పోలీస్స్టేషన్లు అప్‌గ్రేడ్
నగర కమిషనరేట్ పరిధిలో అన్నీ సీ-గ్రేడ్ స్టేషన్లే
రాజధాని నేపథ్యంలో గ్రేడ్ పెంపునకు కసరత్తు
నాలుగు స్టేషన్లను ఏ-గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు
ఒక్కో స్టేషన్లో 100 మంది సిబ్బంది
విజయవాడ : విజయవాడ రాజధాని నగరం కావటంతో కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. తొలి విడతలో నాలుగు స్టేషన్లను ఏ-గ్రేడ్ చేయాలని నిర్ణయించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న నగర కమిషనరేట్‌లో ఇప్పటికీ అన్నీ సీ-గ్రేడ్ స్టేషన్లే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పాలన చేస్తుండటం, వీవీఐపీల తాకిడి పెరగటం, రాజధాని అవసరాల నేపథ్యంలో పోలీస్స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌కు నిర్ణయం తీసుకున్నారు.
పెరగనున్న సిబ్బంది సంఖ్య, వసతులు..
విజయవాడ నగరంలో 12 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కమిషనరేట్ ఆవిర్భావం తర్వాత వీటికి పోలీసుల సంఖ్య పెరిగిన దాఖలాలు లేవు. నగరంలో ఉన్న ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రోజుకు సగటున మూడు నుంచి ఐదు వరకు కేసులు నమోదవుతున్నాయి. ఐదు వరకు వివిధ రకాల ఫిర్యాదు అందుతున్నాయి. ప్రస్తుతం గవర్నర్ పేట, వన్‌టౌన్, సూర్యాపేట పోలీస్ స్టేషన్లలో సగటున 40 మంది వరకు సిబ్బంది ఉన్నారు. మిగిలిన స్టేషన్లలో 60 మంది వరకు ఉన్నారు. సీఎంతో అన్ని బందోబస్తు కార్యక్రమాలు, మిగిలిన లా అండ్ ఆర్డర్ డ్యూటీలు ఈ సిబ్బందే నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో గత ఏడాది నుంచి సిబ్బంది సంఖ్య భారీగా పెంచాలనే వాదన అటు పోలీసు సంఘాల్లో, ఇటు అధికారుల్లో ఉన్నా కార్యరూపం దాల్చటం లేదు. తాజాగా నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.
కమిషనరేట్‌లో అందులోనూ రాజధాని నగరంలో అన్నీ సీ-గ్రేడ్ స్టేషన్లే ఉండటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తొలి విడతలో కృష్ణలంక, పటమట, మాచవరం, ఆటోనగర్ తదితర పోలీస్ స్టేషన్లను నేరుగా ఏ-గ్రేడ్ చేసి స్టేషన్‌కు సగటున 100 మంది వరకు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి రెండు పోలీస్ స్టేషన్లను ఒక ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తే మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందే అవకాశం ఉందని భావించారు. దీనిలో భాగంగా కొత్తగా కమిషనరేట్‌కు వచ్చే పోలీసులతో ఏ-గ్రేడ్ చేసి దానికి అనుగుణంగా స్టేషన్లలో వసతులపై దృష్టి సారించనున్నారు.