breaking news
Vande Mataram Foundation
-
అక్షర యజ్ఞం
పేదబిడ్డల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని.. వారికి నాణ్యమైన విద్య అందాలని దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ సంస్థ అక్షర యజ్ఞం చేస్తోంది. అభాగ్యులకు అక్షరాలు నేర్పించి సమాజంలో నిలబెట్టాలని సంకల్పించింది. బడిఈడు పిల్లలకు సంస్కారవంతమైన చదువునిచ్చి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తోంది ‘వందేమాతరం ఫౌండేషన్’. – తొర్రూరుతొర్రూరు కేంద్రంగా..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంగా కొనసాగుతున్న వందేమాతరం ఫౌండేషన్ ఎందరో సామాన్య పేదబిడ్డలను అసామాన్యులుగా తీర్చిదిద్దింది. అక్షరాస్యత పెరుగుతోంది..అరాచకాలు తగ్గలేదు. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.. నిర్భాగ్యులు ఉంటూనే ఉన్నారు. ఈ విషయాలే తొర్రూరు నివాసి తక్కెళ్లపల్లి రవీంద్రను ఆలోచనలో పడేశాయి. దీనికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2005లో వందేమాతరం ఉద్యమానికి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈమేరకు తన విద్యా ఉద్యమానికి ‘వందేమాతరం’ అని పేరుపెట్టారు. దీనిలో భాగంగా ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తుల్ని భాగం చేశారు. ‘వందేమాతరం ఫౌండేషన్’ కార్యక్రమాలు నచ్చి తొర్రూరులో ఎన్నారై డాక్టర్ అశోక్‌రెడ్డి తన కుమారుడు నితిన్ జ్ఞాపకార్థం కట్టించిన సామాజిక భవనాన్ని ఫౌండేషన్ కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి ఇచ్చారు. ఏటా ‘పది’విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరంఅనేకానేక కారణాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మార్కుల్లో కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. ఆ పరిమితులను అధిగమించడానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోతరగతి పిల్లలకు వార్షిక పరీక్షల ముందు 45 రోజులపాటు విద్యా శిబిరాలు ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, జీవన నైపుణ్య శిక్షకుల చేత మెళకువలు నేర్పిస్తున్నారు. తొమిదేళ్లుగా చేపడుతున్న ఈ శిబిరంలో ఏటా 500 మంది విద్యార్థులకు భోజన, వసతి కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. ఎంతోమంది విద్యార్థులు పదికి పది గ్రేడ్ తెచ్చుకొని ట్రిపుల్ ఐటీల్లో చేరుతున్నారు. ఈ శిక్షణకు హాజరైన రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన పుల్లూరు శరత్ ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. ఈ విధానం మెచ్చి పలు జిల్లాల కలెక్టర్లు ఇలాంటి శిబిరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. » ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఫౌండేషన్ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభా పురస్కారాలు అందిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. రవీంద్ర కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం పురస్కారాలు అందిస్తుందని సీఎం ప్రకటించారు. » వీఎంఎఫ్ సంస్థ నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందిన వారిలో దాదాపు 680 మంది ఐఐటీలకు, 1,500 మంది పేరుమోసిన కళాశాలల్లో ఫ్రీ సీట్లకు అర్హత పొందారు. » అక్షరాభ్యాసం కార్యక్రమం ద్వారా పదేళ్లలో పలు జిల్లాలకు చెందిన 1,93,500 మందికి పైగా విద్యార్థులను పాఠశాలకు దూరం కాకుండా ఉండేందుకు తోడ్పడింది. » రాష్ట్రంలో చదువుపై అమితాసక్తి, చాలా ఉత్సాహవంతులైన ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను ‘కలాం–100’అనే కార్యక్రమం ద్వారా ఎంపిక చేసి వారికి మెడిసిన్, ఐఐటీ, ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన ఉచిత శిక్షణను ఫౌండేషన్ అందిస్తోంది. ఆరో తరగతిలో ఉన్నప్పుడే ఎంపిక చేసిన పిల్లలకు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘకాలం పాటు శిక్షణ అందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతోంది. » సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 70 గ్రామాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి పేద బిడ్డలకు విద్యనందిస్తున్నారు. » ఎస్సీఆర్టీతో కలిసి విద్యా ముసాయిదాను తయారు చేశారు. » అక్షరాభ్యాసం మొదలు తల్లిదండ్రులకు వందనం వంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిగా నిలిచింది. » బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమ ముసాయి దాకు ఫౌండేషన్ రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.7,200 కోట్లు కేటాయించేందుకు మూలమైంది. » ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన 680 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. రూ.2.80 కోట్ల ఉపకార వేతనాలు అందుకున్నారు. » గత కొన్నేళ్లలో 903 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు, 47 మంది ఐఐటీలకు ఎంపికయ్యారు. వివిధ ఎన్ఐటీల్లో 105 మంది, 2,400 మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌కు, 4వేల మంది ఇంటర్ ఉచిత విద్య అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 280 మంది ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. » సంస్థ కార్యక్రమాలు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ కొనసాగుతున్నాయి. » వందేమాతరం ఫౌండేషన్‌కు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు రావాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభలో ఎవరికీ తీసిపోరు. వారికి తగిన తోడ్పాటు అందించకపోవడమే వారి ప్రతిభకు ప్రతిబంధకంగా మారుతోంది. వారిలోని నైపుణ్యాలను వెలికితీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకే ఏటా ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. దాతల సహాయంతో శిబిరం విజయవంతంగా నడుపుతున్నాం. విద్యతోపాటు జీవితంపై పలురకాల నైపుణ్య అంశాలపై విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. ప్రభుత్వం సైతం ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. – తక్కెళ్లపల్లి రవీంద్ర, వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ ఫౌండేషన్ కృషితో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులుపేద బిడ్డల అభ్యున్నతికి వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న కృషి వెలకట్టలేనిది. అక్షరాలు అందిస్తే పేద బిడ్డలు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని రవీంద్ర అభిలాష. ఆయన సంకల్పానికి 2009 నుంచి తోడుగా ఉన్నాను. నా శేష జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే సేవ ఇదే. విద్యార్థులు చదువుతో సంస్కారం, క్రమశిక్షణ నేర్చుకోవడం మంచి పరిణామం. – చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త -
ఆకాశం అంచులు తాకాం..
* ప్రభుత్వ పాఠశాల టెన్త్ టాపర్స్‌కు అరుదైన అవకాశం * వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విమానంలో విహారం ఎల్బీనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి టాపర్స్‌గా నిలచిన విద్యార్థులకు వందేమాతరం పౌండేషన్ నిర్వాహకులు అరుదైన అవకాశం కల్పించారు. వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి సహకారంతో సోమవారం విద్యార్థులకు ఉచితంగా బుల్లి విమానాలలో గగనంలో విహరించే అవకాశం కల్పించారు. దీంతో విద్యార్థులు గాల్లో చక్కర్లు కొట్టి సందడి చేశారు. తెలంగాణ జిల్లాల్లో టాపర్స్‌గా నిలచిన విద్యార్థుల్లో 111 మందికి ఈ అవకాశం దక్కింది. ముఖ్యఅతిథిగా హైదరాబాద్ ఐజీ అకున్ సబర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, ప్రభుత్వ పాఠశాలల్లోచదివే విద్యార్థులంటే చిన్నచూపు తగదని పేర్కొన్నారు. ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి డెరైక్టర్, కెప్టెన్ మమత, ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్, మర్రి రవీందర్‌రెడ్డి, వసంత్ వోరా, బాల్‌రాజ్‌గౌడ్, ప్రోగ్రాం ఇన్చార్జి జగన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పలేని ఆనందం కలిగింది విమాన విహారం ఎంతో ఉల్లాసంగా ఉంది. ఆకాశంలో చక్కర్లు కొడుతుం టే చెప్పలేని ఆనందం కలిగింది. బాగా చదువుకుని ఐఏఎస్ అవుతా. - శివాని, జెడ్పీహెచ్ఎస్ ఆలేరు, నల్లగొండ జిల్లా ఊహించలేని ఉత్కంఠ బుల్లి విమానంలో ఆకాశంలో తిరుగుతుంటే చేస్తుంటే ఊహించలేనంత ఉత్కంఠ, ఉల్లాసం నెలకొంది. ఇటువంటి అవకాశం వస్తుందని ఎపుడు ఊహించలేదు. - మౌనిక, జెడ్పీహెచ్ఎస్ శేరిగూడ, రంగారెడ్డి జిల్లా అరుదైన అవకాశం పేద కుటుంబానికి చెందిన నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదు. విమానంలో విహరిస్తుం టే చెప్పలేనంత ఆనందం కలిగింది. బాగా చదువుకుని ఇంజనీరును అవుతాను. - రేవతి, జెడ్పీహెచ్ఎస్ నాగ్పల్లి, ఖమ్మం జిల్లా ఇది మా అదృష్టం మాలాంటి పేద విద్యార్థులు విమానంలో తిరగడమంటే అది అదృష్టమే.. దీనిని స్ఫూర్తిగా తీసుకొని బాగా చదివి ఏరొనాటికల్ ఇంజనీర్ అవుతా. - ప్రవీణ్‌రాజ్, జెడ్పీహెచ్ఎస్ పస్రా,వరంగల్ జిల్లా ఎంతో సంతోషంగా ఉంది పదవ తరగతి పరీక్షలో మాకు ఎక్కువ మార్కులు రావడమే గొప్ప అనుకుంటే ఈ విమానయానం అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఐఏఎస్ లేదా పైలట్ కావాలని అనుకుంటున్నాను.. - జి.సురక్షారెడ్డి, జెడ్పీహెచ్ఎస్ లక్షర్బజారు, హన్మకొండ -
సర్కారుబడిపై చిన్ననచూపు వద్దు!
బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి కల్వకుర్తి : సర్కారుబడి పేదలకు దేవాలయం లాంటిదని, అలాంటి ఆలయంపై చిన్నచూపు తగదని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ సమీపంలోని వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షర వనం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు చిన్నవని, ప్రైవేట్ పాఠశాలలు గొప్పవని కొందరు ప్రచారం చేసుకోవడం మానుకోవాలని సూచిం చారు. దేశనాయకులు, శాస్త్రవేత్తలు, ప్రముఖులందరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారేనన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, నేటి ప్రధాని మోదీలాంటి వారందరూ ఆ బడులనుంచి వచ్చిన వారేనన్నారు. వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని, ప్రభుత్వం చేయలేని శిక్షణలు అక్షరవనంలో చేయడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అనంతరం విద్యార్థుల ఆటలు, పాటలు, కళలు, ఇతర శిక్షణను తిలకించారు. ఆయన వెంట వందేమాతరం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎడ్మ మాధవరెడ్డి, బీజేపీ నాయకులు దుర్గప్రసాద్, రాఘవేందర్‌గౌడ్, కృష్ణగౌడ్, రాంరెడ్డి, నర్సింహ, అజాద్ యువజన సంఘం అధ్యక్షుడు కుడుముల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదు
డీఐజీ అకున్ సబర్వాల్ ♦ ప్రభుత్వ పాఠశాలల టెన్త్ టాపర్స్ గగన విహారం ♦ వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల అంటే తక్కువేమీ కాదని, తాను కూడా పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. హైదరాబాద్ బీఎన్‌రెడ్డినగర్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి విద్యార్థుల విమాన విహారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి టాపర్స్‌గా నిలచిన విద్యార్థులకు ఈ అరుదైన అవకాశం కల్పించారు. విద్యార్థులు బుల్లి విమానాల్లో చక్కర్లు కొట్టి ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఆరుగురు చొప్పున 60 మంది ‘టాపర్స్’ను ఎంపిక చేశారు. అలాగే క్రీడలు, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలలో ప్రతిభ చూపిన మరో 50 మంది విద్యార్థులను ఎంపికచేసి గగన విహారం అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి నిర్వాహకురాలు కెప్టెన్ మమత, వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేందర్, వందేమాతరం ఫౌండేషన్ కార్యదర్శి మాధవరెడ్డి, కో-ఆర్డినేటర్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విద్యార్థులు మాట్లాడుతూ.. వందేమాతరం ఫౌండేషన్ క్యాంపుల వల్ల తమకు ఇలాంటి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు రావడం గొప్ప విషయమని విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు.