breaking news
Veerudokkade
-
సినిమా రివ్యూ: వీరుడొక్కడే
తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరం' చిత్రం 'వీరుడొక్కడే'గా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అన్యాయం, చెడు, ఫ్యాక్షన్‌ను ఎదిరించి...మంచి కోసం ఎంతవరకైనా తెగించే మనస్తత్వం కల వ్యక్తి వీరేంద్ర(అజిత్). తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నలుగురు సోదరుల కోసం వీరేంద్ర పెళ్లికి దూరంగా ఉంటాడు. అన్యాయం, అక్రమాలను పాల్పడే వీరభద్రం (ప్రదీప్ రావత్) దుశ్చర్యల నుంచి ప్రజల్ని కాపాడుతుంటాడు. ఈ క్రమంలో తన సహచరులతో ఆ గ్రామంలోకి ప్రవేశించిన గోమతి దేవి (తమన్నా) అనే అర్కిటెక్ట్.. వీరేంద్ర ప్రేమలో పడేలా నలుగురు సోదరులు ప్లాన్ చేస్తారు. వీరేంద్ర మంచితనాన్ని చూసి గోమతి ప్రేమలో పడుతుంది. గోమతి ప్రేమ కోసం ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని వీరేంద్ర నిర్ణయం తీసుకుంటాడు. తమ గ్రామంలో నాగరాజు (అతుల్ కులకర్ణి) గ్రూప్‌తో జరిగిన సంఘటన ప్రభావంతో హింస, గొడవలు, కొట్లాట, ఫ్యాక్షన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని గోమతి కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది. వీరేంద్రను పెళ్లి చేసుకుందామనుకునుకున్న తరుణంలో గోమతిపై నాగరాజు గ్రూప్ ఎటాక్ చేస్తుంది. నాగరాజు గ్రూపును వీరేంద్ర ఎదుర్కొని.. గోమతిని ఆ దాడి నుంచి రక్షిస్తాడు.. అయితే ఆ సంఘటనలో వీరేంద్ర అసలు రూపాన్ని గోమతి చూస్తుంది. తనకు ఇష్టం లేని వ్యవహారాలే వీరేంద్ర జీవితంలో ప్రధానమైనవని తెలుసుకున్న గోమతి షాక్ అవుతుంది. వీరేంద్ర అసలు జీవితం తెలుసుకున్న తర్వాత గోమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గోమతిపై ఎటాక్ ఎందుకు జరిగింది. నాగరాజు అసలు గోమతి కుటుంబంపై ఎందుకు పగ పెంచుకుంటాడు? నాగరాజు, వీరభద్రం గ్రూప్‌ల ఆటకట్టించి.. గోమతిని, తన కుటుంబాన్ని వీరేంద్ర ఎలా రక్షించుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ’వీరుడొక్కడు’. మాస్, యాక్షన్ ఎలిమెంట్ పుష్కలంగా ఉన్న వీరేంద్ర పాత్రలో అజిత్ కనిపించారు. ప్రేమ కోసం హింస, ఫ్యాక్షన్ కు స్వస్తి చెప్పిన వ్యక్తిగా, ప్రేయసి కోసం, ప్రేమను పంచిన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్లే మరో షేడ్ ఉన్న క్యారెక్టర్‌ను అజిత్ అవలీలగా పోషించాడు. అయితే గతంలో చాలా చిత్రాల్లోఇలాంటి పాత్రల్లో కనిపించిన అజిత్.. మరోసారి రొటీన్‌గానే అనిపించాడు. అర్కిటెక్ట్‌గా గోమతి పాత్రలో ఓ సంప్రదాయ యువతిగా తమన్నా కనిపించింది. ఈ చిత్రంలో గోమతి పాత్ర ప్రధానమైనప్పటికి... సహజంగా ప్రేక్షకులు ఆశించే గ్లామర్ మిస్ కావడం నిరాశ కలిగించే అంశం. గోమతి పాత్ర కారెక్టరైజేషన్ పర్ ఫెక్ట్‌గా లేకపోవడం కొంత మైనస్. అంతేకాకుండా గోమతి పాత్ర కృత్రిమంగా కనిపిస్తుంది. విలన్లు ప్రదీప్ రావత్, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినా.. చిత్రంలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపేలా విలనిజం లేకపోవడం ప్రధాన లోపమని చెప్పవచ్చు. తమన్నా తండ్రిగా నాజర్ పర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో బాగా నచ్చే అంశం లాయర్ పాత్రలో సంతానం పండించిన కామెడీ. సంతానం కామెడి ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గొప్పగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వెట్రీ ఫోటోగ్రఫి చిత్రానికి అదనపు ఆకర్షణ. యాక్షన్ సీన్ల చిత్రీకరణ రిచ్‌గా ఉంది. భూపతి రాజా, శివ అందించిన కథలో కొత్తదనం లేకపోయింది. సంతానంపై చిత్రీకరించిన కామెడీ సీన్లలో డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తమిళంలో ‘వీరం’ పేరుతో విడుదలై.. ఘన విజయాన్ని సాధించిన వీరుడొక్కడే చిత్రం తెలుగు ప్రేక్షకులకు రొటీన్ చిత్రమనే చెప్పవచ్చు. పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. -
సూపర్ జోడీ...
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన తమిళ చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ‘వీరమ్’. అజిత్, తమన్నా జంటగా శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో విడుదల కానుంది. భీమవరం టాకీస్‌పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని అనువదించారు. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రచార చిత్రాలను బి. గోపాల్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో కేవీవీ సత్యనారాయణ, టి.ప్రసన్నకుమార్, వీరశంకర్, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ -‘‘అనువాద హక్కులు నాకు దక్కడానికి ప్రధానం కారణం కేవీవీ సత్యనారాయణ. అజిత్, తమన్నాలది సూపర్ జోడీ అనిపిస్తుంది. మంచి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా తమిళ వెర్షన్ తరహాలో తెలుగులోనూ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
వీరుడొక్కడే మూవీ స్టిల్స్
-
పక్కా కమర్షియల్ వీరుడు
‘‘తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే పక్కా కమర్షియల్ చిత్రమిది. అజిత్‌కి ఈ సినిమా తెలుగునాట మంచి పేరు తెస్తుంది’’ అని దర్శకురాలు బి.జయ చెప్పారు. అజిత్, తమన్నా జంటగా ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘వీరం’ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డా.శ్రీనుబాబు అనువదిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో బి.జయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా.శ్రీనుబాబు మాట్లాడుతూ -‘‘అజిత్, తమన్నా నటనతో పాటు దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. ఈ నెల 18న పాటలను, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. క్లాస్‌కీ మాస్కీ నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయని బి.ఎ.రాజు చెప్పారు. -
వీరుడొక్కడే...
అజిత్, తమన్నా కాంబినేషన్లో తమిళంలో ‘వీరం’ చిత్రం రూపొందుతోంది. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల్ని ఓమిక్స్ క్రియేషన్స్ సంస్థ చేజిక్కించుకుంది. ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. నిర్మాత డా.శ్రీనుబాబు .జి మాట్లాడుతూ -‘‘చాలా గట్టి పోటీలో ఈ హక్కుల్ని మేం సొంతం చేసుకున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అజిత్, తమన్నాపై స్విట్జర్లాండ్‌లో తీసిన పాటలు లవ్లీగా వచ్చాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రాజమండ్రి, అరకులోయ, ఆర్ఎఫ్సీల్లో కూడా చిత్రీకరణ చేశారు. ముఖ్యంగా అరకులో 15 రోజులు తీసిన ట్రెయిన్ ఫైట్ ఈ చిత్రానికి హైలైట్. జనవరి మొదటి వారంలో పాటలు, చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.