breaking news
Vaddera fedaration
-
వడ్డెర సంక్షేమానికి కృషి
కడప రూరల్: ఈ ఏడాది వడ్డెర ఫెడరేషన్ ద్వారా ఏర్పాటైన సంఘాలకు రూ. 37 కోట్ల రుణాలు ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు ఆ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవళ్ల మురళి అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన జిల్లా వడ్డెర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డెర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాకు ఈ ఏడాది వడ్డెర ఫెడరేషన్‌కు మూడు యూనిట్లు మంజూరయ్యాయని, 50 యూనిట్ల మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. కొండ క్వారీల్లో యంత్రాలను వినియోగిస్తున్నారని, ఆ యంత్రాలను వడ్డెర్లకు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో వడ్డెర భవన్ ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని వెల్లడించారు. వడ్డెర్ల సమస్యలను పరిష్కరించాలి ఈ సందర్భంగా వడ్డెర నాయకులు బత్తుల జానకిరాం, గురుప్రసాద్, నంద్యాల సుబ్బరాయుడు, గంపా తిరుపతి మాట్లాడుతూ వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన వడ్డెర ఫెడరేషన్‌కు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. బత్తల లక్ష్మయ్య, రమణ, బెల్లంకొండ శ్రీనివాస్, శేఖర్, పెద్ద సంఖ్యలో వడ్డెర నాయకులు పాల్గొన్నారు. -
4న రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం
కొరిటెపాడు (గుంటూరు): రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం ఈ నెల 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందని వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు చెప్పారు. స్థానిక బ్రాడీపేటలోని ఓ హోటల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డెర ఫెడరేషన్ చైర్మన్‌గా అనంతపురం జిల్లాకు చెందిన దేవళ్ల మురళిని నియమించడం అభినందనీయమన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో 13 జిల్లాల నుంచి వడ్డెర సంఘీయులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హస్తకళలు, మైనింగ్ కార్పోరేషన్, భవన నిర్మాణ సంక్షేమం చైర్మన్ పదవులలో రెండు కోస్తా జిల్లాల వడ్డెరలకు కేటాయించాలని కోరారు. స్మార్ట్ పల్స్ సర్వే చేసే అధికారులకు బి.సి. జాబితాలను అందజేసి అవకతవకలు జరగకుండా చూడాలని సూచించారు. గుంటూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పదవిని టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రగిరి ఏడుకొండలుకు కేటాయించాలన్నారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేను కూడా కలసి విన్నవించడం జరిగిందని, ఎమ్మెల్యే కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. సమావేశంలో వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ఏడుకొండలు, గౌరవాధ్యక్షుడు వల్లెపు ముసలయ్య, కర్ణాటక రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వేముల ఆంజనేయులు, సంఘం నాయకులు బత్తుల కూర్మయ్య, వల్లెపు బాబు, బత్తుల సాంబశివరావు, ఓర్సు కొండలు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.