breaking news
vajrapu koturu
-
ప్రకృతి మాయ.. వందేళ్ల కిందట కొన్ని జ్ఞాపకాలను వదిలి వెళ్లింది!
వందేళ్ల కిందట ఓ మహోగ్ర ప్రవాహం తన రాకకు గుర్తుగా కొన్ని జ్ఞాపకాలను వదిలి వెళ్లింది. బాహుదా పేగు తెంచుకుని పుట్టి బంగాళాఖాతంతో జత కట్టే రాకాసి గెడ్డ అప్పటి తన వీర విహారానికి కొన్ని ఎర్రటి మట్టి దిబ్బలను సాక్షిగా నిలబెట్టింది. కాలం గడిచిపోయింది. ప్రవాహం నెమ్మదించింది. ప్రకృతి ఇష్టంగా చేసుకున్న ఈ అరుణ శిల్పాలు ఉద్దానం ఒడిలో ఎవరి కంటా పడకుండా రహస్యంగా ఉండిపోయాయి. ఒకనాటి మందస రాజులు వేటకు వెళ్తూ ఈ ప్రాంతాన్ని చూసి ముచ్చటపడిపోయారు. ఈ ఎర్ర మట్టితో కుండలు చేసిన కుమ్మర్లు ఆ ఊరే వదిలి వెళ్లిపోయారు. ఎలుగు బంట్లు, పునుగు పిల్లులు, తోడేళ్లు, నక్కలు, కొండ చిలువలకు ఇష్టమైన ప్రాంతమైన ఈ ఎర్ర మట్టి దిబ్బలు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. షార్ట్‌ఫిల్మ్‌ల పుణ్యమా అని ఈ అందాలు కెమెరా కంట పడుతున్నాయి. సాక్షి, శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలంలోని ఒంకులూరు–తోటూరు రాకాసి గెడ్డలోని ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. వీటి ఉనికి పదేళ్ల కిందటే బయటపడినా.. ఇప్పుడు మాత్రం ఈ అందాలు చూసేందుకు ఇంకా ఎక్కువ మంది ఇక్కడకు వస్తున్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బలు గునపాలు దింపినా దిగనంత గట్టిగా ఉంటాయి. వందేళ్ల కిందట రాకాసి గెడ్డలో ఏర్పడిన జల ప్రవాహానికి సహజసిద్ధంగా ఇవి ఏర్పడ్డాయి. ఎర్ర తివాచీ పరిచినట్లు ఉండే ఈ అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు ఈ మట్టితో కుమ్మర్లు కుండలు తయారు చేసి ఉద్దానం ప్రాంతంలో విక్రయించి ఉపాధి పొందేవారు. ఐతే ఆ కుండలు ఎప్పటికీ పగలకపోవడంతో మళ్లీ కుండలు కొనేవారు లేక వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతుంటారు. రాజుల కాలంలో.. 1947కు ముందు మందస సంస్థానం రాజులైన శ్రీనివాస రాజా మణిదేవ్, రాజా జగన్నాథ మణిదేవ్లు వేట కోసం ఇక్కడకు వచ్చి ఈ మట్టి దిబ్బల అందాలు తిలకించే వారని స్థానికంగా ఉండే వృద్ధులు చెబుతుంటారు. తోటూరు సముద్ర తీరం నుంచి పలాస మండలం నీలావతి వరకు దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు పొడవైన గెడ్డలో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉండగా.. తూర్పున తోటూరు వద్ద సాగర తీరం మరింత కనువిందు చేస్తుంటాయి. ప్రతి ఆదివారం వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. షూటింగ్‌లకు అనుకూలం ఈ ప్రాంతాన్ని ఇంకాస్త అభివృద్ధి చేస్తే భీమిలిలా మార్చవచ్చు. ఇక్కడ పది షార్ట్‌ఫిల్మ్‌ల వరకు తీశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ నుంచి 12 కిలోమీటర్లు దూరాన ఉండే తోటూరు సముద్ర తీరానికి చేరుకునే మార్గంలో ఈ మట్టి దిబ్బలు ఉంటాయి. సహజ సిద్ధమైన అందాలను కాపాడేందుకు అవకాశం లేకపోవడంతో ఇప్పటికే చాలా మేరకు దిబ్బలు కరిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే తీర ప్రాంత ముఖచిత్రం మారిపోతుంది. అభివృద్ధి చేయాలి ఒంకులూరు, తోటూరు ప్రాంతాలకు ప్రతి ఆదివారం 150 మందికి తగ్గకుండా పర్యాటకులు వస్తారు. ప్రభు త్వం దృష్టి సారిస్తే కచ్చితంగా ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు మరింత హాయినిస్తుంది. – గుంటు ధర్మారావు, స్థానికుడు, తోటూరు ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తాం భీమిలి తరహాలో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఉద్దానంలో ఉంటే కచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే. మేం ముందు వాటిని సందర్శిస్తాం. ఇప్పటికే సుదీర్ఘ తీరప్రాంతంలో కంబాలరాయుడుపేట బీచ్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రూ.2 కోట్లు, నెమలి కొండ పర్యాటక అభివృద్ధికి రూ. 14.5కోట్లు, అక్కుపల్లి శివసాగర్ బీచ్‌కు రూ.1.50 కోట్లు ప్రతిపాదనలు పంపించాం. – మదన్మోహన్, ఏఈఈ, ఏపీ టూరిజం -
వ్యక్తి అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన లండ కృష్ణ(40), మరో వ్యక్తి కలసి గురువారం రాత్రి మద్యం తాగారు. అనంతరం వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని స్తానికులు తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం గ్రామంలోని మురుగు కాల్వలో కృష్ణ మృతదేహమై కనిపించాడు. వ్యక్తిగత కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. (వజ్రపుకొత్తూరు)