తనువు చాలించారు
పిల్లలు పుట్టలేదని దంపతుల ఆత్మహత్య
మదనపల్లె క్రైం: అమ్మా.. నాన్నా.. అని పిలిచే పిల్లలు లేరు.. పుట్టిన ఒకే ఒక ఆడబిడ్డ మరుసటి రోజే ఈ లోకం వీడింది. 20 ఏళ్లుగా ఎదురు చూసినా వారికి పిల్లలు కలగలేదు. దీంతో ఈ బతుకెందుకు అని తలచిన ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం మదనపల్లెలో చోటుచేసుకుంది.
మచిలీపట్నానికి చెందిన వల్లభేశ్వర్రావు 50ఏళ్ల క్రితం పొట్టచేత పట్టుకుని కుటుంబంతో సహా మదనపల్లెకు చేరుకున్నాడు. స్థానిక కురవంకలో నివాసముంటూ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతని కుమారుడు ఎంఎస్వీ.లక్ష్మణరావు(49) సివిల్ ఇంజినీరింగ్ చేశాడు. 20ఏళ్ల క్రితం కోవెలకుంట్లకు చెందిన గాయత్రిని వివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం వీరికి ఓ బిడ్డ పుట్టి, మరుసటి రోజే మృతి చెందింది. అప్పటి నుంచి వీరికి పిల్లలు పుట్టలేదు. లక్ష్మణరావు ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ వద్ద ఇంజనీర్‌గా పనిచేస్తూ కృష్ణానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
పిల్లలు లేని లోటు వారిని నిరుత్సాహానికి గురిచేసింది. మానసికంగా కుంగిపోయారు. ఆరు నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా లక్ష్మణరావు ఇంటిపట్టునే ఉండిపోయాడు. దీనికితోడు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. జీవితంపై విరక్తి చెంది లక్ష్మణరావు, గాయత్రి ఆదివారం రాత్రి ఇంటిలోనే కొక్కీలకు చీరలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం వీరు ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో స్థానికులు గుడికి వెళ్లారేమోనని భావించారు. సాయంత్రం అయినా జాడ లేకపోవడంతో పట్టణంలోని రెడ్డీస్కాలనీలో ఉన్న లక్ష్మణరావు చెల్లెలు లీలారత్నకుమారికి ఇంటి యజమాని ఫోన్ చేశాడు.
ఆమె కూడా తనకు తెలియదని చెప్పడంతో రాత్రి వరకు వేచి ఉన్నారు. లక్ష్మణరావు సెల్ కూడా మూగపోవడంతో అనుమానం వచ్చి రాత్రి పొద్దుపోయాక ఇంటి కిటికీలోంచి స్థానికులు తొంగిచూశారు. దంపతులిద్దరూ ఉరికి వేలాడుతూ కనబడ్డారు. రెండో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. మంగళవారం ఉదయం ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి వీఆర్వో ప్రసాద్ సమక్షంలో దంపతులను ఉరి నుంచి కిందకు దింపి పంచనామా నిర్వహించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.