breaking news
vidavalur
-
జోన్.. జోష్
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రణాళిక రూపొందించింది. ఆక్వా జోనేషన్ విధానంతో సాగు చేసే విస్తీర్ణం, రైతుల వివరాలతో లెక్కలు తేల్చి అన్ని విధాలా ఆదుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ–ఫిష్ యాప్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఎంత విద్యుత్ అవసరమో గుర్తించి రైతులకు విద్యుత్ చార్జీల భారం నుంచి భారీ విముక్తిని కల్పించనుంది. విడవలూరు: ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆక్వా జోనేషన్ విధానం వరంగా మారనుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో రొయ్యల ధరల ఒడిదుడుకుల కారణంగా జిల్లాలోని ఆక్వా రైతులు అతలాకుతలమవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ క్షేతస్థాయిలో దళారులు మొండి చేయి చూపుతున్నారు. ఆక్వా రైతులకు అండగా ఉండేందుకు ఇప్పటికే ఆక్వా జోనేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. మత్స్యశాఖ, విద్యుత్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్న అధికారులు ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలు, విద్యుత్ వినియోగం వివరాలను ఈ–ఫిష్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. తాజాగా మరోసారి సర్వే ప్రారంభించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఆక్వా రైతులకు ఊరట ప్రతి ఆక్వా రైతు ఈ–ఫిష్‌లో నమోదు చేసుకోవడం వల్ల వారికి కరెంట్ చార్జీలు భారీగా తగ్గుముఖం పడుతాయి. జిల్లాలోని తీర ప్రాంతాలైన ఉలవపాడు, గుడ్లూరు, కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాల్లో ఆక్వా సాగు కింద రొయ్యలు, చేపలను సాగు చేస్తున్నారు. ఈ 9 మండలాల్లో సుమారు 8,500 మంది రైతులు సుమారు 40 వేల ఎకరాల ఆక్వా సాగు చేస్తున్నారు. ఏటా రెండు దఫాలుగా సాగు జరుగుతోంది. ఈ సాగులో మొదటి నెలలో ఎకరా గుంతకు రెండు ఏయిరేటర్లు, రెండు మోటార్లు నిత్యం నియోగించాలి. రెండో నెలలో నాలుగు ఏయిరేటర్లు, రెండు మోటార్లు, మూడో నెలలో ఆరు ఏయిరేటర్లు, రెండు మోటార్లను రైతులు వినియోగిస్తుంటారు. ఏడాదికి రూ. 480 కోట్ల మేర భారం ప్రస్తుతం ఆక్వా సాగు కింద విద్యుత్ యూనిట్‌ను రూ.3.85 చొప్పున వసూలు చేస్తున్నారు. నెలకు ఒక ఎకరాకు రూ.30 వేల విద్యుత్ బిల్లు వస్తుంది. అయితే ఈ–ఫిష్ రీ సర్వే పూర్తయ్యాక యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందిస్తారు. దీంతో నెలకు ఎకరాకు సుమారు రూ.10 వేల లోపు మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుంది. ఈ లెక్కన నెలకు ప్రభుత్వంపై దాదాపు రూ.80 కోట్లు భారం పడనుంది. ఏడాదిలో ఆక్వా సాగు జరిగే ఆరు నెలలకు నెలకు రూ. 80 కోట్లు చొప్పున రూ.480 కోట్ల మేర భారం పడనుంది. ఈ– ఫిష్ నమోదు ప్రక్రియ ఇలా.. ►కేవలం 10 ఎకరాల్లోపు విస్తీర్ణం కలిగిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ►ఆక్వా సాగు చేసే పరిధిలోని సచివాలయంలో మత్స్యశాఖ ఉద్యోగి ద్వారా నమోదు ప్రక్రియ చేసుకోవాలి. ►రైతుకు సంబంధించిన ఆక్వా సాగు విస్తీర్ణ ధ్రువీకరణ పత్రాలు, సర్వే నంబర్ పత్రాలు, విద్యుత్ సర్వీస్ నంబర్ పత్రాలు, ఆధార్‌కార్డు, మత్స్యశాఖ వారు జారీ చేసిన లైసెన్సు లేదా, కార్డును ఉద్యోగులకు అందజేయాలి. ►అనంతరం వాటిని జిల్లా మత్స్యశాఖ జేడీ కార్యాలయానికి పంపి అక్కడ నుంచి విద్యుత్ జిల్లా అధికారులకు నివేదికను అందజేస్తారు. రైతులకు భారీ ఊరట ఆక్వా జోనేషన్ నిజంగా ఆక్వా రైతుల పాలిట వరం. ప్రస్తుతం ఆక్వా సాగు ఒడిదుడుకుల మధ్య సాగడంతో నష్టాలను చవి చూస్తున్నాం. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నాం. ఈ విధానంతో యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50లకే మాత్రమే పడడంతో చాలా వరకు కష్టాలు తీరనున్నాయి. – వెంకటేశ్వర్లు, రామచంద్రాపురం, విడవలూరు మండలం చిన్న రైతులకు మేలు ఈ ఆక్వా జోనేషన్ చిన్న, సన్న కారు ఆక్వా రైతులు చాల మేలు కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా కేవలం 10 ఎకరాల లోపు వారు మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంది. చిన్న రైతులకు విద్యుత్ భారం తగ్గనుంది. చిన్న రైతులు కూడా సాగు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. – సంతోష్, ఆక్వా రైతు, గంగపట్నం, ఇందుకూరుపేట మండలం ఆక్వా జోనేషన్ వరం ఈ ఆక్వా జోనేషన్ పథకం ద్వారా విద్యుత్ చార్జీలు భారీగా తగ్గుతాయి. ఇప్పటికే మా సిబ్బంది రీ సర్వే చేసి గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సాగును నమోదు చేస్తున్నాం. ఇంకా నమోదు చేసుకోని రైతులు సచివాలయాలను సంప్రదించి నమోదు చేసుకోవాలి. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
విడవలూరు: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కోవూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ బాలకష్ణయ్య అన్నారు. విడవలూరుకు చెందిన వేదా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న ప్రతికూల పరిస్థితులకు పర్యావరణం దెబ్బతినడమే కారణమన్నారు. చెట్లను విపరీతంగా నరకడంతో పాటు వాటి స్థానంలో మళ్లి మొక్కలు నాటకపోవడంతో వర్షపాతం గణనీయంగా తగ్గిపోతోందన్నారు. చెట్లు తగ్గిపోతుండటంతో వాతావరణంలో కాలుష్య శాతం అధికంగా పెరిగి మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రతిఇంటిలో ఒక మొక్కను నాటేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. అనంతరం ఆయుష్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ కష్ణయ్య, ఎంపీపీ అలివేలమ్మ, తహసీల్దార్ బషీర్, కోవూరు మార్కెటింగ్ చైర్మన్ రామిరెడ్డి విజయభానురెడ్డి, ఈస్ట్రన్ ఛానల్–2 చైర్మన్ పాశం శ్రీహరిరెడ్డి, యశోద, ప్రభాకర్, విజయ్‌కుమార్, శ్రీనివాసులు, మల్లికార్జున్, సుధాకర్, కిరణ్‌కుమార్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు మహిళ దుర్మరణం
విడవలూరు : పిడుగుపాటుతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రం శివారులో ఈ ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిడుగు పడడంతో సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న సుబ్బమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందింది. -
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ: ఇద్దరికి గాయాలు
విడవలూరు: ఎదరురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామ శివారులో శనివారం జరిగింది. నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రామతీర్థం వెళ్తుండగా.. గ్రామం నుంచి ప్యాసింజర్ ఆటో నెల్లూరు వెళ్తోంది.. గ్రామ శివారుకి రాగానే ఆటో ఒక్కసారిగా బస్సును ఢీకొనడంతో.. ఆటో నుజునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. కాగా.. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.