breaking news
unidentified flying objects
-
ఆకాశాన్ని ఖాళీ చేయిస్తున్న రష్యా.. విమానాలన్నీ వెనక్కి.. ఏం జరుగుతోంది?
మాస్కో: రష్యా ఆకాశమార్గాన్ని ఖాళీ చేయిస్తోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కోవో విమానాశ్రాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇక్కడకు చేరుకోవాల్సిన విమానాలన్నింటినీ తిరిగి వెనక్కి పంపింది. ఫ్లైట్ రాడార్ వెబ్సైట్ దీన్ని వెల్లడించింది. దీంతో రష్యా ఏం చేయబోతుందని సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే సెయింట్‌పీటర్స్‌బర్గ్ గగనతలంలో గుర్తు తెలియని వస్తువు (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్- UFO)ను గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం అప్రమత్తమై ఆకాశమార్గాన్ని ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విమానాశ్రాయానికి చేరుకోవాల్సిన విమానాలనకు వెనక్కి పంపించి.. యుద్ధ విమానాలకు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వస్తువు గురించి తెలుసుకునేందుకు రెండు యుద్ధ విమానాలను రష్యా గగనతలంలోకి పంపినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. ఆ వస్తువు ఏంటో కనిపెట్టేందుకు దాదాపు 100 యుద్ధవిమానాలను సెయింట్‌పీటర్స్‌బర్గ్ విమానాశ్రయంలో మోహరించినట్ల సమాచారం. అయితే ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వస్తువులు గగనతలంలో కన్పించడం కలకలం రేపడం తెలిసిందే. చైనాకు చెందిన భారీ బెలూన్లు అమెరికా ఆకాశంలో నిఘా వహించడం చర్చనీయాంశమైంది. వీటిని అగ్రరాజ్యం కూల్చివేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ఆకాశంలో ఇప్పుడు యూఎఫ్ఓ కన్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఏలియన్ల పనా? లేక ఇతర దేశాల పనా? అనే చర్చ కూడా మొదలైంది. పుతిన్ సొంత నగరం.. అయితే రష్యా గగనతలంలో కన్పించింది ఓ భారీ డ్రోన్ అని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది నాటో దేశాల పని అయ్యి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సొంతనగరం అయిన సెయింట్ పీటర్స్బర్గ్కు ఈ డ్రోన్ దగ్గరగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా యుద్ధ విమానాలను మోహరించారు. ఈ ఎయిర్‌పోర్టుకు 180 కిలోమీటర్ల దూరంలోనే భారీ డ్రోన్ కన్పించింది. చదవండి: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! -
ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనా?
వాషింగ్టన్: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (యూఎఫ్ఓ) నిజమేనా? ఇవి మనిషిని ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలు. మనకు సంబంధించినంత వరకూ యూఎఫ్ఓలు ఇప్పటిదాకా మిస్టరీగానే ఉంటూ వచ్చాయి. సాసర్ ఆకారంలో ఉండే ఇవి ఆకాశంలో దూసుకెళ్తుండగా చూశామని ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వచ్చారు. అంతకుమించి వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు ఏమీ తెలియదు. ఈ నేపథ్యంలో యూఎఫ్ఓల గుట్టేమిటో తేల్చేందుకు నాసా తాజాగా ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా పరిశోధన చేసేందుకు ఏకంగా 16 మందిని బృందంలో నియమించింది. అది సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. తొమ్మిది నెలలపాటు అన్నిరకాలుగా అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఈ మేరకు నాసా ట్వీట్ కూడా చేసింది. -
అగ్నిపర్వతంపై ఏలియన్లు
-
అగ్నిపర్వతంపై ఏలియన్లు
గ్రహాంతర వాసులు భూమ్మీద మనతో పాటు తిరుగుతున్నారా? మన చుట్టూనే ఉంటున్నారా? మనిషి అడుగు పెట్టేందుకు సైతం భయపడే ప్రాంతాల్లో సంచరిస్తున్నారా? బద్దలవుతున్న అగ్నిపర్వతం.. వేగంగా ప్రవహిస్తున్న లావా మధ్యలో ఏలియన్లు ఎలా తిరగగలుగుతున్నారు? సగటు వ్యక్తి నుంచి సైంటిస్టుల వరకూ భయపెట్టే ఈ ఘటన ఎక్కడ జరిగింది? వంటి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. వాషింగ్టన్ : అమెరికాలోని ఎల్లోస్టోన్ అగ్నిపర్వతం రెండునెలల కిందట బద్దలైంది. అప్పటినుంచి ఈ పర్వతం నిప్పురవ్వలను వెదజల్లుతూ.. లావా కిందకు ప్రవహిస్తోంది. అగ్నిపర్వతం వేడికి సమీప ప్రాంతాల్లోకి వెళ్లేందుకు జనాలు భయపడుతున్నారు. అకాశంలో కూడా 40 వేల అడుగుల ఎత్తులోనే ప్రయాణించడానికి సాధ్యమవుతోంది. ఈ అగ్ని పర్వతం బద్దలైన సమయంలో ఆ ప్రాంతంలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒక ఫ్లయింగ్ సాసర్.. అగ్నిపర్వతం, లావాకు దగ్గరగా తిరిగింది. అంతేకాక అగ్నిపర్వతం లోపలిదాకా వెళ్లడం, లావా మీద ఏవో ఆకారాలు నడుస్తున్నట్లు కనిపించింది. ఇది కచ్చితంగా మానవ జాతికి అత్యంత ప్రమాదకర సంకేతాలను పంపేదే అని సైంటిస్టులు అంటున్నారు. ఒక కాంతిపుంజం ఆకారంలోని ఆబ్జెక్ట్‌ను స్పష్టంగా వీడియోల్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో జూన్ 9న రికార్డయినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్‌ను అగ్నిపర్వతాన్ని పరిశీలిస్తున్న శాటిలైట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ - ఆగస్టు మధ్య కాలంలో పలు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్లను పలు శాటిలైట్లు గుర్తించాయి. ఇదిలా ఉండగా ఎల్లోస్టోన్ అగ్నిపర్వతం వయసును అంచనా వేయలేమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ అగ్నిపర్వతం ప్రతి 6 లక్షల సంవత్సరాలకోసారి బద్దలవుతుందని సైంటిస్టులు తెలిపారు. ఎల్లోస్టోన్ అగ్నిపర్వతానికి చాలా సార్లు గ్రహాంతరవాసులు టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని.. ప్రముఖ సైంటిస్ట్ స్కాట్ తెలిపారు. ఎల్లోస్టోన్కు గ్రహాంతరవాసులకు ఉన్న సంబంధంపై పరిశోధనలు చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. -
అపరిచితులు...
కవర్ స్టోరీ : జూలై 2 వరల్డ్ యూఎఫ్ఓ డే ఆకాశంలో ఏదో ఎగురుతూ కనిపిస్తుంది. విమానమా..? కాదు. హెలికాప్టరా..? అస్సలు కాదు. పోనీ రాకెట్టా..? ఉహు.. కానే కాదు. ఆకారం చూస్తే వాటిలా ఏమీ అనిపించదు. గుండ్రంగా పళ్లెంలా ఉంటాయి. వెలుగులు విరజిమ్ముతూ ఎగురుతూ ఉంటాయి. ఎక్కడివో, ఏమిటో గుర్తు తెలియని ఈ ఎగిరే పళ్లాలకు ఇంగ్లిషులో ‘అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్’గా పేరు పెట్టారు. వీటినే సంక్షిప్తంగా యూఎఫ్ఓలని అంటున్నారు. పళ్లాల్లా ఉంటాయి కాబట్టి వీటిని ‘ఫ్లయింగ్ సాసర్స్’ అని కూడా అంటారు. వీటి ఉనికి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. గ్రహాంతర వాసులు వీటిని నడుపుతున్నారనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై అగ్రరాజ్యాలు చాలాకాలంగా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాయి. గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అనేందుకు ఇంతవరకు తగిన ఆధారాల్లేవు. ఒకవేళ ఉంటే వాళ్లు మనకు మిత్రులా? శత్రువులా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఉన్నారో, లేరో తెలియని గ్రహాంతరవాసులు ఇప్పటికి మాత్రం మనకు అపరిచితులు. చాలా చరిత్రే ఉంది మన దేశంలో ఇలాంటి ఎగిరే పళ్లాలను (యూఎఫ్ఓలు) చూసిన వారు దాదాపు లేరు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇలాంటివి తమకు కనిపించాయని చెప్పిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పటికీ అక్కడక్కడా కొందరు ఆకాశంలో ఎగిరే పళ్లాలను చూసినట్లు చెబుతూనే ఉన్నారు. అలా చూశామని చెబుతున్న వారిలో కొందరు ఔత్సాహికులు ఫొటోలు, వీడియోలు తీసి మరీ ఇంటర్నెట్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. యూఎఫ్ఓల వెనుక చాలా చరిత్రే ఉంది. క్రీస్తుపూర్వం 214లో తొలిసారిగా వీటిని చూసినట్లుగా రోమన్ చరిత్రకారుడు టైటస్ లివియస్ తన రచనల ద్వారా వెల్లడించాడు. వీటిని ఆయన ఆకాశంలో ఎగిరే పడవలుగా అభివర్ణించాడు. యూఎఫ్ఓల గురించి చరిత్రలో నమోదైన తొలి ఉదంతం ఇదే. చరిత్ర పూర్వయుగంలోనే మనుషులు ఇలాంటి యూఎఫ్ఓలను చూసి ఉండవచ్చని ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా చరమా వద్ద బయటపడ్డ గుహాచిత్రాలను పరిశీలించిన నిపుణులు భావిస్తున్నారు. ఈ గుహా చిత్రాల్లో ఆధునిక స్పేస్‌సూట్స్ వంటి దుస్తులు ధరించిన వారి బొమ్మలతో పాటు ఫ్లయింగ్ సాసర్స్ వంటి వాటి బొమ్మలు ఉండటం విశేషం. యూఎఫ్ఓలు కనిపించిన ఉదంతాలు చరిత్రలో వందలాదిగా నమోదయ్యాయి. మన దేశంలో తొలిసారిగా ఢిల్లీలో ఒక ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన పాతిక మంది సభ్యులు 1951 మార్చి 15న యూఎఫ్ఓను చూశారు. పొగచుట్ట ఆకారంలో దాదాపు వంద అడుగుల పొడవున్న యూఎఫ్ఓ ఆకాశంలో శరవేగంగా ఎగురుతూ కనుమరుగైనట్లు వారు చెప్పారు. ఆ తర్వాత 1954 సెప్టెంబర్ 15న యూఎఫ్ఓ కనిపించిన ఉదంతం వార్తలకెక్కింది. బిహార్‌లోని మన్భూమ్ జిల్లాలో మూడు గ్రామాలకు చెందిన దాదాపు 800 మంది ప్రజలు ఆకాశంలో ఎగిరే పళ్లాన్ని చూసినట్లు చెప్పారు. మధ్యాహ్నం వేళ ఆరుబయట ఉన్న సమయంలో ఆకాశంలో ఎగిరే పళ్లెం కనిపించిందని, దాని వ్యాసం దాదాపు పన్నెండు అడుగులు ఉంటుందని, అది బూడిద రంగులో ఉందని వారు చెప్పారు. ప్రజలు యూఎఫ్ఓలను చూసిన ఉదంతాలు ఎక్కువగా అమెరికాలోనే నమోదయ్యాయి. అయితే, మన దేశంలోనూ యూఎఫ్ఓలు కనిపించిన ఉదంతాలు లేకపోలేదు. గత ఏడాది జూన్ 25న కాన్పూర్‌లో, నవంబర్ 28న గోరఖ్‌పూర్‌లో యూఎఫ్ఓలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు 2007 అక్టోబర్ 29న వేకువ జామున కోల్‌కతాలో కొందరు యూఎఫ్ఓను చూసి వీడియో తీశారు. వెలుగులు చిమ్ముతూ వేగంగా ఆకాశంలో ఎగురుతున్న ఈ యూఎఫ్ఓ దృశ్యాలను తర్వాత కోల్‌కతాలోని బిర్లా ప్లానెటోరియంలో ప్రదర్శించారు. యూఎఫ్ఓల అమీ తుమీ తేల్చడానికి అమెరికా, సోవియట్ రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్, చైనా ప్రభుత్వాలు పలు పరిశోధనలు సాగించాయి. ఇవి ఇప్పటికీ సాగిస్తూనే ఉన్నాయి. చాలాకాలంగా ఈ పరిశోధనలు రహస్యంగానే సాగినా, సమాచార హక్కు చట్టాలు అమలులోకి రావడంతో ఆ రహస్య పరిశోధనలు, వాటి కోసం ప్రభుత్వాలు చేసిన ఖర్చుల వివరాలు బహిర్గతం కాక తప్పలేదు. యూఎఫ్ఓలు, గ్రహాంతరవాసులపై పరిశోధనల కోసం పలు ప్రభుత్వాలు ఇప్పటికే వేల కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా. మరోవైపు కొందరు సంపన్నులు, ప్రైవేటు సంస్థలు కూడా వీటిపై పరిశోధనలు సాగిస్తుండటం విశేషం. ‘అపరిచితుల’ కోసం రాయబారి! గ్రహాంతరాలకు చెందిన ‘అపరిచితుల’ కోసం ఐక్యరాజ్య సమితి ఏకంగా ఒక రాయబారినే నియమించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతరిక్ష వ్యవహారాల కార్యాలయానికి (యునెటైడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది ఔటర్ స్పేస్ అఫైర్స్- యూఎన్‌ఓఓఎస్‌ఏ) అధిపతిగా మలేసియాకు చెందిన అస్ట్రోఫిజిసిస్ట్ మజ్లాన్ ఓత్మన్‌ను 2010 సెప్టెంబర్‌లో ఐరాస నియమించింది. గ్రహాంతరవాసులతో పాటు అంతరిక్షానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలూ ఈ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. అందువల్ల ఓత్మన్‌ను ‘అపరిచితుల’ రాయబారిగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో ‘అపరిచితులు’ గ్రహాంతర వాసులపై ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. వీటిలో హాలీవుడ్ సినిమాలే ఎక్కువ. గ్రహాంతర వాసులపై వచ్చిన మొట్టమొదటి సినిమా ఫ్రెంచి భాషలో తీసిన ‘లె వోయేజ్ డాన్స్ లా లూన్’ (చంద్రుడి పైకి ప్రయాణం) 1902లో వచ్చింది. ఇది మూకీ సినిమా. జూల్స్ వెర్న్ నవలలు ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’, ‘ఎరౌండ్ ది మూన్’తో పాటు మరికొన్ని రచనల ఆధారంగా ఫ్రెంచి దర్శకుడు జార్జెస్ మెలీస్ ఈ సినిమాను రూపొందించారు. దీనికి ఆయనే నిర్మాత కూడా. ఇక బాలీవుడ్లో 1967లో దారాసింగ్ హీరోగా ‘చాంద్ పర్ చఢాయీ’ సినిమా విడుదలైంది. చంద్రయానం ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమాలో యూఎఫ్ఓలు, గ్రహాంతర వాసులు కూడా కనిపిస్తారు. అయితే, అంతకు రెండేళ్ల ముందే దిగ్దర్శకుడు సత్యజిత్ రే ఇలాంటి సినిమా ఒకటి తీసే ప్రయత్నం చేశారు. ఆయన స్వయంగా రాసుకున్న కథ ‘బంకుబాబురొ బొంధు’ (బంకుబాబు స్నేహితుడు) ఆధారంగా ‘ది ఎలీన్’ పేరిట హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘కొలంబియా పిక్చర్స్’ సహకారంతో తలపెట్టిన ఈ సినిమా అర్ధంతరంగానే నిలిచిపోయింది. ఆ తర్వాత ‘ది ఎలీన్’ స్క్రిప్టు ప్రభావంతోనే ‘ఆస్కార్’గ్రహీత స్టీవెన్ స్పీల్బర్గ్ 1982లో ‘ఇ.టి. ది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్’ రూపొందించారు. అయితే, ‘బంకుబాబురొ బొంధు’ను సత్యజిత్ రే తనయుడు సందీప్ రే 2006లో టీవీ సీరియల్‌గా రూపొందించారు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో యూఎఫ్ఓలు, గ్రహాంతర వాసులపై ‘కోయీ మిల్గయా’, ‘క్రిష్’, ‘జోకర్’, ‘చాంద్-2013’, ‘పీకే’వంటి బాలీవుడ్ సినిమాలు చాలానే వచ్చాయి. పాలపుంత పరిస్థితి సువిశాల విశ్వంలో అనంతకోటి నక్షత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు మన గ్యాలెక్సీ అయిన పాలపుంతనే తీసుకుందాం. ఇందులో 20 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. పాలపుంతలాంటి గ్యాలెక్సీలు అంతరిక్షంలో ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్కలేవీ లేవు. పాలపుంతలో ఉన్న వాటిలో కనీసం సగానికి సగం నక్షత్రాల చుట్టూ మన భూమి వంటి గ్రహాలు తిరుగుతూ ఉంటాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవజాలం భూమికి మాత్రమే పరిమితం కాదనుకుంటే, పాలపుంతలో సౌరకుటుంబానికి వెలుపల ఎక్కడో ఒకచోట మిగిలిన గ్రహాల్లో కొన్నింటి మీదైనా జీవజాలం ఉండే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అదే నిజమైతే, ఆ గ్రహాలపై ఇప్పటికే నాగరికత వర్ధిల్లే అవకాశాలు లేకపోలేదు. 1500 ఏళ్ల తర్వాత ఎలీన్స్తో దోస్తానా? ఎగిరే పళ్లాలనే కాదు, వాటిలో వచ్చే గ్రహాంతర వాసులను (ఎలీన్స్) చూశామని చెప్పిన వారు కూడా లేకపోలేదు. అయితే, ఎలీన్స్ ఊహాచిత్రాలే తప్ప వాళ్ల ఫొటోలేవీ ఇంతవరకు వెలుగులోకి రాలేదు. భూమ్మీద నివసించే మనుషులతో ఎలీన్స్ మాటామంతీకి ప్రయత్నించిన దాఖలాలేవీ ఇప్పటి వరకు లేవు. అయితే, భూమ్మీద మనుషులతో ఎలీన్స్ సంబంధాలు నెరపే రోజులు వస్తాయని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాని, ఆ రోజులు రావడానికి కనీసం 1500 ఏళ్లు పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ‘ఇప్పటి వరకు ఎలీన్స్ నుంచి మనకు ఎలాంటి సమాచారం రాలేదు. అయితే, అంతరిక్షం సువిశాల ప్రదేశం. విశాల విశ్వంలో మన మానవులం మాత్రమే మనుగడ సాగిస్తున్నామని భావించడం సరికాదు. ఎప్పుడో ఒకరోజు ఎలీన్స్ నుంచి మనకు సమాచారం అందేరోజు రాకపోదు. అది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. సుమారు 1500 ఏళ్ల తర్వాత ఇది జరగవచ్చనే అంచనా వేస్తున్నాం’ అని అమెరికాలోని కార్నెల్ వర్సిటీ పరిశోధకుడు ఎవాన్ సాల్మనైడ్స్ చెబుతున్నారు. అవీ-ఇవీ... గ్రహాంతరవాసులు తనను కిడ్నాప్ చేశారంటూ కాల్మికియా తొలి అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్నిజోవ్ వార్తల్లోకెక్కారు. యూఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి స్వతంత్రదేశంగా ఏర్పడిన కాల్మికియాకు 1993లో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. పసుపు రంగు కళ్లద్దాలు ధరించి వచ్చిన గ్రహాంతర వాసులు తనను 1997 సెప్టెంబర్ 17న కిడ్నాప్ చేసినట్లు కిర్సాన్ ప్రకటించారు. యూఎఫ్‌ఓలో వారు తనను వేరే గ్రహానికి తీసుకుపోయి, గంటసేపు అక్కడ ఉంచి, తర్వాత తిరిగి భూమ్మీదకు తెచ్చి వదిలేశారని చెప్పారు. ఆకాశంలో కనిపించే ఎగిరే పళ్లాలను మొదట్లో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో పిలిచేవారు. వీటికి ‘ఫ్లయింగ్ సాసర్స్’ అనే పేరు 1947 నుంచి వాడుకలో ఉండేది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎడ్వర్డ్ రపెల్ట్ 1952లో వీటికి ‘అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్’ (యూఎఫ్ఓ)గా నామకరణం చేశాడు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వీటిని ‘యూఎఫ్ఓ’లుగా పేర్కొనడం ప్రారంభమైంది. గ్రహాంతర వాసులపై ఇప్పటికీ చాలామందిలో లేనిపోని అనుమానాలు, భయాలు ఉన్నాయి. యూఎఫ్ఓలలో భూమ్మీదకు వచ్చే ‘అపరిచితులు’ ఇక్కడి మనుషులను కిడ్నాప్ చేస్తారనే వాదనలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ భయాల కారణంగానే అమెరికాలో దాదాపు 40 వేల మంది గ్రహాంతర వాసుల ద్వారా కిడ్నాప్‌కు గురయ్యే ‘ప్రమాదం’ నుంచి రక్షణ కోసం బీమా పాలసీలు కూడా తీసుకున్నారు. - కాల్మికియా తొలి అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్నిజోవ్ -
ఆకాశంలో ఏమిటీ విచిత్రం?
న్యూయార్క్: శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే ఉంటున్నాయి. ఆకాశంలో అరుదుగా కొన్ని దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. అయితే ఇవి ఏంటి అన్నది అంతుపట్టని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఒక్కోసారి రాత్రివేళ గుండ్రని లోతు పళ్లెం ఆకారంలో, మరోసారి ఓ కాంతి సమూహంతో కూడిన దృశ్యం రంగులు, వేగం మారుతూ కనిపిస్తుంది. ఇంకోసారి ఎవరో నడచి వస్తున్నట్టుగా భ్రమ పడతాం. ఇలాంటి దృశ్యాలు చూసినపుడు ఒక్కోసారి వింతగాను, మరోసారి భయంగాను అనిపిస్తుంది. ఇలాంటి ఆకారాలను గుర్తించలేని ఎగిరే వస్తువులు (యూఎఫ్ఓ) గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఈ చిత్రంలోని దృశ్యాన్ని గమనించండి. ఓ జింకపై ఏదో ఆకారం దిగుతున్నట్టుగా కనిపిస్తోంది కదూ! అమెరికాలోని మిసిసిపి కి చెందిన ఒక దంపతులు అడవిలో జింకలను రాత్రి వేళ చిత్రీకరించే ప్రయత్నంలో వారి కెమెరాలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అయితే ఆ ఆకారం ఏంటన్నది మిస్టరీగానే మిగిలింది. ఇదే కాదు ఇలాంటి సంఘటనలు, ఫొటోలు అంతుపట్టని విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి మచ్చకు కొన్ని. అమెరికాలోని నార్త్ కరోలినాలో రంగురంగుల కాంతులు ఆవిష్కృతమయ్యాయి. టెక్సాస్‌లో రెడ్ లైట్లను ఎవరో క్రమపద్ధతిలో మారుస్తుంటారని అధికారులు విశ్వసిస్తారు. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఏవో వింత దీపాలు ప్రత్యక్షమయ్యాయి. నదులు, సరస్సులపై ఎవో అద్భుత కాంతులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. రష్యాలో ఈ మద్య కొందరు ఆందోళనకారులు ప్రదర్శనను నిర్వహించారు. ఆ ప్రదర్శన చిత్రాల్లో ఏవో వింత వింత వస్తువులు కనిపించాయి. ఆందోళనకారుల పైన ఎవరో నిలుచున్నట్టు, వారే ఉద్యమకారులను నడపిపిస్తున్నట్టు అనిపించింది. అమెరికాలోని విండీ సిటీ లో ఒక పెద్ద సరస్సుపైన ఏవో వింత కాంతులు కెమెరాలో కనిపించాయి. ఇవన్నీ ఏవో గ్రహంతర వాసులా లేక ఇతర గ్రహాల నుంచి మనకు తెలియని ఏవో సందేశాలు మోసుకొస్తున్న దూతలా లేక కళ్ల ముందు కలిగిన భ్రమా అన్నది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పలేకపోతున్నారు. ఈ యుఫోల (యుఎఫ్ ఓలు) పై అమెరికా విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తోంది. అంతే కాదు దీని చుట్టూ అనేక సినిమాలు కూడా తయారయ్యాయి. హాలీవుడ్ సినిమాలైన ఈటీ, క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్, ది ఇండిపెండెన్స్ డే ల కథా వస్తువు గ్రహాంతర వాసులే. మన దేశంలోనూ క్రిష్, కోయి మిల్ గయా వంటి హిందీ సినిమాలు ఈ అంశంపైనే తయారయ్యాయి. మొత్తం మీద అమెరికాలో ఇప్పుడు ఈ వింత ఆకారాలపైన విస్తృత చర్చ జరుగుతోంది.