కేంద్రమంత్రిగా టబు!
టబు రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు! ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? టబు కేంద్రమంత్రి బాధ్యతలు స్వీకరించనుంది రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్‌లో! అదీ సంగతి. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాత్రలో టబు నటించనున్నారని బాలీవుడ్ వర్గాల టాక్.
ఉజ్మా అహ్మద్ అనే భారతీయురాలిని పాకిస్థాన్‌కు చెందిన తాహిర్ బెదిరించి, బలవంతంగా పెళ్లి చేసుకోవడం, సుష్మా స్వరాజ్ బాధితురాలికి అండగా నిలిచి, ఇండియాకి రప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ కుమార్ ఇప్పుడు ఉజ్మా అహ్మద్ జీవితకథను తెరపైకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఉజ్మా పాత్రలో పరిణీతి చోప్రా, సుష్మా స్వరాజ్ పాత్రలో టబును ఎంపిక చేసినట్లు సమాచారం.