breaking news
ts state governament
-
తెలంగాణ సాధించుకున్నది భాషతోనే..
వరంగల్ రూరల్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే భాషతో అని ప్రజాకవి, ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా యంత్రాం గం సోమవారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో సన్నాహక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముక్య అతిథిగా హాజరైన గోరేటి వెంకన్న మాట్లాడుతూ ప్రకృతి నేర్పిన పాఠాలే శాశ్వతమని, ఆధునిక పేరుతో జరుగుతున్న కాలుష్యం భావిజీవితానికి గొడ్డలి పెట్టని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పక్షి లక్షణాలు, దాని జీవనంపై తనదైన శైలిలో పాటతో ఉర్రూతలూగించాడు. సీఎం కేసీఆర్‌కు భాషపై ఉన్న అభిరుచే ఈ కార్యక్రమాల నిర్వహణకు కారణమని అన్నారు. సామాజిక ఉత్పత్తిని కాదని మార్కెట్ కల్చర్ ఆధిపత్యం చెలాయించడం వల్లే వృత్తులు ధ్వంసమయ్యాయన్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ భాషపై ప్రేమను పెంచుకోవాలని, ప్రపంచంలో చైనా, జపాన్ దేశాలు ఎంతో ముందు ఉన్నప్పటికీ ఆ దేశాల అధ్యక్షులు మాతృభాషలోనే మాట్లాడతారని గుర్తు చేశారు. సాహిత్యం సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తుందని, కాలానికి అనుగుణంగా సాహిత్యం రావాలని ఆకాంక్షిచారు. ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ మన తెలుగు అజంతా భాష అని, ఎంతో అందంగా ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు మాట్లాడుతూ మాతృభాషపై పట్టు ఉంటే ఇతర భాషలు సులువుగా వస్తాయని చెప్పారు. కవి పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన తెలుగు మహాసభలకు, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహాసభలకు ఎంతో తేడా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, వరంగల్ ఎంపీ దయాకర్, జేసీ ముండ్రాతి హరిత, డీఆర్ఓ హరిసింగ్, డీపీఆర్ఓ కిరణ్మయి, డీఎఫ్ఓ పురుషోత్తం, డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి, డీఈఓ నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బన్నా అయిలయ్య, ముడుంబై వరదాచార్యులు పాల్గొన్నారు. అంతకు ముందు కాళోజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. -
‘తొలిపొద్దు’లో జోగు అంజయ్య కవితలు
జనగామ : పట్టణానికి చెందిన కవి, జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు జోగు అంజయ్యకు అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘తొలిపొద్దు’ శీర్షికన 442 మంది కవుల కవితలను పుస్తకరూపంగా ప్రచురించారు. కాగా, ఇందులో ‘ముఖారవిందం’ పేరిట జోగు అంజయ్య రచించిన కవిత్వానికి సైతం చోటు లభించింది. తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది.. అనే కోణంలో ఆయన ఈ కవిత్వాన్ని రాయడం గమనార్హం.