ప్రాణాలు పోయేవికావు. ప్రేమించలేదని.. ప్రేమోన్మాదాన్ని తలకెక్కించుకున్న సురేష్ అనే యువకుడే వినుప్రియ ప్రాణాలను హరించి వేసినట్లు తెలుస్తోంది. సేలం జిల్లా కల్‌పారాపట్టికి చెందిన సురేష్ తనను ప్రేమించమంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో వినుప్రియ వెంట పడేవాడు. ఆమె అనేక సార్లు వారించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మరోసారి హెచ్చరించింది. దీంతో ఏకంగా ఆమె ఇంటికే వచ్చి పెద్దలను సంప్రదించాడు. వినుప్రియ తల్లిదండ్రులు సురేష్‌ను వారించి పంపివేశారు. తన ప్రేమను నిరాకరిస్తావా అంటూ ఆమెను బెదిరించాడు. సమాజంలో ఆమె పరువు పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. వినుప్రియ ఫొటోను ఎలాగో సంపాదించి మరో అశ్లీల ఫొటోకు జోడించాడు. బుధవారం అరెస్టయిన సురేష్ పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించాడు. ఆత్మహత్యకు కారకుడైన సురేష్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఆరు కేసులు పెట్టారు. సెల్‌ఫోన్ లంచంగా తీసుకున్న హెడ్‌కానిస్టేబుల్ సురేష్‌ను సస్పెండ్ చేశారు. ఇంత చేసిన పోలీసులు ఆమె ప్రాణాలను తెచ్చివ్వగలరా? వినుప్రియ ఫొటోలను మార్ఫింగ్ చేసిన నిందితునిపై పోలీసులు కేసు పెట్టారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించక నిర్లక్ష్యం వహించి వినుప్రియ ఆత్మహత్యకు మరో కోణంలో కారకులైన పోలీసులపై కేసులు పెట్టేవారు ఎవరు? పోలీసుల ముసుగులో ఉన్న నిందితులను శిక్షించేవారెవరు?